PRAJA SANKSHEMAM NEWS
Newspaper Banner
Date of Publish : 19 August 2026, 7:26 am Posted by : domalapallygopi@gmail.com

ఈ నెల 29న మిర్యాలగూడలో బీసీ, ఎస్సీ, ఎస్టీ ఆవిర్భావ సదస్సు!

  • జనాభా ప్రాతిపదికన 90 శాతం వాటా, సామాజిక న్యాయం, రాజ్యాధికార సాధనే లక్ష్యం
  • ముఖ్య అతిథిగా హాజరుకానున్న డాక్టర్ విశారదన్ మహారాజ్
  • సదస్సును విజయవంతం చేయాలని పిలుపునిచ్చిన రాష్ట్ర ఉపాధ్యక్షులు రాసాల వినోద్ యాదవ్

మిర్యాలగూడ (ప్రజా సంక్షేమం): మిర్యాలగూడ నియోజకవర్గంలో బహుజన వర్గాల హక్కులు, సామాజిక న్యాయం మరియు రాజ్యాధికార సాధన లక్ష్యంగా బీసీ, ఎస్సీ, ఎస్టీ జేఏసీ ఆధ్వర్యంలో భారీ ఆవిర్భావ సదస్సు నిర్వహించనున్నట్లు బీసీ, ఎస్సీ, ఎస్టీ జేఏసీ రాష్ట్ర ఉపాధ్యక్షులు రాసాల వినోద్ యాదవ్ వెల్లడించారు.
సదస్సు వివరాలు: ఈ నెల 29వ తేదీ ఉదయం 11:00 గంటలకు మిర్యాలగూడ పట్టణంలోని విద్యానగర్‌లో గల శ్రీ ఫంక్షన్ హాల్ నందు ఈ సదస్సు నిర్వహించనున్నారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా బీసీ, ఎస్సీ, ఎస్టీ రాష్ట్ర చైర్మన్ డా. విశారదన్ మహారాజ్ హాజరుకానున్నారు.
ఈ సందర్భంగా రాసాల వినోద్ యాదవ్ మాట్లాడుతూ.. బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ వర్గాలకు జనాభా ప్రాతిపదికన 90 శాతం వాటా దక్కాలని, సామాజిక న్యాయ సాధనపై ఈ సదస్సులో సమగ్రంగా చర్చించనున్నట్లు తెలిపారు. మిర్యాలగూడ నియోజకవర్గ పరిధిలోని బీసీ, ఎస్సీ, ఎస్టీ వర్గాల ప్రజలు, యువత, మేధావులు మరియు ప్రజాసంఘాల ప్రతినిధులు అధిక సంఖ్యలో తరలివచ్చి ఈ ఆవిర్భావ సదస్సును విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు.
ఈ సమావేశంలో నల్గొండ జిల్లా బీసీ, ఎస్సీ, ఎస్టీ జేఏసీ అధ్యక్షులు నెల్లికంటి రాఘవేంద్ర యాదవ్, మలగి యాదయ్య, నల్గొండ జిల్లా స్టీరింగ్ కమిటీ సభ్యులు, జిల్లా నాయకులు రడంపల్లి వంశీ,కిన్నెర రవి, మామిడి జగన్, నేరెళ్ళ లింగయన్ తదితరులు పాల్గొన్నారు.
‘ప్రజా సంక్షేమం’ న్యూస్ రిపోర్ట్: దోమలపల్లి గోపి | 9248307393