పెట్రోల్, డీజిల్ వాహనాలకు బదులు ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహనాల కొనుగోలును ప్రోత్సహించేందుకు కేంద్ర ప్రభుత్వం PM E Drive పథకాన్ని గతంలో ప్రకటించగా ఇప్పుడు దీనిని 2028 వరకు పొడిగించింది. ఇక్కడ ఎలక్ట్రిక్ టూ వీలర్లకు సబ్సిడీ మొత్తాన్ని రూ. 1772 కోట్ల నుంచి రూ. 2767 కోట్లకు పెంచింది. సబ్సిడీకి అర్హత పొందే వాహనాల సంఖ్యను కూడా భారీగా పెంచింది. ఇంకా గరిష్ఠంగా ఒక్కో వాహనానికి రూ. 5 వేల సబ్సిడీ వస్తుంది.మీరు ఎలక్ట్రిక్ బైక్‌లు, ఎలక్ట్రిక్ స్కూటర్లు కొనుగోలు చేయాలని చూస్తున్నారా? అయితే మీకు కేంద్ర ప్రభుత్వం ఒక శుభవార్త చెప్పింది. పీఎం ఇ- డ్రైవ్ పథకం కింద విద్యుత్ ద్విచక్ర వాహనాలకు ఇచ్చే సబ్సిడీని 2028 ఆర్థిక సంవత్సరం వరకు పొడిగిస్తున్నట్లు ప్రకటించింది. అంతే కాకుండా ఇంకా ఈ విభాగానికి కేటాయించే నిధుల్ని కూడా భారీగా పెంచేసింది. దీంతో ఈవీ తయారీ సంస్థలకు, కొనుగోలుదారులకు మరింత ఊరట లభించనుంది. దీనికి సంబంధించి కేంద్రం తాజాగా ఒక నోటిఫికేషన్ విడుదల చేసింది.
ఇందులో భాగంగా ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహనాలకు ప్రోత్సాహకాల కోసం కేటాయింపుల్ని ప్రస్తుతం ఉన్న రూ. 1772 కోట్ల నుంచి మరో 50 శాతం వరకు పెంచి దీనిని రూ. 2767 కోట్లకు చేర్చింది. ఇక్కడ దాదాపు రూ. 1000 కోట్ల మేర అదనపు కేటాయింపులు జరగడం విశేషం. ఇంకా సబ్సిడీ పొందేందుకు ఈ స్కీమ్ కింద అర్హత పొందే ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహనాల సంఖ్యను కూడా పెంచడం విశేషం. గతంలో 24 లక్షలకుపైగా వాహనాలకు సబ్సిడీ అందేలా ఇక్కడ పరిమితి విధించగా ఇప్పుడు ఈ సంఖ్యను ఏకంగా 45.7 లక్షల వాహనాలకు పెంచారు. అంటే ఇన్ని వాహనాలకు సబ్సిడీ అందిస్తారు.
