* జూనియర్ న్యాయవాదులకు నెలవారీ స్టైపెండ్, సంక్షేమంపై లోక్‌సభలో ప్రశ్నలు
* పట్టణ ప్రాంతాల్లో రూ.20 వేలు, గ్రామీణ ప్రాంతాల్లో రూ.15 వేలు స్టైపెండ్‌ను బీసీఐ సిఫారసు చేసినట్లు కేంద్రం వెల్లడి!
‘ప్రజా సంక్షేమం’ న్యూస్
దేశవ్యాప్తంగా తొలి దశలో ప్రాక్టీస్ చేస్తున్న యువ న్యాయవాదులు ఎదుర్కొంటున్న ఆర్థిక, వృత్తిపరమైన ఇబ్బందులపై ఖమ్మం ఎంపీ రామసహాయం రఘురాం రెడ్డి లోక్‌సభలో కేంద్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. జూనియర్ న్యాయవాదులకు నెలవారీ స్టైపెండ్, నైపుణ్యాభివృద్ధి కార్యక్రమాలు, విద్యా రుణాలు, న్యాయ సహాయ ప్రోత్సాహకాలు, సామాజిక భద్రత వంటి అంశాలపై ప్రభుత్వం తీసుకుంటున్న చర్యల వివరాలను కోరారు.ఈ ప్రశ్నలకు కేంద్ర న్యాయశాఖ సహాయ మంత్రి అర్జున్‌రామ్ మేఘ్వాల్ లిఖితపూర్వక సమాధానం ఇచ్చారు.స్టైపెండ్‌పై బీసీఐ సిఫారసు..యువ న్యాయవాదులు ఎదుర్కొంటున్న ఆర్థిక, వృత్తిపరమైన సమస్యలను ప్రభుత్వం గుర్తించిందని మంత్రి తెలిపారు. ఈ నేపథ్యంలో బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా (బీసీఐ) 2024 అక్టోబర్ 15న జారీ చేసిన సర్క్యులర్‌లో జూనియర్ న్యాయవాదులకు కనీస నెలవారీ స్టైపెండ్‌ను సిఫారసు చేసినట్లు వెల్లడించారు. పట్టణ ప్రాంతాల్లో పనిచేసే జూనియర్ న్యాయవాదులకు రూ.20 వేలు, గ్రామీణ ప్రాంతాల్లో రూ.15 వేల చొప్పున, సాధారణంగా కనీసం మూడు సంవత్సరాల పాటు చెల్లించాలని సూచించినట్లు పేర్కొన్నారు.జాతీయ సంక్షేమ విధానంపై ప్రతిపాదన లేదున్యాయవాదుల సంక్షేమం, సామాజిక భద్రత, పదవీ విరమణ ప్రయోజనాల కోసం ప్రత్యేక జాతీయ విధానాన్ని తీసుకురావాలనే ప్రతిపాదన ప్రస్తుతం పరిశీలనలో లేదని కేంద్రం స్పష్టం చేసింది.రాష్ట్ర బార్ కౌన్సిళ్లకే సంక్షేమ బాధ్యతఅడ్వకేట్స్ వెల్ఫేర్ ఫండ్ చట్టం–2001 ప్రకారం న్యాయవాదుల సంక్షేమం రాష్ట్ర బార్ కౌన్సిళ్ల పరిధిలోనే ఉంటుందని కేంద్ర మంత్రి వివరించారు. రాష్ట్ర అడ్వకేట్స్ వెల్ఫేర్ ఫండ్‌ల ద్వారా న్యాయవాదులకు ఆర్థిక సహాయం అందించడంతో పాటు, ప్రస్తుతం అమల్లో ఉన్న అడ్వకేట్స్ చట్టం–1961లోని నిబంధనల ప్రకారం రాష్ట్ర బార్ కౌన్సిళ్లు, బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా అవసరమైన సంక్షేమ పథకాలు అమలు చేయడానికి, నిధులు ఏర్పాటు చేయడానికి అధికారాలు కలిగి ఉన్నాయని వివరించారు.