PRAJA SANKSHEMAM NEWS
Newspaper Banner
Date of Publish : 23 August 2026, 1:28 pm Posted by : Praja Sankshemam News

నల్లగొండను సూపర్ స్మార్ట్ సిటీగా తీర్చిదిద్దడమే లక్ష్యం:మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి

–రూ.1,400 కోట్లతో అభివృద్ధి పనులు
–రూ.10 కోట్లతో త్వరలో లైబ్రరీ పనులకు శంకుస్థాపన
–ఎస్ఎల్ బిసి పనులలో పురోగతి, ఆగస్టు 2028 నాటికి పూర్తి చేస్తాం
–రాష్ట్ర రోడ్లు,భవనాలు,సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి
–నూతనంగా నిర్మించిన అతిధి గృహం,కాన్ఫరెన్స్ హాల్ ను ప్రారంభించిన మంత్రి

నల్గొండ ప్రతినిధి-ప్రజా సంక్షేమం న్యూస్
నల్లగొండ పట్టణాన్ని సూపర్ స్మార్ట్ సిటీగా తీర్చిదిద్దడంతో పాటు,నల్లగొండ నియోజకవర్గాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేయడమే తన జీవిత లక్ష్యమని రాష్ట్ర రోడ్లు,భవనాలు,సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి అన్నారు.ఆదివారం నల్లగొండ పట్టణంలోని నల్లగొండ క్లబ్‌లో రూ.2 కోట్లతో నూతనంగా నిర్మించిన గెస్ట్ రూమ్,కాన్ఫరెన్స్ హాల్ ను నగర మేయర్ బుర్రి చైతన్య శ్రీనివాస్ రెడ్డితో కలిసి ప్రారంభించారు.ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ నల్లగొండ క్లబ్‌లో మంచి వాతావరణం ఉందని, పట్టణ ప్రజలకు ఇది ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని అన్నారు.క్లబ్ అభివృద్ధికి తన వంతు సహకారం ఎల్లప్పుడూ ఉంటుందని తెలిపారు నల్లగొండ పట్టణ ప్రజలకు 24 గంటల తాగునీరు అందించేందుకు రూ.125 కోట్లతో పనులు చేపట్టడం జరిగిందని, ఆరు నెలల్లో పనులు పూర్తిచేసి తాగునీరు అందించేందుకు చర్యలు తీసుకుంటామని చెప్పారు.ఎస్‌ఎల్‌బీసీ సొరంగ మార్గం పూర్తి చేయడం తన ప్రధాన లక్ష్యాల్లో ఒకటని,సీఎం ఇచ్చిన హామీ మేరకు మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి సహకారంతో నిధులు సమకూర్చుకుని పనులను ముందుకు తీసుకెళ్తున్నామని తెలిపారు.ఆగస్టు 2028 నాటికి సొరంగ పనులను పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నామని చెప్పారు.గతంలో రూ.2 వేల కోట్లు ఉన్న ఎస్ ఎల్ బి సి అంచనా వ్యయం ప్రస్తుతం రూ.5 వేల కోట్లకు పెరిగిందని,సొరంగ పనుల్లో ఇప్పటికే చాలా పురోగతి సాధించామని తెలిపారు.
ప్రతి ఎకరాకు సాగునీరు అందించాలనే లక్ష్యంతో ప్రాజెక్టులను ముందుకు తీసుకెళ్తున్నామని మంత్రి చెప్పారు. నల్లగొండ పట్టణ అభివృద్ధిలో భాగంగా రూ.900 కోట్లతో ఔటర్ రింగ్ రోడ్డు నిర్మిస్తున్నామని, పట్టణంలో ట్రాఫిక్ ప్రమాదాలను తగ్గించడంతో పాటు, నల్లగొండను అందమైన నగరంగా తీర్చిదిద్దేందుకు రోడ్ల అభివృద్ధికి పెద్దపీట వేస్తున్నామని ,సుమారు రూ.1,400 కోట్ల విలువైన పనులు ప్రస్తుతం కొనసాగుతున్నాయని చెప్పారు. రూ.300 కోట్లతో అండర్ డ్రైనేజీ వ్యవస్థను అభివృద్ధి చేసి ప్రతి వార్డులో సీసీ రోడ్లు, డబల్ రోడ్లు నిర్మిస్తామని తెలిపారు. నేషనల్ ఫండ్ నుంచి రూ.15 కోట్లతో పట్టణంలోని రోడ్లను అభివృద్ధి చేసి పరిశుభ్రంగా ఉంచేందుకు చర్యలు తీసుకుంటామని చెప్పారు.
రాష్ట్రవ్యాప్తంగా రూ.1,300 కోట్లతో హ్యమ్ రోడ్ల పనులు చేపడుతున్నామని,ఉమ్మడి నల్లగొండ జిల్లాలో రూ.2,500 కోట్లతో రోడ్ల నిర్మాణానికి చర్యలు తీసుకుంటున్నామని మంత్రి తెలిపారు. తాను ఎక్కడ ఉన్నా నల్లగొండకు అత్యంత ప్రాధాన్యం ఇస్తానని స్పష్టం చేశారు.నల్లగొండ క్లబ్ అభివృద్ధికి పక్కనే ఉన్న ఎకరం స్థలాన్ని కూడా సమకూర్చేందుకు చర్యలు తీసుకుంటానని మంత్రి హామీ ఇచ్చారు.కలెక్టర్‌తో మాట్లాడి క్లబ్‌కు భూమి ఇప్పించేందుకు కృషి చేస్తానని తెలిపారు. హైదరాబాద్ జూబ్లీహిల్స్‌లోని క్లబ్ మాదిరిగా నల్లగొండ క్లబ్‌ను కూడా మరింత అభివృద్ధి చేసేందుకు సహకరిస్తానని చెప్పారు.నల్గొండ పట్టణంలోని బొట్టుగూడ పాఠశాల నిర్మాణానికి రూ.12 కోట్లు కేటాయించి అభివృద్ధి చేశానని మంత్రి తెలిపారు. విద్యార్థుల భవిష్యత్‌ను దృష్టిలో పెట్టుకుని పాత టౌన్‌లో రూ.10 కోట్లతో త్వరలో లైబ్రరీ నిర్మించడంతో పాటు,విద్యార్థులకు కోచింగ్,ఫౌండేషన్ సౌకర్యాలు కల్పించేందుకు చర్యలు తీసుకుంటామని చెప్పారు.
నల్లగొండ పట్టణం,నియోజకవర్గ అభివృద్ధికి అవసరమైన ప్రతి పనిని ప్రాధాన్యతతో చేపట్టి ప్రజలకు మెరుగైన మౌలిక వసతులు కల్పించడమే తన లక్ష్యమని మంత్రి అన్నారు. నగర మేయర్ బుర్రి చైతన్య శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి సహకారంతో కార్పొరేషన్ లో వందల కోట్ల రూపాయలతో ఎన్నో అభివృద్ధి పనులు జరుగుతున్నాయని అన్నారు.నల్లగొండ క్లబ్ అభివృద్ధికి కార్పొరేషన్ తరపున పూర్తి సహకారం అందిస్తామని తెలిపారు. కార్యక్రమంలో స్థానిక సంస్థల ఇంచార్జ్ అదనపు కలెక్టర్ ప్రేమ్ కరణ్రెడ్డి, ఆర్డీవో వై.అశోక్ రెడ్డి ,క్లబ్ అధ్యక్షుడు గోలి అమరేందర్ రెడ్డి,మాజీ మున్సిపల్ చైర్మన్ బుర్రి శ్రీనివాస రెడ్డి, మాజీ జెడ్పిటిసి గుమ్ముల మోహన్ రెడ్డి,స్థానిక కార్పొరేటర్ ఏదుళ్ళ శ్రీధర్ రెడ్డి, గుమ్మల జానకి రెడ్డి , క్లబ్ సెక్రటరీ చల్ల వెంకటరమణ, కాసర్ల వెంకటరెడ్డి క్లబ్ మెంబర్స్ డాక్టర్ పుల్లారావు తదితరులు పాల్గొన్నారు.