PRAJA SANKSHEMAM NEWS
Newspaper Banner
Date of Publish : 15 August 2026, 3:02 am Posted by : Praja Sankshemam News

యూనిఫామ్‌డ్‌ సర్వీసెస్‌ (పోలీస్) ఉద్యోగ నియామకాలకు గరిష్ట వయోపరిమితి మరో రెండేళ్లు పెంపు!

ప్రజా సంక్షేమం న్యూస్
యూనిఫామ్‌డ్‌ సర్వీసెస్‌ (పోలీస్) ఉద్యోగాల నియామకాలకు సంబంధించి నిరుద్యోగ యువతకు తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. పోలీస్‌, ఫైర్‌, జైళ్లు, స్పెషల్‌ ప్రొటెక్షన్‌ ఫోర్స్‌ (SPF), ఎక్సైజ్‌, రవాణా, అటవీ శాఖల్లో డైరెక్ట్‌ రిక్రూట్‌మెంట్‌ ద్వారా భర్తీ చేసే పోస్టులకు గరిష్ట వయోపరిమితిని మరో రెండేళ్లు పెంచుతూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.ఇప్పటికే 18.05.2026న జారీ చేసిన ఉత్తర్వుల ప్రకారం ఈ యూనిఫామ్‌డ్‌ సర్వీసెస్‌ పోస్టులకు నిర్దేశిత గరిష్ట వయోపరిమితికి అదనంగా ఐదేళ్ల వయో సడలింపు కల్పించారు. తాజాగా 14.08.2026న జారీ చేసిన G.O.Ms.No.122 ద్వారా ఆ ఐదేళ్ల సడలింపుకు అదనంగా మరో రెండేళ్లను పెంచారు. దీంతో నిర్దేశిత గరిష్ట వయోపరిమితిపై మొత్తం ఏడు సంవత్సరాల వరకు అదనపు వయో సడలింపు లభించనుంది.నిరుద్యోగ యువత నుంచి వచ్చిన పలు విజ్ఞప్తులను ప్రభుత్వం పరిశీలించిన అనంతరం ఈ నిర్ణయం తీసుకుంది. మరింత మంది నిరుద్యోగ యువత డైరెక్ట్‌ రిక్రూట్‌మెంట్‌ ప్రక్రియలో పాల్గొనేందుకు అర్హత పొందేలా ఈ వయోపరిమితి పెంపు అవకాశం కల్పించనుంది.ఈ మేరకు తెలంగాణ రాష్ట్ర గెజిట్‌లో నోటిఫికేషన్‌ ప్రచురించాలని ప్రభుత్వం ఆదేశించింది. తెలంగాణ స్టేట్‌ లెవల్‌ పోలీస్‌ రిక్రూట్‌మెంట్‌ బోర్డు (TSLPRB), తెలంగాణ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ (TSPSC), సంబంధిత శాఖలు మరియు అధికారులకు ఈ ఉత్తర్వులను అమలు కోసం పంపించారు.ఈ వయోపరిమితి పెంపు పోలీస్‌, ఫైర్‌, జైళ్లు, SPF, ఎక్సైజ్‌, రవాణా, అటవీ శాఖల్లోని యూనిఫామ్‌డ్‌ సర్వీసెస్‌ డైరెక్ట్‌ రిక్రూట్‌మెంట్‌ పోస్టులకు వర్తిస్తుంది. తాజా ఉత్తర్వులు 14.08.2026 తేదీతో జారీ అయ్యాయి.