గ్రామాల అభివృద్ధికి గ్రామస్తులందరూ కలిసికట్టుగా ఉండాలని రాష్ట్ర రోడ్లు, భవనాలు, సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి పిలుపునిచ్చారు.
శనివారం ఆయన నల్గొండ జిల్లా, నల్గొండ, తిప్పర్తి మండలాలలో వివిధ గ్రామాలలో అభివృద్ధి కార్యక్రమాలలో పాల్గొన్నారు.
ముందుగా నల్గొండ మండలం, చిన్న సూరారం గ్రామ హమ్లెట్ గ్రామమైన పావురాల గూడెంలో కోటి 35 లక్షల రూపాయల వ్యయంతో నిర్మించిన పిడబ్ల్యుడి రోడ్డును మంత్రి ప్రారంభించారు. చిన్న సూరారం, పెద్ద సూరారం, చందనపల్లి గ్రామాలలో ఏర్పాటుచేసిన సమావేశాలలో గ్రామస్తులతో మాట్లాడారు.
మహిళా సంఘాలను బలోపేతం చేసేందుకు ఆర్థికంగా వారి కాళ్లపై వారు నిలబడి సాధికారత సాధించేలా ప్రభుత్వం తరఫున మహిళా సంఘాలతో రైస్ మిల్లులు ,గోదాములు,ప్రాసెసింగ్ యూనిట్లు ఏర్పాటు చేస్తామని, మహిళలు చిన్నచిన్న వ్యాపారాలతో పాటు, రైస్ మిల్లులు నిర్వహించాలని కోరారు. ఆగస్టు 15 న చిన్న సూరారం గ్రామ మహిళా సంఘాలకు 3 కోట్ల రూపాయలు, పెద్ద సూరారం గ్రామ సంఘాలకు రెండున్నర కోట్లు, చందనపల్లి గ్రామ మహిళా సంఘాలకు కోటి 50 లక్షల రూపాయల రుణాల చెక్కులను అందించనున్నట్లు మంత్రి వెల్లడించారు.
చిన్న సూరారం, పెద్ద సూరారం గ్రామాల మధ్య వెర్ హోసింగ్ గోదాం లేదా రైస్ మిల్ ఏర్పాటు చేసేందుకు 5 నుండి 10 ఎకరాల స్థలాన్ని చూడాలని అధికారులను మంత్రి ఆదేశించారు. పావురాల గూడెంలో చౌకధర దుకాణాన్ని మంజూరు చేయడమే కాకుండా, వెంటనే డీలర్ ను నియమించాలని ఆదేశించారు. ఆయా గ్రామాలలో నిర్మాణంలో ఉన్న గ్రామ సంఘాల భవనాలను నిర్మాణాన్ని సాధ్యమైనంత త్వరగా పూర్తి చేయాలని ఆదేశించారు. మహిళా సంఘాలకు గరిష్టంగా బ్యాంకు లింకేజీ రుణాలు ఇవ్వాలని డి ఆర్ డి ఓ ను ఆదేశించారు.మహిళలు తీసుకున్న రుణాలను సకాలంలో తిరిగి చెల్లించాలని కోరారు. మహిళలు రుణాలను సద్వినియోగం చేసుకోవాలని తద్వారా కుటుంబాల అభివృద్ధి చెందుతాయన్నారు. నల్గొండ, కనగల్, తిప్పర్తి మండలాలలో మహిళా సంఘాల చేత రైస్ మిల్లులను ఏర్పాటు చేసేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు మంత్రి వెల్లడించారు.
రాష్ట్ర ప్రభుత్వం గుడిసెల్లో ఎవరు ఉండరాదన్న ఉద్దేశంతో ప్రతి ఒక్కరికి 5 లక్షల రూపాయలతో ఇందిరమ్మ ఇండ్లు నిర్మిస్తున్నదని, మొదటి విడత రాష్ట్రవ్యాప్తంగా ఇండ్లు ఇవ్వడం జరిగిందని,రెండవ విడత గుడిసెలలో నివసించేవారికి ప్రాధాన్యత ఇస్తున్నట్లు తెలిపారు. ప్లాట్లు ఉన్న వారికి కూడా ఇండ్లు నిర్మించి ఇస్తామని చెప్పారు. అందరికీ రేషన్ కార్డులతో పాటు, సన్న బియ్యం ఇస్తున్నామని,రాష్ట్ర వ్యాప్తంగా మూడు కోట్ల 25 లక్షల మందికి సన్న బియ్యం ఇస్తున్నామని చెప్పారు. రాష్ట్రంలో 20000 కోట్ల రూపాయలతో ఆర్ అండ్ బి రహదారులు నిర్మిస్తున్నామన్నారు.
ఇకపై తాను గ్రామాలలో నిరంతరం పర్యటిస్తానని, వారానికి ఒకరోజు గ్రామాలు తిరుగుతానని, ఆదివారం నల్గొండ మున్సిపల్ కార్పొరేషన్ లో పర్యటిస్తానని, అభివృద్ధి కార్యక్రమాలకు ఎలాంటి నిధుల కొరత లేదని చెప్పారు.
చందనపల్లి గ్రామ డంపింగ్ యార్డ్ సమస్యను పరిష్కరించేందుకు చర్యలు తీసుకుంటామని, గ్రామ సమీపంలో ఉన్న డంపింగ్ యార్డ్ లో చెత్తను ఖాళీ చేయిస్తున్నామని, ప్రజలు లేని చోట డంపింగ్ ఏర్పాటు చేసేందుకు చర్యలు తీసుకోవాలని ఇదివరకే జిల్లా కలెక్టర్ ను ఆదేశించినట్లు చెప్పారు.
ప్రతి గ్రామంలో ఒక సబ్ స్టేషన్ ఏర్పాటుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటున్నదని ,70% గ్రామాలలో సబ్స్టేషన్లు ఉన్నాయని మంత్రి తెలిపారు. అలాగే గ్రామంలోని పాఠశాలలో కంప్యూటర్లు ఏర్పాటు చేసి విద్యార్థులకు కంప్యూటర్ విద్య అందించేందుకు చర్యలు తీసుకుంటామని తెలిపారు .
జిల్లా కలెక్టర్ బి. చంద్రశేఖర్, స్థానిక సంస్థల ఇంచార్జ్ అదనపు కలెక్టర్ ప్రేమ్ కరణ్ రెడ్డి, డిఆర్డిఓ శేఖర్ రెడ్డి, ఆర్ అండ్ బి ఎస్ ఈ మోహన్, పంచాయతి రాజ్ ఈ ఈ గిరిధర్, ఆర్ అండ్ బి ఈ ఈ శ్రీధర్ రెడ్డి, మాజీ జెడ్పిటిసి లక్ష్మయ్య, విజిలెన్స్ మానిటరింగ్ కమిటీ సభ్యురాలు ధనలక్ష్మి, మాజీ జెడ్పిటిసి గుమ్మల మోహన్ రెడ్డి, ఇతర ప్రజాప్రతినిధులు, తహసిల్దార్ పరశురాం ,ఎంపీడీవో యాకూబ్, అధికారులు,ఆయా గ్రామాల సర్పంచులు, ప్రజాప్రతినిధులు మంత్రి వెంట ఉన్నారు.