అసత్య ఆరోపణలపై చైర్మన్ డాక్టర్ కోడి శ్రీనివాసులు ఆగ్రహం..
గుడిలో ప్రమాణానికి ముహూర్తం ఖరారు! ప్రమాణం చేయడానికి రాకపోతే బహిరంగ క్షమాపణ చెప్పాలి..
ప్రజా సంక్షేమం న్యూస్-చండూరు
బీఆర్‌ఎస్ మాజీ ఎమ్మెల్యే కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి చేసిన అవినీతి ఆరోపణలు ఇప్పుడు రెండు పక్షాల మధ్య సవాళ్లు, ప్రతిసవాళ్లకు దారితీశాయి. అసలు చండూరు బస్సు షెల్టర్ నిర్మాణం వెనుక రూ.12 లక్షల వసూళ్ల రగడ ఏమిటి? దేవుని గుడిలో ప్రమాణానికి మాజీ ఎమ్మెల్యే హాజరవుతారా లేదా? అన్నది ఇప్పుడు స్థానికంగా చర్చనీయాంశంగా మారింది.రాజకీయాల్లో ఆరోపణలు చేయడం సహజమే..కానీ వాటిని నిరూపించాల్సిన సమయం వచ్చినప్పుడు నిలబడే ధైర్యం ఎంతమందికి ఉంటుంది? ‘గోరంతను కొండంతలు చేసి ప్రచారం చేస్తే సరిపోతుందా..పవిత్ర దైవసన్నిధిలో సాక్ష్యం చెప్పేందుకు సిద్ధపడతారా?’ అంటూ చండూరు మున్సిపాలిటీ వేదికగా మొదలైన మాటల యుద్ధం ఇప్పుడు మునుగోడు నియోజకవర్గవ్యాప్తంగా తీవ్ర ఉత్కంఠను రేపుతోంది.
అసత్య ఆరోపణలపై చైర్మన్ ఆగ్రహం:
స్థానిక పండ్ల వ్యాపారులతో కలిసి గురువారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో చండూరు మున్సిపల్ చైర్మన్ డాక్టర్ కోడి శ్రీనివాసులు ఘాటుగా స్పందించారు. ఇటీవల నిర్వహించిన బీఆర్‌ఎస్ ధర్నాలో మాజీ ఎమ్మెల్యే కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి బాధ్యతారహితంగా మాట్లాడారని ఆయన మండిపడ్డారు. పట్టణంలో నిర్మిస్తున్న నూతన బస్సు షెల్టర్ కోసం పండ్ల వ్యాపారులను బెదిరించి, బలవంతంగా రూ.12 లక్షలు వసూలు చేశామని, మున్సిపల్ పాలకవర్గం లంచాలు మెక్కుతోందంటూ చేసిన ఆరోపణలను నిర్ద్వంద్వంగా తోసిపుచ్చారు.
లంచం నిరూపిస్తే తక్షణ రాజీనామా:
మున్సిపాలిటీ అభివృద్ధిలో చిత్తశుద్ధితో పనిచేస్తున్న తమ పాలకవర్గంపై నిరాధారమైన నిందలు వేయడం కూసుకుంట్లకు తగదని డాక్టర్ కోడి శ్రీనివాసులు హితవు పలికారు.“మేము వ్యాపారుల వద్ద గానీ, మరెవరి వద్దనైనా ఒక్క రూపాయి లంచం తీసుకున్నట్లు నిరూపిస్తే, క్షణం కూడా ఆలోచించకుండా నా మున్సిపల్ చైర్మన్ పదవికి తక్షణమే రాజీనామా చేస్తా. మీకున్న సాక్ష్యాలు ఏవో నిరూపించేందుకు సిద్ధమా?” అని ఆయన తీవ్రస్థాయిలో సవాల్ విసిరారు
గుడిలో ప్రమాణానికి ముహూర్తం ఖరారు:
తాను గుడికి వచ్చి దైవసాక్షిగా ప్రమాణం చేస్తానన్న కూసుకుంట్ల మాటను గుర్తుచేస్తూ మున్సిపల్ చైర్మన్ ముహూర్తాన్ని ఖరారు చేశారు. చండూరు శిర్ధపల్లి రోడ్డులోని శ్రీ ఆంజనేయ స్వామి దేవాలయం వద్ద శనివారం ఉదయం 9:00 గంటలకు తాము రూపాయి లంచం తీసుకోలేదని ఆంజనేయ స్వామి సన్నిధిలో ప్రమాణం చేయడానికి తాము, తమ పాలకవర్గం సిద్ధంగా ఉన్నామని వెల్లడించారు. అంతేకాకుండా, తాము మున్సిపాలిటీకి ఎలాంటి ముడుపులు ఇవ్వలేదని స్వయంగా పండ్ల వ్యాపారులు కూడా స్వామివారి ఎదుట ప్రమాణం చేయడానికి సిద్ధంగా ఉన్నారని పేర్కొన్నారు.
రాకపోతే బహిరంగ క్షమాపణ చెప్పాలి:
‘నోటికి ఏది వస్తే అది మాట్లాడి తప్పించుకోవడం రాజకీయ నాయకులకు అలవాటుగా మారింది’ అని దుయ్యబట్టిన శ్రీనివాసులు, మాజీ ఎమ్మెల్యే తన మాట మీద నిలబడి శనివారం గుడి వద్దకు వస్తారని వేయి కళ్లతో ఎదురుచూస్తున్నామని చెప్పారు. ఒకవేళ ప్రమాణానికి రాకుండా ముఖం చాటేస్తే.. ఆయన మాటల్లో వాస్తవం లేదని స్పష్టమవుతుందని, చేసిన వ్యాఖ్యలను బేషరతుగా వెనక్కి తీసుకుని మునుగోడు నియోజకవర్గ ప్రజలకు బహిరంగ క్షమాపణ చెప్పాలని డాక్టర్ కోడి శ్రీనివాసులు డిమాండ్ చేశారు.