PRAJA SANKSHEMAM NEWS
Newspaper Banner
Date of Publish : 21 August 2026, 1:54 pm Posted by : Praja Sankshemam News

ముఖ్యమంత్రి శ్రీ ఎ.రేవంత్ రెడ్డి గారి అమెరికా పర్యటన రద్దు!

ప్రజా సంక్షేమ న్యూస్ – హైదరాబాద్
కేంద్ర విదేశాంగ మంత్రిత్వ శాఖ అనుమతి నిరాకరించిన నేపథ్యంలో ముఖ్యమంత్రి శ్రీ ఎ. రేవంత్ రెడ్డి గారి నేతృత్వంలోని తెలంగాణ రైజింగ్ ప్రతినిధి బృందం అమెరికా పర్యటన రద్దయింది. ముఖ్యమంత్రి గారి నేతృత్వంలోని ప్రతినిధి బృందం యూకే, అమెరికా దేశాల పర్యటనకు వెళ్లాల్సి ఉండగా, రాజకీయ కోణంలో అనుమతి నిరాకరించబడిందని కేంద్రం తెలియజేసిన నేపథ్యంలో రేవంత్ రెడ్డి గారు అమెరికా పర్యటనను రద్దు చేసుకున్నారు.విధివిధానాలు, ప్రోటొకాల్ ప్రకారం ముఖ్యమంత్రి గారి యూకే,అమెరికా పర్యటనకు రాష్ట్రం కేంద్ర అనుమతి కోరింది. తొలుత యూకే పర్యటనకు మాత్రమే అనుమతి లభించింది. అధికారిక ప్రతినిధి బృందం యూకేకు చేరుకున్న తర్వాత అమెరికా పర్యటనకు అనుమతి ఇవ్వడం లేదని కేంద్రం రాష్ట్ర ప్రభుత్వానికి తెలియజేసింది.తెలంగాణ అభివృద్ధి, విద్యా రంగ పురోగతికి, అలాగే వికసిత్ భారత్ నిర్మాణానికి తోడ్పడే ఈ పర్యటనకు “రాజకీయ కారణాలతో అనుమతి నిరాకరించడం” పట్ల ముఖ్యమంత్రి గారు తీవ్ర విస్మయం వ్యక్తం చేశారు. అయినప్పటికీ కేంద్ర నిర్ణయాన్ని గౌరవిస్తూ లండన్ నుంచి హైదరాబాద్‌కు తిరిగి రావాలని,బోస్టన్,అమెరికా పర్యటనకు వెళ్లకూడదని నిర్ణయించుకున్నారు.
కేంద్ర నిర్ణయంపై ముఖ్యమంత్రి గారు స్పందిస్తూ,“ఈ పర్యటన ఉద్దేశం ఒక్కటే.కేంద్రం తీసుకొచ్చిన నూతన విద్యా విధానంలో భాగంగా ప్రపంచంలోని ప్రఖ్యాత విద్యా సంస్థలను భారత్‌కు,తెలంగాణకు,హైదరాబాద్‌కు తీసుకురావడం. అత్యుత్తమ ఐవీ లీగ్ విశ్వవిద్యాలయాలను, ప్రపంచంలోని అగ్రశ్రేణి విద్యాసంస్థల నుంచి విద్య,నైపుణ్యాలు,శిక్షణ పొదాలన్న మన యువత ఆకాంక్షలకు ఇవి సమాధానంగా నిలిచేవి” అని పేర్కొన్నారు.
“దేశ నిర్మాణం,యువత భవిష్యత్తు విషయానికి వస్తే అందరూ రాజకీయాలు,ఎన్నికలకు అతీతంగా ఆలోచించాలని నేను ఎప్పుడూ విశ్వసిస్తాను” అని ముఖ్యమంత్రి గారు వ్యాఖ్యానించారు.వివిధ విశ్వవిద్యాలయాలతో ఇప్పటికే సంప్రదింపులు జరిపిన నేపథ్యంలో అమెరికా పర్యటనకు సంబంధించిన కార్యక్రమాలను అధికారుల బృందం కొనసాగించాలని, ఆయా విశ్వవిద్యాలయాలతో అవసరమైన అన్ని అవగాహన ఒప్పందాలు (MoUs), భాగస్వామ్య ఒప్పందాలను పూర్తి చేయాలని ముఖ్యమంత్రి గారు అధికారులను ఆదేశించారు.“హైదరాబాద్ ను ప్రపంచ స్థాయి నాలెడ్జ్ హబ్‌గా తీర్చిదిద్దుతాం. ఉస్మానియా విశ్వవిద్యాలయం నుంచి హెచ్‌సీయూ, జేఎన్‌టీయూ తదితర విశ్వవిద్యాలయాల ఏర్పాటు హైదరాబాద్‌ను అత్యుత్తమ మానవ వనరుల కేంద్రంగా మార్చింది. హైదరాబాద్ పబ్లిక్ స్కూల్.ఒక పాఠశాల ప్రపంచానికి నాయకత్వం వహించగలమని నిరూపించింది. అక్కడి నుంచి ప్రపంచంలోని గొప్ప టెక్ నాయకుల్లో కొందరు రూపుదిద్దుకున్నారు.
ఐఐటీ,ఐఎస్‌బీ,ఐఐఐటీ,నల్సార్ వంటి సంస్థల ఏర్పాటుతో హైదరాబాద్ అగ్రశ్రేణి కార్పొరేషన్లు,వాటి గ్లోబల్ కేపబిలిటీ సెంటర్లను ఆకర్షించగలిగింది. ఇప్పుడు ప్రపంచంలోని ప్రఖ్యాత విద్య, నైపుణ్య సంస్థలకు హైదరాబాద్‌ను కేంద్రంగా మార్చి, 21వ శతాబ్దపు మన ప్రగతి ప్రయాణానికి శక్తినిస్తాం” అని ఈ సందర్భంగా ముఖ్యమంత్రి గారు పేర్కొన్నారు.షెడ్యూల్ ప్రకారం యూకేలో ముఖ్యమంత్రి గారు ఆక్స్‌ఫర్డ్,కేంబ్రిడ్జ్,లండన్ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్,లండన్ బిజినెస్ స్కూల్, యూనివర్సిటీ ఆఫ్ లండన్ తదితర సంస్థలను సందర్శించి,వాటి ప్రతినిధులతో సమావేశాలు కొనసాగించనున్నారు.
యునైటెడ్ కింగ్‌డమ్‌లోని ప్రముఖ క్రీడా సంస్థలు, నైపుణ్యాభివృద్ధి రంగ నాయకులతో సమావేశమై, తెలంగాణతో భాగస్వామ్యాలను అధికారికంగా ఖరారు చేసేందుకు ఈ పర్యటనలో ప్రయత్నిస్తారు.“హైదరాబాద్‌ను ప్రపంచంలోని అగ్రశ్రేణి నగరాల్లో ఒకటిగా తీర్చిదిద్దాలన్నది నా సంకల్పం, ప్రయత్నం. ఒక సాధారణ భారతీయుడు హైదరాబాద్‌లోనే హార్వర్డ్, ఆక్స్‌ఫర్డ్ లేదా ఎంఐటీ,ఎల్‌బీఎస్,ఎల్‌ఎస్‌ఈ వంటి ప్రపంచ స్థాయి సంస్థల నుంచి విద్య, సర్టిఫికేషన్ పొందగలగాలి.ఎందుకంటే చాలామంది నాయకులు తమ పిల్లలను విదేశాలకు పంపాలని కోరుకున్నారు.కానీ నేను ప్రపంచంలోని అత్యుత్తమ విద్యా సంస్థలను భారత్‌కు తీసుకురావాలని అభిలషిస్తున్నాను” అని ముఖ్యమంత్రి గారు ఈ సందర్భంగా పేర్కొన్నారు.