PRAJA SANKSHEMAM NEWS
Newspaper Banner
Date of Publish : 08 August 2026, 5:20 pm Posted by : Praja Sankshemam News

బంజారాహిల్స్‌లో భారీ అగ్నిప్రమాదం: 11 మందిని సురక్షితంగా కాపాడిన ఫైర్ సిబ్బంది!

సెల్లార్‌లోని వైన్ మార్ట్ స్టాక్‌ పాయింట్‌లో చెలరేగిన మంటలు
కాలిబూడిదైన భారీగా మద్యం బాటిళ్లు
సమయస్ఫూర్తితో ప్రాణాలు కాపాడిన అగ్నిమాపక సిబ్బంది


హైదరాబాద్ (ప్రజా సంక్షేమం):
హైదరాబాద్‌లోని ప్రముఖ వ్యాపార ప్రాంతమైన బంజారాహిల్స్‌లో శనివారం దట్టమైన పొగలు, మంటలతో భారీ అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. బంజారాహిల్స్‌ రోడ్‌ నంబర్‌ 11లోని బీఆర్కే న్యూస్‌ భవనంలోని సెల్లార్‌లో ఉన్న ‘దారువాలా వైన్‌ మార్ట్‌’ స్టాక్‌ స్టోరేజీలో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి.
భయాందోళనలో పరిసర ప్రాంత ప్రజలు:
సెల్లార్‌ భాగం నుంచి పెద్ద ఎత్తున దట్టమైన పొగలు, మంటలు వ్యాపించడంతో భవనంలో ఉన్నవారితో పాటు పరిసర ప్రాంత ప్రజలు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. స్థానికులు వెంటనే అగ్నిమాపక శాఖ అధికారులకు సమాచారం అందించారు.
రెస్క్యూ ఆపరేషన్.. 11 మంది సురక్షితం:
సమాచారం అందుకున్న ఫైర్‌ సిబ్బంది హుటాహుటిన 4 ఫైర్‌ ఇంజిన్లతో సంఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. భవనంలో పొగలు కమ్ముకోవడంతో చిక్కుకుపోయిన 11 మందిని అగ్నిమాపక సిబ్బంది అత్యంత సమయస్ఫూర్తితో, సురక్షితంగా బయటకు తీసుకువచ్చారు.
బూడిదైన మద్యం బాటిళ్లు:స్టోరేజీ పాయింట్‌లో పెద్ద మొత్తంలో మద్యం నిల్వలు ఉండటంతో మంటలు వేగంగా వ్యాపించాయి. ఈ ప్రమాదంలో భారీగా మద్యం బాటిళ్లు అగ్నికి ఆహుతైనట్లు తెలుస్తోంది. అగ్నిప్రమాదానికి గల ఖచ్చితమైన కారణాలు, జరిగిన ఆస్తి నష్టం వివరాలు తెలియాల్సి ఉంది. ఘటనపై అగ్నిమాపక మరియు పోలీసు సంబంధిత అధికారులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
రిపోర్ట్: దోమలపల్లి గోపి (ఉమ్మడి నల్లగొండ జిల్లా ప్రతినిధి) | 9248307393