9వ రోజు కొనసాగుతున్న AYUSH హౌస్ సర్జన్లు, UG విద్యార్థుల నిరవధిక సమ్మెకు బిజెపి రాష్ట్ర నాయకులు వరంగల్ అర్బన్ కో-ఆపరేటివ్ బ్యాంక్ చైర్మన్ శ్రీ ఎర్రబెల్లి ప్రదీప్ రావు గారు వారి పూర్తి సంఘీభావం తెలిపారు.
తెలంగాణ జాయింట్ యాక్షన్ కమిటీ ఆధ్వర్యంలో వరంగల్ తూర్పు నియోజకవర్గంలోని అనంతలక్ష్మి ప్రభుత్వ ఆయుర్వేద బోధనా ఆసుపత్రి, వరంగల్‌లో AYUSH హౌస్ సర్జన్లు, UG విద్యార్థులు చేపట్టిన నిరవధిక సమ్మె నేటితో 9వ రోజుకు చేరుకుంది.
ఈ సందర్భంగా సమ్మెకు సంఘీభావం తెలిపేందుకు బీజేపీ రాష్ట్ర నాయకులు, వరంగల్ అర్బన్ కో-ఆపరేటివ్ బ్యాంక్ చైర్మన్ శ్రీ ఎర్రబెల్లి ప్రదీప్ రావు గారు అనంతలక్ష్మి ప్రభుత్వ ఆయుర్వేద బోధనా ఆసుపత్రిని సందర్శించారు. సమ్మెలో పాల్గొంటున్న AYUSH హౌస్ సర్జన్లు, UG విద్యార్థులతో మాట్లాడి వారి సమస్యలు, న్యాయమైన డిమాండ్లను తెలుసుకున్నారు.
ఈ సందర్భంగా ఎర్రబెల్లి ప్రదీప్ రావు గారు మాట్లాడుతూ, “AYUSH విద్యార్థులు, హౌస్ సర్జన్లు చేస్తున్న డిమాండ్లు న్యాయమైనవే. వారి సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి పరిష్కారం కోసం మా వంతు కృషి చేస్తాం. విద్యార్థులు అధైర్యపడవద్దు. మీ న్యాయమైన పోరాటానికి మా సంపూర్ణ సంఘీభావం ఉంటుంది” అని భరోసా కల్పించారు.
AYUSH హౌస్ సర్జన్లు, PG విద్యార్థులకు గత అనేక సంవత్సరాలుగా స్టైపెండ్ పెంపు జరగకపోవడం వల్ల తీవ్ర అన్యాయం జరుగుతోందని JAC నాయకులు తెలిపారు. “Equal Work – Equal Stipend” అనే ప్రధాన డిమాండ్‌తో నిరవధిక సమ్మె కొనసాగుతోందని వివరించారు.
ప్రధాన డిమాండ్లు
1. స్టైపెండ్ పెంపు:
AYUSH హౌస్ సర్జన్లు, PG విద్యార్థుల స్టైపెండ్‌ను Allopathy హౌస్ సర్జన్లు, PG విద్యార్థులకు సమానంగా పెంచాలి.
2. Green Channel ఏర్పాటు:
స్టైపెండ్ విడుదల కోసం ప్రత్యేక Green Channel ఏర్పాటు చేసి, ప్రతి నెలా ఎలాంటి జాప్యం లేకుండా సకాలంలో స్టైపెండ్ చెల్లించాలి.
3. పెండింగ్ స్టైపెండ్ విడుదల:
ఇప్పటివరకు పెండింగ్‌లో ఉన్న స్టైపెండ్‌లను వెంటనే విడుదల చేసి, భవిష్యత్తులో ప్రతి నెలా నిర్ణీత సమయానికి స్టైపెండ్ అందేలా శాశ్వత వ్యవస్థ ఏర్పాటు చేయాలి.
9 రోజులుగా నిరవధిక సమ్మె కొనసాగుతున్నప్పటికీ ప్రభుత్వం నుంచి తమ డిమాండ్లపై స్పష్టమైన పరిష్కారం రాకపోవడంతో, న్యాయం జరిగే వరకు ప్రజాస్వామ్య పద్ధతిలో తమ పోరాటాన్ని కొనసాగిస్తామని తెలంగాణ AYUSH జాయింట్ యాక్షన్ కమిటీ స్పష్టం చేసింది.
AYUSH వైద్య విద్యార్థులు, హౌస్ సర్జన్ల భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని ప్రభుత్వం వెంటనే స్పందించి వారి న్యాయమైన డిమాండ్లను పరిష్కరించాలని ఎర్రబెల్లి ప్రదీప్ రావు గారు కోరారు.
ఈ కార్యక్రమంలో తెలంగాణ జాయింట్ యాక్షన్ కమిటీ నాయకులు డాక్టర్ రోహిత్ బాస్రే, డాక్టర్ సంగమేశ్వర్, డాక్టర్ గణేష్, డాక్టర్ శేషు, డాక్టర్ పద్మాక్షి, డాక్టర్ భువనేశ్వరి, డాక్టర్ అంజలి, డాక్టర్ సబా సమ్రిన్ తదితరులు పాల్గొన్నారు.
వీరితోపాటు భారతీయ జనతా పార్టీ వరంగల్ జిల్లా ఉపాధ్యక్షులు కందిమల్ల మహేష్, జిల్లా కార్యదర్శి మందా శ్రీనివాస్, ఎస్సీ మోర్చా జిల్లా అధ్యక్షులు మాదాసు రాజు,ఓబీసీ మోర్చా జిల్లా ప్రధాన కార్యదర్శి కర్నే రవీందర్, జిల్లా కౌన్సిల్ నెంబర్ కోమాకుల నాగరాజు, బిజెపి నాయకులు ఓని వెంకటేష్ రైతుల స్థానిక నాయకులు పాల్గొన్నారు.