PRAJA SANKSHEMAM NEWS
Newspaper Banner
Date of Publish : 30 August 2026, 11:09 am Posted by : Praja Sankshemam News

విద్య,వైద్యం,రహదారులు,గృహ నిర్మాణంతో సమగ్ర అభివృద్ధే లక్ష్యం:డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క

లచ్చగూడెం అభివృద్ధికి రూ.37.75 కోట్ల నిధులు!
నర్సింగ్ కళాశాల, రహదారి నిర్మాణ పనులకు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క శంకుస్థాపన!
ఇందిరమ్మ ఇళ్ల గృహప్రవేశాల్లో పాల్గొని లబ్ధిదారులతో ఆత్మీయ ముచ్చట!

ప్రజాసంక్షేమం న్యూస్ -మధిర
ఖమ్మం జిల్లా మధిర నియోజకవర్గం చింతకాని మండలం లచ్చగూడెం గ్రామంలో రూ.37.75 కోట్ల వ్యయంతో చేపట్టనున్న పలు అభివృద్ధి పనులకు ఉప ముఖ్యమంత్రి శ్రీ మల్లు భట్టి విక్రమార్క శంకుస్థాపన చేశారు.ఇందులో భాగంగా రూ.29 కోట్లతో నూతన ప్రభుత్వ నర్సింగ్ కళాశాల భవనం, రూ.7 కోట్లతో చింతకాని–వందనం ఆర్‌అండ్‌బీ రోడ్డు నుంచి లచ్చగూడెం–నేరడ పీఆర్ రోడ్డు వరకు బీటీ రోడ్డు, రూ.1.75 కోట్లతో లచ్చగూడెం నుంచి అనంతారం వరకు బీటీ రోడ్డు నిర్మాణ పనులు చేపట్టనున్నారు.విద్య, వైద్యం, రవాణా రంగాల్లో అవసరమైన మౌలిక వసతులను కల్పించడం ద్వారా లచ్చగూడెంతో పాటు పరిసర గ్రామాల ప్రజలకు మెరుగైన సౌకర్యాలు అందించే దిశగా ప్రభుత్వం ఈ అభివృద్ధి పనులను చేపడుతోంది.అనంతరం లచ్చగూడెం గ్రామంలో నిర్మించిన ఇందిరమ్మ ఇళ్ల గృహప్రవేశ కార్యక్రమంలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క పాల్గొన్నారు. లబ్ధిదారుల ఇళ్లకు వెళ్లి వారిని ఆత్మీయంగా పలకరించి, కొత్త ఇంటిలో సంతోషంగా జీవించాలని ఆకాంక్షించారు.పేదలకు సొంతింటి కలను సాకారం చేయడంతో పాటు విద్య, వైద్యం, రహదారి సౌకర్యాలను బలోపేతం చేస్తూ గ్రామాల సమగ్ర అభివృద్ధే లక్ష్యంగా ప్రజా ప్రభుత్వం ముందుకు సాగుతోంది