PRAJA SANKSHEMAM NEWS
Newspaper Banner
Date of Publish : 09 August 2026, 12:52 pm Posted by : Praja Sankshemam News

ఎస్సీ దివ్యాంగుడి కేసును నీరుగార్చారన్న ఆరోపణలు.. ఎస్సైకి సీఐగా ప్రమోషన్‌పై విమర్శలు

నల్లగొండ జిల్లా హాలియాలో ఎస్సీ దివ్యాంగుడి కేసు వ్యవహారం సంచలనంగా మారింది. దివ్యాంగుడి ఫిర్యాదుపై కేసు నమోదు చేయడంలో జాప్యం చేయడంతో పాటు, ఎఫ్‌ఐఆర్‌లో RPwD Act-2016 సెక్షన్ 92A చేర్చినా దర్యాప్తు, కోర్టు విచారణ సమయంలో ఆ సెక్షన్‌ను సమర్థంగా వినియోగించలేదని బాధితుడు ఆరోపిస్తున్నాడు. ఈ వ్యవహారంపై తెలంగాణ రాష్ట్ర మానవ హక్కుల కమిషన్‌లో ఫిర్యాదు చేయగా Case No. 3026/36/7/2026, తేదీ 27-07-2026గా కేసు నమోదు చేసి విచారణకు ఆదేశించినట్లు బాధితుడు తెలిపాడు.

అసలు ఘటన ఏమిటి?

నల్లగొండ జిల్లా అనుముల మండలం ఇబ్రహీంపేట గ్రామానికి చెందిన తలారి శంకర్ అలియాస్ శంకరయ్య ఎస్సీ దివ్యాంగుడు. ఆయనకు సంబంధించిన FIR No.140/2024 ఈ వివాదానికి కేంద్రంగా ఉంది.

“మన ఊరు మన నగర పంచాయతీ” పేరుతో ఉన్న వాట్సాప్ గ్రూపులో తన దివ్యాంగత్వాన్ని అవమానిస్తూ లింగాల ప్రభాకర్ అసభ్య పదజాలంతో దూషించాడని శంకర్ ఫిర్యాదు చేశాడు.

ఫిర్యాదు తర్వాత ఐదు నెలల జాప్యం?

బాధితుడి వివరాల ప్రకారం, 06-03-2024న హాలియా పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. RPwD Act-2016 ప్రకారం చర్యలు తీసుకోవాలని కోరినప్పటికీ, అప్పటి ఎస్సై డి. సతీష్ రెడ్డి కేసు నమోదులో సుమారు ఐదు నెలలు జాప్యం చేశారని బాధితుడు ఆరోపిస్తున్నాడు.

చివరకు 03-08-2024న FIR నమోదు కాగా, IPC 290తో పాటు RPwD Act-2016లోని సెక్షన్ 92Aను కూడా చేర్చినట్లు తెలుస్తోంది. అయితే దర్యాప్తు సమయంలో RPwD చట్టంలోని నిబంధనలను సమర్థంగా అమలు చేయలేదని బాధితుడు ఆరోపిస్తున్నాడు.

మానవ హక్కుల కమిషన్‌ను ఆశ్రయించిన బాధితుడు

ఈ వ్యవహారంపై న్యాయం కోసం బాధితుడు తెలంగాణ రాష్ట్ర మానవ హక్కుల కమిషన్‌ను ఆశ్రయించాడు. కమిషన్ 27-07-2026న Case No. 3026/36/7/2026గా కేసు నమోదు చేసి విచారణకు ఆదేశించినట్లు బాధితుడి వర్గాలు చెబుతున్నాయి.

రూ.1,000 జరిమానాతో కేసు ముగింపు

ఈ కేసులో 30-08-2024న చార్జ్‌షీట్ దాఖలు చేసినట్లు బాధితుడి వివరాలు పేర్కొంటున్నాయి. అయితే RPwD Act-2016 సెక్షన్ 92Aపై కోర్టులో సరైన వాదనలు వినిపించలేదని ఆరోపణలు ఉన్నాయి.

04-03-2026న నిడమానూరు JFCM కోర్టు ఈ కేసును IPC 290 కింద విచారించి రూ.1,000 జరిమానాతో ముగించినట్లు బాధితుడు పేర్కొన్నాడు.

దీంతో సంఘటన జరిగి రెండేళ్లు దాటుతున్నప్పటికీ RPwD Act ప్రకారం తనకు పూర్తి న్యాయం జరగలేదని బాధితుడు ఆవేదన వ్యక్తం చేస్తున్నాడు.

ఎస్సై నుంచి సీఐగా పదోన్నతిపై ప్రశ్నలు

ఈ కేసులో అప్పటి దర్యాప్తు అధికారిగా ఉన్న ఎస్సై డి. సతీష్ రెడ్డికి అనంతరం సీఐగా పదోన్నతి రావడం కూడా చర్చనీయాంశంగా మారింది. 23-06-2026న ఆయనను చౌటుప్పల్ గ్రామీణ సీఐగా బదిలీ చేసినట్లు బాధితుడి వర్గాలు తెలిపాయి.

దీంతో “కేసు దర్యాప్తులో నిర్లక్ష్యం చేశారన్న ఆరోపణలు ఉన్న అధికారికి పదోన్నతి ఎలా వచ్చింది?” అంటూ దివ్యాంగుల హక్కుల సంఘాలు ప్రశ్నిస్తున్నాయి.

నిందితుడే దర్యాప్తు అధికారిని సన్మానించాడన్న ఆరోపణ

ఈ వ్యవహారంలో మరో అంశం కూడా చర్చకు వచ్చింది. కేసులో నిందితుడిగా పేర్కొన్న లింగాల ప్రభాకర్, దర్యాప్తు అధికారిగా ఉన్న డి. సతీష్ రెడ్డిని 26-11-2024న హాలియా పోలీస్ స్టేషన్‌లో సన్మానించాడని బాధితుడి వర్గాలు ఆరోపిస్తున్నాయి.

అదేవిధంగా సతీష్ రెడ్డి సీఐగా పదోన్నతి పొంది చౌటుప్పల్ గ్రామీణకు బదిలీ అయిన సందర్భంగా 23-06-2026న కూడా అదే వ్యక్తి సన్మానించాడని వారు చెబుతున్నారు.

కేసు దర్యాప్తు కొనసాగుతున్న సమయంలో నిందితుడు, దర్యాప్తు అధికారిని సన్మానించడం పలు అనుమానాలకు తావిస్తోందని బాధితుడి వర్గాలు పేర్కొంటున్నాయి.

దివ్యాంగుల సంఘాల డిమాండ్

ఈ వ్యవహారంపై సమగ్ర విచారణ జరిపించాలని దివ్యాంగుల హక్కుల సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. RPwD Act-2016 సెక్షన్ 92Aను FIRలో నమోదు చేసి, తదుపరి దర్యాప్తు మరియు కోర్టు విచారణలో సమర్థంగా ముందుకు తీసుకెళ్లకపోవడంపై ప్రత్యేక దర్యాప్తు బృందం (SIT)తో విచారణ జరిపించాలని, బాధ్యులపై చర్యలు తీసుకోవాలని వారు కోరుతున్నారు.

పేర్ల విషయంలోనూ వివరణ కోరుతున్న బాధితుడు

బాధితుడి వివరాల ప్రకారం, FIR మరియు ఆధార్ కార్డులో “శంకర్”, సదరం ఉదయ్, వైద్య ధ్రువీకరణ పత్రాల్లో “శంకరయ్య” అనే పేరు నమోదై ఉంది. ఈ పేర్ల వ్యత్యాసాన్ని కూడా సంబంధిత అధికారులు పరిగణనలోకి తీసుకోవాలని బాధితుడు కోరుతున్నాడు.