PRAJA SANKSHEMAM NEWS
Newspaper Banner
Date of Publish : 27 August 2026, 11:40 am Posted by : Praja Sankshemam News

హైదరాబాద్‌లో ట్రాఫిక్ నియంత్రణ, రోడ్డు భద్రతకు సమగ్ర కార్యాచరణ ప్రణాళిక!

ప్రజాసంక్షేమం -హైదరాబాద్:
హైదరాబాద్ నగరంతో పాటు ఔటర్ రింగ్ రోడ్డు (ORR) పరిధిలో ట్రాఫిక్ రద్దీని నియంత్రించడం,రోడ్డు ప్రమాదాలను నివారించేందుకు సమగ్ర కార్యాచరణ ప్రణాళిక సిద్ధం చేయాలని తెలంగాణ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సంజయ్ జాజు అధికారులను ఆదేశించారు.ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి ఆదేశాల మేరకు గురువారం డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ తెలంగాణ రాష్ట్ర సచివాలయంలో ఉన్నతాధికారులతో నిర్వహించిన సమావేశంలో ట్రాఫిక్ నిర్వహణ, రోడ్డు భద్రత అంశాలపై ప్రధాన కార్యదర్శి విస్తృతంగా సమీక్షించారు.
ప్రమాదకర ప్రాంతాల గుర్తింపుపై దృష్టి:రోడ్డు భద్రత, ట్రాఫిక్ సిగ్నళ్ల నిర్వహణ, ప్రమాదాలు ఎక్కువగా జరుగుతున్న ప్రాంతాల గుర్తింపు, అత్యవసర సేవల వాహనాలకు వేగవంతమైన మార్గాల కల్పన వంటి అంశాలపై సమావేశంలో చర్చించారు. రాష్ట్రంలోని అన్ని నగరాలు, జిల్లా కేంద్రాలు, మున్సిపాలిటీలు, పట్టణ ప్రాంతాలు, ORR పరిధిలో ట్రాఫిక్ సిగ్నలింగ్ వ్యవస్థలను మరింత బలోపేతం చేయాలని సీఎస్ సూచించారు.మున్సిపల్, పోలీస్, రవాణా తదితర శాఖలు సమన్వయంతో పనిచేసి రోడ్డు ప్రమాదాల నివారణకు చర్యలు చేపట్టాలని, సంబంధిత డీపీఆర్‌లను (DPR) వీలైనంత త్వరగా సిద్ధం చేయాలని ఆదేశించారు. అవసరమైన ప్రాంతాల్లో నవంబర్, డిసెంబర్ నెలల్లో సిగ్నలింగ్ వ్యవస్థలను ఏర్పాటు చేసేందుకు చర్యలు తీసుకోవాలని సూచించారు.
ప్రత్యేక ట్రాఫిక్ వ్యవస్థ ఏర్పాటుకు ప్రతిపాదన:ట్రాఫిక్ నిర్వహణ, రోడ్డు భద్రత ఒకే శాఖకు పరిమితమైన అంశాలు కావని, పోలీస్, రవాణా, రోడ్లు–భవనాలు, మున్సిపల్ పరిపాలన, పట్టణాభివృద్ధి తదితర శాఖలు సమన్వయంతో పనిచేయాలని సంజయ్ జాజు స్పష్టం చేశారు.
వివిధ ప్రాంతాల నుంచి సేకరించే ట్రాఫిక్ సమాచారాన్ని ఒకే వేదికపైకి తీసుకువచ్చి విశ్లేషించేందుకు ఇంటిగ్రేటెడ్ ట్రాఫిక్ డేటా ప్లాట్‌ఫామ్ ఏర్పాటు చేసే అంశాన్ని పరిశీలించాలని సూచించారు. నార్కోటిక్స్ బ్యూరో, TG-SAFE తరహాలో ట్రాఫిక్ నిర్వహణ, రోడ్డు భద్రత కోసం TG-TMARS (Traffic Management and Road Safety) పేరుతో ప్రత్యేక స్వతంత్ర వ్యవస్థ ఏర్పాటుకు ప్రతిపాదనలు సిద్ధం చేయాలని అధికారులను ఆదేశించారు.
ఏఐతో ట్రాఫిక్ నిర్వహణ:ట్రాఫిక్ సిగ్నలింగ్ వ్యవస్థలను ఆధునీకరించడం, ఎలక్ట్రానిక్ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ను బలోపేతం చేయడం, సుప్రీంకోర్టు మార్గదర్శకాలకు అనుగుణంగా రోడ్డు భద్రత చర్యలు చేపట్టాలని సీఎస్ ఆదేశించారు. ఫుట్‌పాత్‌లపై ఆక్రమణలను అరికట్టేందుకు కఠిన చర్యలు తీసుకోవాలని సూచించారు.ప్రస్తుతం జీహెచ్‌ఎంసీ పరిధిలో 429 ట్రాఫిక్ సిగ్నలింగ్ వ్యవస్థలు ఉన్నాయని, వాటిలో అధునాతన సిగ్నల్ కంట్రోల్ వ్యవస్థలను వినియోగిస్తున్నట్లు అధికారులు సీఎస్‌కు వివరించారు.రాష్ట్రవ్యాప్తంగా ట్రాఫిక్ నిర్వహణను మరింత సమర్థవంతంగా మార్చడంతో పాటు ప్రయాణాన్ని సురక్షితంగా చేసేందుకు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) ఆధారిత సాంకేతికతను విస్తృతంగా వినియోగించేలా సమగ్ర కార్యాచరణ ప్రణాళిక రూపొందించాలని సంజయ్ జాజు ఆదేశించారు.
సాంకేతికతను కేవలం ట్రాఫిక్ ఉల్లంఘనలను గుర్తించేందుకే పరిమితం చేయకుండా, ప్రజలకు సురక్షితమైన, వేగవంతమైన, సౌకర్యవంతమైన ప్రయాణాన్ని అందించేలా వినియోగించాలని సూచించారు. డేటా ఆధారిత, సాంకేతిక పరిజ్ఞానంతో కూడిన ప్రజా కేంద్రిత పరిష్కారాల ద్వారా ట్రాఫిక్ సమస్యలకు శాశ్వత పరిష్కారాలను గుర్తించాలని అన్నారు.AI ఆధారిత ట్రాఫిక్ నిర్వహణ, రోడ్డు భద్రతకు సంబంధించి అందుబాటులో ఉన్న తాజా సాంకేతికతలను అధ్యయనం చేసి, రాష్ట్రంలోని అనువైన ప్రాంతాల్లో పైలట్ ప్రాజెక్టులను చేపట్టాలని అధికారులను ఆదేశించారు. పైలట్ ప్రాజెక్టుల ఫలితాలను పరిశీలించిన అనంతరం దశలవారీగా ఈ విధానాలను రాష్ట్రవ్యాప్తంగా విస్తరించాలని సమావేశంలో నిర్ణయించారు.సమావేశంలో డీజీపీ సీవీ ఆనంద్, రవాణా, రోడ్లు–భవనాల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి వికాస్ రాజ్, రవాణా కమిషనర్ ఇలంబర్తి, మల్కాజ్‌గిరి మున్సిపల్ కమిషనర్ వినయ్ కృష్ణారెడ్డి, హైదరాబాద్ నగర పోలీస్ కమిషనర్ వీసీ సజ్జనార్ తదితర ఉన్నతాధికారులు పాల్గొన్నారు.