PRAJA SANKSHEMAM NEWS
Newspaper Banner
Date of Publish : 17 August 2026, 12:21 pm Posted by : Praja Sankshemam News

పరిశ్రమల అవసరాలకు అనుగుణంగా యువతకు నైపుణ్య శిక్షణ-దేశంలోనే తొలిసారిగా ప్రత్యేక జాబ్‌ పోర్టల్‌!

మహిళా సాధికారతే ప్రభుత్వ లక్ష్యం.. మహాలక్ష్మి హామీ అమలుకు కట్టుబడి ఉన్నాం!
దేశంలోనే తొలిసారిగా ప్రత్యేక జాబ్‌ పోర్టల్‌!
పరిశ్రమల అవసరాలకు అనుగుణంగా యువతకు నైపుణ్య శిక్షణ!
మెదక్‌ ఖిల్లాకు ప్రత్యేక తపాలా కవర్‌ ఆవిష్కరణ!
కస్తూర్బా విద్యాలయంలో నూతన భవన ప్రారంభం:గనుల శాఖ మంత్రి డాక్టర్‌ జీ. వివేక్‌ వెంకటస్వామి

ప్రజా సంక్షేమం న్యూస్
యువతకు నైపుణ్య శిక్షణ, మహిళలకు ఆర్థిక స్వావలంబన, విద్యార్థులకు మెరుగైన విద్యా వసతులు, పారిశ్రామిక రంగానికి అవసరమైన నైపుణ్య మానవ వనరులను అందుబాటులోకి తీసుకురావడమే ప్రభుత్వ లక్ష్యమని శక్తి (కార్మిక, ఉపాధి, శిక్షణ & ఫ్యాక్టరీలు) మరియు గనుల శాఖ మంత్రి డాక్టర్‌ జీ. వివేక్‌ వెంకటస్వామి అన్నారు.
ITDC భాగస్వామ్యంతో ఏర్పాటు చేసిన ప్రత్యేక జాబ్‌ పోర్టల్‌:

మెదక్‌ జిల్లా మనోహరాబాద్‌ మండలం ముప్పిరెడ్డిపల్లిలోని శాంతా బయోటెక్నాలజీస్‌లో మెదక్‌ కలెక్టర్‌, స్థానిక పాలనా యంత్రాంగం, ITDC భాగస్వామ్యంతో ఏర్పాటు చేసిన ప్రత్యేక జాబ్‌ పోర్టల్‌ను మంత్రి ప్రారంభించారు. దేశంలోనే తొలిసారిగా ఈ తరహా పోర్టల్‌ను ఏర్పాటు చేసినట్లు తెలిపారు.ముప్పిరెడ్డిపల్లి పారిశ్రామిక ప్రాంతంలో సుమారు 1,000 పరిశ్రమలు ఉన్నాయని, వాటి అవసరాలకు అనుగుణంగా నైపుణ్యం కలిగిన మానవ వనరులను అందుబాటులోకి తీసుకురావాల్సిన అవసరం ఉందన్నారు. పరిశ్రమలకు ఏ నైపుణ్యాలు అవసరమో ముందుగానే గుర్తించి, యువతకు అదే దిశలో శిక్షణ అందిస్తే ఉద్యోగ అవకాశాలతో పాటు పరిశ్రమల ఉత్పాదకత కూడా పెరుగుతుందని చెప్పారు.పరిశ్రమల అవసరాలకు అనుగుణంగా ITI, పాలిటెక్నిక్‌ కోర్సుల పాఠ్యప్రణాళికల్లో మార్పులు తీసుకువస్తున్నామని మంత్రి తెలిపారు. పరిశ్రమల యాజమాన్యాలతో నేరుగా చర్చించి వారి అవసరాలను తెలుసుకుని, అందుకు అనుగుణంగా కోర్సులను రూపొందించాల్సిన అవసరం ఉందన్నారు.ఉద్యోగాల పేరుతో ఏజెన్సీలకు డబ్బులు చెల్లించే పరిస్థితి లేకుండా టామ్‌కామ్‌ ద్వారా పారదర్శకంగా ఉద్యోగ అవకాశాలను కల్పించేందుకు చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు. జర్మన్‌, జపనీస్‌ భాషల్లో శిక్షణ అందించి విదేశాల్లోనూ మెరుగైన ఉపాధి అవకాశాలు కల్పిస్తున్నామని తెలిపారు.ఉద్యోగ మార్కెట్‌ వేగంగా మారుతున్న నేపథ్యంలో యువత కూడా తమ ఆలోచనా విధానాన్ని మార్చుకోవాలని మంత్రి సూచించారు. కేవలం సాంప్రదాయ కోర్సులు చదివి ఉద్యోగాల కోసం ఎదురు చూడకుండా, భవిష్యత్తులో డిమాండ్‌ ఉన్న నైపుణ్యాలను గుర్తించి వాటిని నేర్చుకోవాలని అన్నారు. ఉద్యోగ అవకాశాలు ఎక్కడ ఉంటే అక్కడికి వెళ్లేందుకు యువత సిద్ధంగా ఉండాలని సూచించారు.
తెలంగాణకు నాలుగు PM-SETU క్లస్టర్లు
స్కిల్‌ డెవలప్‌మెంట్‌లో తెలంగాణ దేశంలోనే ముందంజలో ఉందని మంత్రి తెలిపారు. PM-SETU కార్యక్రమం కింద రాష్ట్రానికి నాలుగు క్లస్టర్లు మంజూరయ్యాయని చెప్పారు. పరిశ్రమల భాగస్వామ్యంతో నైపుణ్య శిక్షణా సంస్థలను ఆధునీకరించి, పరిశ్రమలకు అవసరమైన మానవ వనరులను తయారు చేయడంపై ప్రభుత్వం దృష్టి సారించిందన్నారు.
గనుల ఆదాయం పెంచాం:ప్రభుత్వానికి ఆదాయం పెరిగితేనే ప్రజలకు మరిన్ని సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలు అమలు చేసే అవకాశం ఉంటుందని మంత్రి వివేక్‌ వెంకటస్వామి అన్నారు. గనుల శాఖ ఆదాయాన్ని రూ.700 కోట్ల నుంచి రూ.1,000 కోట్లకు పెంచామని, రూ.1,400 కోట్ల ఆదాయాన్ని లక్ష్యంగా పెట్టుకున్నామని వెల్లడించారు.
మహిళా సాధికారతకు పెద్దపీట:మహిళలను ఆర్థికంగా బలోపేతం చేయడమే కాంగ్రెస్‌ ప్రభుత్వ ప్రధాన లక్ష్యాల్లో ఒకటని మంత్రి తెలిపారు. రాష్ట్రవ్యాప్తంగా మహిళలకు సుమారు రూ.23 వేల కోట్ల మేర బ్యాంక్‌ లింకేజీలు, వడ్డీలేని రుణాలు అందిస్తున్నామని చెప్పారు. మహిళా సంఘాలకు పెట్రోల్‌ బంకులు, ఈవీ వాహనాలు, బస్సుల ద్వారా స్థిరమైన ఆదాయ మార్గాలను కల్పిస్తున్నామని తెలిపారు.మహిళలకు ఇచ్చిన హామీలను దశలవారీగా అమలు చేస్తున్నామని, మహాలక్ష్మి పథకం కింద మహిళలకు రూ.2,500 ఆర్థిక సాయం అందించే హామీని కూడా అమలు చేసేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందని మంత్రి స్పష్టం చేశారు.
మెదక్‌ ఖిల్లాకు ప్రత్యేక తపాలా కవర్‌:మెదక్‌ ఖిల్లా చారిత్రక, పర్యాటక ప్రాధాన్యతను గుర్తిస్తూ తపాలా శాఖ ప్రత్యేక తపాలా కవర్‌ను విడుదల చేయడం అభినందనీయమని మంత్రి అన్నారు. ప్రత్యేక తపాలా కవర్‌ను మంత్రి ఆవిష్కరించారు.మెదక్‌ జిల్లా కేంద్రంగా అభివృద్ధి చెందుతున్న నేపథ్యంలో ఖిల్లాను ప్రముఖ పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దాల్సిన అవసరం ఉందన్నారు. ఖిల్లా హెరిటేజ్‌ ప్రాపర్టీ కావడంతో కేంద్ర ప్రభుత్వ సహకారం, అనుమతులు అవసరమని తెలిపారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల సమన్వయంతో మెదక్‌ను సమగ్ర పర్యాటక కేంద్రంగా అభివృద్ధి చేసేందుకు కృషి చేయాలని సూచించారు.
కస్తూర్బా విద్యాలయంలో నూతన భవనం:మనోహరాబాద్‌ మండలం కుచారంలోని కస్తూర్బా బాలికల విద్యాలయంలో రూ.3.25 కోట్ల వ్యయంతో ఏర్పాటు చేసిన అదనపు మౌలిక వసతులను మంత్రి ప్రారంభించారు. విద్యార్థినులకు అందుతున్న సౌకర్యాలను పరిశీలించి, వారితో ముచ్చటించారు.విద్యార్థినులు చిన్న వయసులోనే ఉన్నత లక్ష్యాలను నిర్దేశించుకుని కష్టపడి చదవాలని మంత్రి సూచించారు. కలెక్టర్‌, డాక్టర్‌, ఐపీఎస్‌ వంటి ఉన్నత స్థాయికి ఎదగాలనే లక్ష్యంతో చదువుకోవాలని చెప్పారు. చదువులో వెనుకబడిన విద్యార్థులపై ఉపాధ్యాయులు ప్రత్యేక శ్రద్ధ చూపి అదనపు తరగతులు, ప్రోత్సాహం అందించాలన్నారు. విద్య, వైద్యం, మహిళా సాధికారత, నైపుణ్యాభివృద్ధి, ఉపాధి, పారిశ్రామిక అభివృద్ధి రంగాల్లో ప్రజలకు మెరుగైన ఫలితాలు అందేలా ప్రభుత్వం పనిచేస్తోందని మంత్రి వివేక్‌ వెంకటస్వామి తెలిపారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని మెరుగుపరుస్తూనే ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేయడమే ప్రభుత్వ లక్ష్యమని స్పష్టం చేశారు.