PRAJA SANKSHEMAM NEWS
Newspaper Banner
Date of Publish : 22 August 2026, 6:17 pm Posted by : Praja Sankshemam News

తెలంగాణ రైజింగ్ ప్రతినిధి బృందం కేంబ్రిడ్జ్ విశ్వవిద్యాలయం విద్యావేత్తల బృందంతో ఫలప్రదమైన సమావేశం!

ప్రజా సంక్షేమం న్యూస్
తెలంగాణ రైజింగ్ ప్రతినిధి బృందం కేంబ్రిడ్జ్ విశ్వవిద్యాలయం విద్యావేత్తల బృందంతో ఫలప్రదమైన సమావేశం నిర్వహించింది. ముఖ్యమంత్రి శ్రీ ఎ.రేవంత్‌రెడ్డి గారి నేతృత్వంలోని ఈ బృందం తెలంగాణలో విద్యా,పరిశోధన రంగాల్లో భాగస్వామ్య అవకాశాలపై కేంబ్రిడ్జ్ యూనివర్సిటీ ప్రతినిధులతో విస్తృతంగా చర్చించింది.ఈ సమావేశంలో ముఖ్యమంత్రి గారితో పాటు ఐటీ,పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు గారు, సీఎం సలహాదారు, ఎక్స్‌అఫీషియో ప్రత్యేక ప్రధాన కార్యదర్శి కె రామకృష్ణారావు గారు, ప్రత్యేక ప్రధాన కార్యదర్శి జయేశ్‌ రంజన్ గారు పాల్గొన్నారు. ప్రపంచంలోని అత్యుత్తమ విద్యా సంస్థలకు హైదరాబాద్‌లో ఉన్న అవకాశాలను,కేంబ్రిడ్జ్ ప్రతినిధులకు వివరించారు.హైదరాబాద్‌ను ప్రపంచస్థాయి విజ్ఞాన కేంద్రంగా తీర్చిదిద్దే తెలంగాణ ప్రభుత్వ లక్ష్యంలో భాగస్వాములు కావాలని ఆహ్వానించారు.కేంబ్రిడ్జ్ జడ్జ్ బిజినెస్ స్కూల్‌లో భారత ప్రభుత్వ ఆధ్వర్యంలోని మార్కెటింగ్ చైర్ ప్రొఫెసర్ జైదీప్ ప్రభు గారు, అదే సంస్థకు చెందిన ప్రొఫెసర్ వెంకట సిరీష్ గండికోట గారు,‘ఫ్రూగల్ ఏఐ’ కో-చైర్ తెలంగాణతో కలిసి పనిచేసేందుకు ఆసక్తి వ్యక్తం చేశారు. తెలంగాణలో ఉన్న అవకాశాలపై వారు ప్రత్యేకంగా సానుకూలంగా స్పందించారు.హైదరాబాద్‌లో విద్యా కార్యక్రమాలు నిర్వహించడం, సంయుక్తంగా పరిశోధనలు చేపట్టడం, యువ పారిశ్రామికవేత్తలకు అవసరమైన ఇంక్యుబేషన్,స్టార్టప్‌ల అభివృద్ధికి సహకరించడం వంటి అంశాల్లో భాగస్వామ్యానికి ఒక స్పష్టమైన కార్యాచరణ ప్రణాళిక రూపొందించుకోవాలని ఇరు వర్గాలు అంగీకరించాయి.ప్రపంచ ప్రఖ్యాత కేంబ్రిడ్జ్ విశ్వవిద్యాలయంతో తెలంగాణ భాగస్వామ్యానికి ఈ చర్చలు కొత్త మార్గం చూపనున్నాయి. హైదరాబాద్‌ను అంతర్జాతీయ విద్యా, పరిశోధన, ఆవిష్కరణల కేంద్రంగా తీర్చిదిద్దాలన్న ‘తెలంగాణ రైజింగ్’ లక్ష్యానికి ఈ సమావేశం మరింత బలం చేకూర్చనుంది.