PRAJA SANKSHEMAM NEWS
Newspaper Banner
Date of Publish : 26 September 2026, 12:35 am Posted by : Praja Sankshemam News

ఇకాన్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్‌పై రూ.5 లక్షల జరిమానా!

తనిఖీల్లో పలు నిబంధనల ఉల్లంఘనలు గుర్తింపు..
షోకాజ్ నోటీసులకు వివరణపై అధికారులు అసంతృప్తి..
30 రోజుల్లో జరిమానా చెల్లించాలని ఆదేశం!
ప్రజాసంక్షేమం న్యూస్ నల్గొండ, సెప్టెంబర్ 25:
క్లినికల్ ఎస్టాబ్లిష్‌మెంట్స్ (రిజిస్ట్రేషన్ అండ్ రెగ్యులేషన్) చట్టం–2010 నిబంధనల అమలులో భాగంగా నల్గొండ జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారులు ఇకాన్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్‌ను తనిఖీ చేశారు. తనిఖీలో గుర్తించిన పలు లోపాలు, నిబంధనల ఉల్లంఘనలను పరిగణనలోకి తీసుకుని ఆసుపత్రికి రూ.5 లక్షల జరిమానా విధిస్తూ జిల్లా వైద్య మరియు ఆరోగ్య అధికారి ఉత్తర్వులు జారీ చేశారు.
ఆగస్టు 11న తనిఖీలు:
2026 ఆగస్టు 11న నిర్వహించిన తనిఖీల్లో ఆసుపత్రికి సంబంధించిన రికార్డులు, అనుమతులు, వైద్య సేవలు, అత్యవసర విభాగం, ల్యాబొరేటరీ, బయోమెడికల్ వ్యర్థాల నిర్వహణ, ఫైర్ సేఫ్టీ, PCPNDT నిబంధనలు తదితర అంశాలను అధికారులు పరిశీలించారు. ఈ సందర్భంగా పలు లోపాలు, నిబంధనల ఉల్లంఘనలు గుర్తించినట్లు అధికారులు తెలిపారు.
వివరణపై సంతృప్తి చెందని అధికారులు:గుర్తించిన అంశాలపై ఆసుపత్రి యాజమాన్యానికి ఆగస్టు 14, సెప్టెంబర్ 1 తేదీల్లో షోకాజ్ నోటీసులు జారీ చేశారు. దీనిపై సెప్టెంబర్ 2న ఆసుపత్రి యాజమాన్యం వివరణ సమర్పించింది. అయితే సమర్పించిన వివరణపై అధికారులు సంతృప్తి చెందలేదని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.
సెక్షన్ 42 కింద జరిమానా:తనిఖీల్లో గుర్తించిన ఉల్లంఘనలను పరిగణనలోకి తీసుకుని క్లినికల్ ఎస్టాబ్లిష్‌మెంట్స్ చట్టంలోని సెక్షన్ 42 కింద రూ.5,00,000 జరిమానా విధించారు. ఉత్తర్వులు జారీ చేసిన తేదీ నుంచి 30 రోజుల్లోపు జరిమానా మొత్తాన్ని చెల్లించాలని ఆసుపత్రి యాజమాన్యాన్ని ఆదేశించారు.అదేవిధంగా తనిఖీల్లో గుర్తించిన లోపాలను సరిదిద్దడంతో పాటు, భవిష్యత్‌లో క్లినికల్ ఎస్టాబ్లిష్‌మెంట్స్ చట్టం మరియు సంబంధిత నిబంధనలను పూర్తిగా పాటించాలని అధికారులు సూచించారు.
— ప్రజా సంక్షేమం న్యూస్
ప్రజల ఆరోగ్యం – ప్రజల హక్కు – మా బాధ్యత