PRAJA SANKSHEMAM NEWS
Newspaper Banner
Date of Publish : 29 August 2026, 7:34 am Posted by : domalapallygopi@gmail.com

నాయి బ్రాహ్మణ కార్పొరేషన్‌ను వెంటనే ఏర్పాటు చేయాలి: యాదాద్రి భువనగిరి జిల్లా అధ్యక్షుడు వేముల సత్యనారాయణ

ప్రజా సంక్షేమం న్యూస్: యాదాద్రి భువనగిరి:
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన వివిధ కార్పొరేషన్ చైర్మన్ పదవుల్లో నాయి బ్రాహ్మణులకు స్థానం కల్పించకపోవడం తీవ్ర నిరాశకు గురిచేసిందని,ప్రభుత్వం నాయి బ్రాహ్మణుల పట్ల చిన్నచూపు చూస్తూ వివక్ష చూపుతోందని యాదాద్రి భువనగిరి జిల్లా నాయి బ్రాహ్మణ సేవా సంఘం అధ్యక్షుడు వేముల సత్యనారాయణ మండిపడ్డారు. శనివారం నిర్వహించిన ముఖ్యుల సమావేశంలో ఆయన మాట్లాడారు.గతంలో అనేకసార్లు వినతిపత్రాల ద్వారా ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లినా స్పందించకపోవడం బాధాకరమన్నారు.ఎన్నికల సమయంలో నాయి బ్రాహ్మణ వృత్తిని కొనియాడిన ముఖ్యమంత్రి,అధికారంలోకి వచ్చాక ఆ వర్గాన్ని విస్మరించారని ఆగ్రహం వ్యక్తం చేశారు. నిజంగా ఆ వర్గంపై ప్రేమ ఉంటే వెంటనే ప్రత్యేక నాయి బ్రాహ్మణ కార్పొరేషన్ ఏర్పాటు చేసి,ఆ వర్గానికి చెందిన వ్యక్తినే చైర్మన్‌గా నియమించాలని డిమాండ్ చేశారు. రాజకీయేతరంగా నిధులు కేటాయించి పేద నాయి బ్రాహ్మణ కుటుంబాలను ఆదుకోవాలని కోరారు.అలాగే,జిల్లాలోని అన్ని మండలాల్లో నూతన కమిటీలను వేసి,నవంబర్ మాసంలో యాదగిరిగుట్టలో జరిగే జిల్లా మహాసభల్లో నూతన జిల్లా కమిటీని ఎన్నుకుంటామని తెలిపారు.ఈ కార్యక్రమంలో నాయి బ్రాహ్మణ సేవా సంఘం జిల్లా కార్యదర్శి సంగం శివ,వర్కింగ్ ప్రెసిడెంట్ వేముల బిక్షం,భువనగిరి టౌన్ అధ్యక్షుడు పత్యాపురం మహేందర్,టౌన్ సెక్రటరీ కానుగంటి ప్రేమ్ కుమార్,జిల్లా కమిటీ సభ్యులు కొల్తూరి వేణుగోపాల్,విశాల్,నరసింహ,మహేష్ తదితరులు పాల్గొన్నారు.
ప్రధాన డిమాండ్లు:
నాయి బ్రాహ్మణులకు సంబంధించిన ఉచిత విద్యుత్ పెండింగ్ బిల్లులను వెంటనే చెల్లించి, విద్యుత్ అధికారుల వేధింపులు ఆపాలి.
ఆధునిక మోడల్ సెలూన్లు ఏర్పాటు చేయాలి.
50 సంవత్సరాలు నిండిన నాయి బ్రాహ్మణులకు పింఛన్ మంజూరు చేయాలి.
అర్హులైన నాయి బ్రాహ్మణులకు ఇండ్లు, ఇండ్ల స్థలాలు, రేషన్ కార్డులు మంజూరు చేయాలి.
దేవాలయాల కళ్యాణ కట్టల్లో పనిచేసే నాయి బ్రాహ్మణులను పర్మినెంట్ చేయాలి మరియు యాదగిరిగుట్ట దేవస్థానం కమిటీలో డైరెక్టర్ పదవి కేటాయించాలి.
మహిళలకు ఉచిత బ్యూటీ పార్లర్ శిక్షణనిచ్చి షాపులు ఏర్పాటు చేసుకోవడానికి సహకరించాలి.
ఆసుపత్రులు, పోలీస్ శాఖల్లో ఖాళీగా ఉన్న బార్బర్ పోస్టులను తక్షణమే భర్తీ చేయాలి.