PRAJA SANKSHEMAM NEWS
Newspaper Banner
Date of Publish : 25 September 2026, 7:56 pm Posted by : Praja Sankshemam News

‘ఆర్యదాన్ ముహమ్మద్-2026’ అవార్డు అందుకున్న సీఎం రేవంత్ రెడ్డి

కేరళ వెలుపల నుంచి ఈ ప్రతిష్ఠాత్మక పురస్కారానికి ఎంపికైన తొలి వ్యక్తిగా సీఎం
ప్రజా సంక్షేమం న్యూస్ – నిలంబూర్:

తెలంగాణ ముఖ్యమంత్రి శ్రీ ఎ.రేవంత్ రెడ్డి ప్రతిష్ఠాత్మక ‘ఆర్యదాన్ ముహమ్మద్-2026’ అవార్డును అందుకున్నారు. కేరళలోని నిలంబూర్‌లో ఆర్యదాన్ ముహమ్మద్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమంలో ఎంపీ, పబ్లిక్ అకౌంట్స్ కమిటీ చైర్మన్ కేసీ వేణుగోపాల్ చేతుల మీదుగా సీఎం అవార్డును స్వీకరించారు.
అవార్డు అందుకోవడం గౌరవంగా ఉంది:ఆర్యదాన్ ముహమ్మద్ జ్ఞాపకార్థం ఏర్పాటు చేసిన ఈ ప్రతిష్ఠాత్మక అవార్డును అందుకోవడం ఎంతో గౌరవంగా భావిస్తున్నానని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. తనను ఎంపిక చేసిన జ్యూరీ సభ్యులకు కృతజ్ఞతలు తెలిపారు.కేరళ వెలుపల నుంచి ఈ పురస్కారానికి ఎంపికైన తొలి వ్యక్తిని కావడం మరింత గౌరవంగా భావిస్తున్నానని పేర్కొన్నారు.
కేరళతో ఆత్మీయ అనుబంధం:కేరళకు వచ్చిన ప్రతిసారీ ప్రజల నుంచి ఎంతో ఆత్మీయ స్వాగతం లభించిందని సీఎం గుర్తుచేశారు. రాహుల్ గాంధీ నాయకత్వంలో జరిగిన భారత్ జోడో యాత్ర సందర్భంగా,అలాగే అసెంబ్లీ ఎన్నికల సమయంలోనూ కేరళకు వచ్చినట్లు తెలిపారు.కేరళ తనకు ఎంతో ఆత్మీయమైనదని,లౌకికవాదానికి కట్టుబడి ఉన్న కేరళ ప్రజలకు కృతజ్ఞతలు తెలిపారు.
రాజ్యాంగ పరిరక్షణకు ఐక్యంగా పోరాడాలి:ఆర్యదాన్ ముహమ్మద్ గొప్ప రాజకీయ నాయకుడని సీఎం పేర్కొన్నారు. ఆయన ఎనిమిదిసార్లు ఎమ్మెల్యేగా,నాలుగుసార్లు మంత్రిగా ప్రజలకు సేవలందించారని గుర్తుచేశారు.స్వేచ్ఛ,ప్రజాస్వామ్యం,లౌకికవాదం, రాజ్యాంగ పరిరక్షణ కోసం ఆయన జీవితాంతం పోరాడారని అన్నారు.ఆర్యదాన్ ముహమ్మద్ స్ఫూర్తితో రాజ్యాంగ పరిరక్షణ కోసం అందరూ కలిసికట్టుగా కృషి చేయాల్సిన అవసరం ఉందని సీఎం రేవంత్ రెడ్డి పిలుపునిచ్చారు.ఈ కార్యక్రమంలో ఆర్యదాన్ ముహమ్మద్ ఫౌండేషన్ చైర్మన్ ఆర్యదాన్ షౌకత్, కేరళ మంత్రులు, పలువురు ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.