– ఎరువుల ధరలలో వ్యత్యాసంతో యూరియా వైపు మొగ్గుచూపుతున్న రైతులు
– డీఏపీ, కాంప్లెక్స్, యూరియా ధరలను రేషనలైజ్ చేయాలి
– తక్కువ ధరకు దొరికే యూరియా విచ్చలవిడి వినియోగంతో నేల, పంటల నాణ్యతకు ముప్పు
– విదేశాలలో మన పంటల ఉత్పత్తులపై తగ్గిపోతున్న గిరాకి
– ఎరువుల ధరలను రేషనలైజ్ చేయాలని కేంద్రాన్ని ఎన్నిసార్లు కోరినా.కానరాని పరిహారపు చర్యలు
– మోతాదు మించి యూరియా వాడకంపై కేంద్రం ఇప్పటికైనా చర్యలు చేపట్టాలి
– ఎరువుల వినియోగంలో సమతుల్యతపై రైతులకు అవగాహన కల్పించాలి
– మంత్రి ఆదేశాలతో రైతునేస్తం కార్యక్రమం ద్వారా మితిమీరిన యూరియా వాడకం అనార్థాలపై నిరంతరం అవగాహన కల్పిస్తున్న అధికారులు
ప్రజాసంక్షేమం న్యూస్ :
ఎరువుల ధరల్లో ఉన్న భారీ వ్యత్యాసం కారణంగా రైతులు తక్కువ ధరకు లభించే యూరియా వైపు ఎక్కువగా మొగ్గుచూపుతున్నారని, ఫలితంగా పంటలకు అవసరమైన పోషకాలను సమతుల్యంగా అందించలేక నేల ఆరోగ్యంపై ప్రతికూల ప్రభావం పడుతోందని వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు పేర్కొన్నారు.తెలంగాణలో యూరియా వినియోగం గత కొన్నేళ్లుగా గణనీయంగా పెరిగింది.2015-16లో 14 లక్షల మెట్రిక్ టన్నులుగా ఉన్న యూరియా వినియోగం 2025-26 నాటికి 20.70 లక్షల మెట్రిక్ టన్నులకు చేరింది. ముఖ్యంగా యూరియా, డీఏపీకి అధిక సబ్సిడీ ఉండటంతో వాటి వినియోగం పెరిగింది. ప్రస్తుతం తెలంగాణలో ఎన్‌పీకే వినియోగ నిష్పత్తి 12.6:4.8:1గా ఉండగా, సిఫారసు చేసిన నిష్పత్తి 4:2:1 మాత్రమే.
యూరియా 45 కిలోల బస్తా సుమారు రూ.240-266కే లభిస్తుండగా, 50 కిలోల డీఏపీ బస్తా రూ.1,350, 19:9:19 కాంప్లెక్స్ ఎరువుల బస్తా రూ.1,750గా ఉంది. ఈ ధరల వ్యత్యాసం కారణంగా రైతులు పంటకు అవసరమైన పోషకాల సమతుల్యతను పట్టించుకోకుండా యూరియా, డీఏపీని అధిక మోతాదులో వినియోగించే పరిస్థితి ఏర్పడుతోంది.
అధిక యూరియా వినియోగంతో నేల ఆరోగ్యానికి నష్టం..
వరి పంటలో సిఫారసు చేసిన మోతాదుతో పోలిస్తే రైతులు అధిక మోతాదులో ఫాస్పరస్, నైట్రోజన్‌ను వినియోగిస్తున్నట్లు గుర్తించారు. మొక్కజొన్నలో సిఫారసు చేసిన మూడు బస్తాల యూరియాకు బదులుగా ఐదు నుంచి పది బస్తాల వరకు యూరియా వినియోగిస్తున్న పరిస్థితి ఉంది. పత్తిలోనూ నైట్రోజన్ వినియోగం సిఫారసు మోతాదుకంటే 10-15 శాతం అధికంగా ఉండగా, పొటాష్ వినియోగం సుమారు 30 శాతం తక్కువగా ఉంది.ఈ అసమతుల్య ఎరువుల వినియోగం వల్ల నేలలో జింక్, బోరాన్ వంటి సూక్ష్మ పోషకాల లోపాలు ఏర్పడటంతో పాటు నైట్రోజన్ లీచింగ్ పెరిగి నేల, నీటి కాలుష్యానికి దారితీస్తోంది. అంతేకాకుండా చీడపీడలు, తెగుళ్ల ఉధృతి పెరిగి రైతులకు సాగు ఖర్చులు మరింత పెరుగుతున్నాయి.అధిక మోతాదులో యూరియా వినియోగం కేవలం నేల ఆరోగ్యానికే కాకుండా పంటల నాణ్యతపై కూడా ప్రభావం చూపే అవకాశం ఉంది. నాణ్యమైన వ్యవసాయ ఉత్పత్తులపై అంతర్జాతీయ మార్కెట్లలో ఉన్న డిమాండ్‌ను కాపాడుకోవాలంటే ఎరువుల వినియోగంలో సమతుల్యత పాటించడం అత్యంత అవసరం అని మంత్రి అన్నారు.
ఎరువుల ధరలను రేషనలైజ్ చేయాలి..
యూరియా, డీఏపీ, కాంప్లెక్స్ ఎరువుల ధరల మధ్య ఉన్న వ్యత్యాసాన్ని తగ్గించి, రైతులు పంటకు అవసరమైన అన్ని పోషకాలను సమతుల్యంగా వినియోగించేలా ధరల విధానాన్ని రేషనలైజ్ చేయాల్సిన అవసరం ఉందని మంత్రి అభిప్రాయపడ్డారు.ఎరువుల ధరల రేషనలైజేషన్ కోసం కేంద్ర ప్రభుత్వానికి పలుమార్లు విజ్ఞప్తి చేసినప్పటికీ, ఎటువంటి స్పందన కనిపించడం లేదని మంత్రి తుమ్మల అన్నారు.మోతాదుకు మించి యూరియా వినియోగాన్ని తగ్గించేలా కేంద్ర ప్రభుత్వం ఇప్పటికైనా తగిన చర్యలు చేపట్టాలని కోరారు.ఒకవైపు ప్రకృతి వ్యవసాయం, సేంద్రీయ వ్యవసాయాన్ని ప్రోత్సహించాల్సిన అవసరం ఉందని చెబుతూ.. మరోవైపు ఎరువుల ధరలపై రేషనలైజేషన్‌పై ఎలాంటి చర్యలు తీసుకోకపోవడం సరికాదని మంత్రి తుమ్మల అన్నారు. యూరియా తక్కువ ధరకు లభిస్తుండటం, ఇతర ఎరువులు అధిక ధరకు లభిస్తుండటంతో రైతులు సహజంగానే తక్కువ ధరలో లభించే యూరియా వైపు మొగ్గుచూపుతున్నారని, దీని వల్ల నేల ఆరోగ్యం దెబ్బతినడంతో పాటు పంటల నాణ్యతపైనా ప్రభావం పడే అవకాశం ఉందని మంత్రి పేర్కొన్నారు.రైతుల ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని ఎరువుల ధరల విధానంలో సమతుల్యత తీసుకురావాల్సిన బాధ్యత కేంద్ర ప్రభుత్వంపై ఉందని స్పష్టం చేశారు.రైతులు సమతుల్య ఎరువుల వినియోగం వైపు వెళ్లేలా ధరల విధానాన్ని మార్చకుండా, కేవలం యూరియా వినియోగాన్ని తగ్గించాలని రైతులకు సూచించడం వల్ల ఆశించిన ఫలితాలు రావని మంత్రి అన్నారు. కేంద్ర ప్రభుత్వం ఈ అంశాన్ని సీరియస్‌గా పరిగణించి, ఎరువుల ధరలను రేషనలైజ్ చేసి నేల ఆరోగ్యాన్ని, పంటల నాణ్యతను కాపాడేందుకు తక్షణ చర్యలు చేపట్టాలని కోరారు.
సిఫారసు చేసిన మోతాదులోనే ఎరువుల వినియోగం..
రైతులు పంటలకు శాస్త్రవేత్తలు సిఫారసు చేసిన మోతాదులోనే ఎరువులను వినియోగించేలా చూడాలని మంత్రి తుమ్మల వ్యవసాయ శాఖ అధికారులకు సూచించారు. పశువుల ఎరువు, పచ్చిరొట్ట ఎరువులు, వర్మీకంపోస్ట్, బయోఫెర్టిలైజర్స్ వంటి ప్రత్యామ్నాయ పోషక వనరులను కూడా వినియోగించుకోవాలని సూచించారు. యూరియా, డీఏపీకి ప్రత్యామ్నాయంగా నానో యూరియా, నానో డీఏపీని సిఫారసు చేసిన మోతాదులో భాగంగా వినియోగించుకోవచ్చని అన్నారు.
రైతునేస్తం ద్వారా అవగాహన..
మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఆదేశాల మేరకు ఎరువుల సమతుల్య వినియోగం, యూరియా అధిక వినియోగం వల్ల కలిగే అనర్థాలపై రైతులకు ఎప్పటికప్పుడు అవగాహన కల్పించేందుకు రైతునేస్తం కార్యక్రమం ద్వారా వ్యవసాయ శాఖ చర్యలు చేపడుతోంది.మంగళవారం నిర్వహించిన రైతునేస్తం 104వ భాగంలో ఎరువుల వినియోగం, నానో యూరియా వినియోగం తదితర అంశాలపై శాస్త్రవేత్తలు సూచనలు అందించారు. అదేవిధంగా, కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన Fertilizer Sale App (FFS App) ద్వారా ఎరువుల విక్రయాలను రైతులకు అందుబాటులోకి తీసుకువస్తున్న నేపథ్యంలో, ఈ యాప్ విధానంపై రైతులకు క్షేత్రస్థాయిలో విస్తృత అవగాహన కల్పించాలని వ్యవసాయ శాఖ అధికారులను మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఆదేశించారు. ప్రస్తుతం 22 జిల్లాల్లో ఈ యాప్ ద్వారా ఎరువుల విక్రయాలు జరుగుతుండగా, మిగిలిన జిల్లాల్లోనూ ఈ నెల 27 నుంచి సేవలు అందుబాటులోకి తీసుకురావడానికి చర్యలు చేపడుతున్నారు. FFS యాప్‌లో రైతులు ఎదుర్కొనే సమస్యలను కేంద్ర ప్రభుత్వం నియమించిన నోడల్ అధికారులతో మాట్లాడి సత్వరమే పరిష్కరించేలా అధికారులు చర్యలు తీసుకోవాలని, రైతులకు ఎరువుల లభ్యత, వినియోగ విధానం, సమతుల్య ఎరువుల వినియోగంపై నిరంతరం అవగాహన కల్పించాలని మంత్రి ఆదేశించారు.