PRAJA SANKSHEMAM NEWS
Newspaper Banner
Date of Publish : 12 August 2026, 2:42 pm Posted by : Praja Sankshemam News

గోదావరి జలాల‌ను గ‌రిష్ట స్థాయిలో వినియోగించుకోవాలి: ముఖ్య‌మంత్రి శ్రీ ఎ. రేవంత్ రెడ్డి



ప్రజా సంక్షేమం న్యూస్
గోదావరి జలాల‌ను గ‌రిష్ట స్థాయిలో వినియోగించుకోవాల‌ని ముఖ్య‌మంత్రి శ్రీ ఎ. రేవంత్ రెడ్డి గారు అధికారులను ఆదేశించారు. ఎల్లంప‌ల్లితో పాటు దేవాదుల‌, సీతారామ ప్రాజెక్టుల‌ నుంచి సాధ్య‌మైనంత మేర‌కు ఎత్తిపోత‌లు చేప‌ట్టాల‌న్నారు.ముఖ్యమంత్రి గారు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారితో పాటు ఉన్నతాధికారులతో నీటి పారుద‌ల శాఖ‌పై ఎంసీఆర్‌హెచ్ఆర్‌డీలో స‌మీక్ష నిర్వ‌హించారు.దేవాదుల నుంచి గ‌తంలో ఎన్న‌డూ లేని విధంగా 9 పంపుల‌తో ఎత్తిపోత‌లు చేప‌ట్టామ‌ని సమావేశంలో మంత్రి గారు వివరించారు. దేవాదుల‌, సీతారామ‌ ప్రాజెక్టుల నుంచి ఎత్తిపోత‌ల‌కు సంబంధించి ఏవైనా చిన్న చిన్న స‌మ‌స్య‌లుంటే అధికారులు వాటి ప‌రిష్కారంపై ప్ర‌త్యేకంగా దృష్టిసారించాల‌ని ముఖ్యమంత్రి గారు సూచించారు.ప‌లు ప్రాజెక్టుల కింద ఒక‌ట్రెండు గ్రామాలు, కొద్దిపాటి వ్య‌వ‌సాయ భూముల‌కు ప‌రిహారం చెల్లింపు అంశాలు పెండింగ్‌లో ఉన్నాయ‌ని, వాటిని వెంట‌నే చెల్లించేందుకు కార్యాచ‌ర‌ణ రూపొందించాల‌ని ఆదేశించారు. నీటి పారుద‌ల‌, రెవెన్యూ అధికారులు క్షేత్ర స్థాయిలో ప‌ర్య‌టించి ముంపు గ్రామాలు, ప‌రిహారం, పున‌రావాసానికి సంబంధించి వాస్త‌వ నివేదిక రూపొందించాల‌ని ఆదేశించారు.త‌క్ష‌ణ ప్ర‌భావం పడే గ్రామాలకు వెంట‌నే ప‌రిహారం చెల్లించాల‌ని ముఖ్యమంత్రి గారు సూచించారు. అధికారులు ఆ ప‌నుల‌ను పూర్తి చేస్తే బ‌స్వాపూర్‌, గౌర‌వెల్లి ప్రాజెక్టుల్లో నీరు నింపే అవ‌కాశం ఉంటుంద‌ని తెలిపారు.గ‌ట్టు, గూడెందొడ్డి ఎత్తిపోత‌ల సామ‌ర్థ్యం పెంపున‌కు సంబంధించి స‌మ‌గ్ర అధ్య‌య‌నం చేయాల‌ని ముఖ్యమంత్రి గారు అధికారుల‌ను ఆదేశించారు. గూడెందొడ్డి పంప్డ్‌స్టోరేజీ ప్రాజెక్టుకు సంబంధించి క‌న్స‌ల్టెంట్ నియ‌మించాల‌ని ఆదేశించారు.జాతీయ డ్యామ్ సేఫ్టీ అథారిటీ (NDSA) సూచ‌న‌ల మేర‌కే సుందిళ్ల‌, అన్నారం, మేడిగ‌డ్డ బ్యారేజీల్లో నీరు నిల్వ చేయ‌డం లేద‌ని, ఈ విష‌యంలో ఎన్డీఎస్ఏ సూచ‌న‌లు పాటించాల‌న్నారు. మేడిగ‌డ్డ‌తో పాటు సుందిళ్ల బ్యారేజీలోనూ అనేక లోపాలు ఉన్న‌ట్లు తేలింద‌ని మంత్రి తెలిపారు. ఈ విష‌యంలో ఎన్డీఎస్ఏతో సంప్ర‌దించాల‌ని ముఖ్యమంత్రి గారు సూచించారు.