PRAJA SANKSHEMAM NEWS
Newspaper Banner
Date of Publish : 21 September 2026, 10:00 pm Posted by : Praja Sankshemam News

గ్రామసభల్లో ఎల్‌నినో యాక్షన్ ప్లాన్‌పై చర్చించాలి:పిఆర్ &ఆర్డి మినిస్టర్ సీతక్క

అత్యవసర గ్రామీణ పనులకు తొలి ప్రాధాన్యత ఇవ్వాలి!
పంచాయతీరాజ్,గ్రామీణాభివృద్ధి శాఖపై ఉన్నతస్థాయి సమీక్ష!

ప్రజాసంక్షేమం న్యూస్-హైదరాబాద్:పంచాయతీరాజ్,గ్రామీణాభివృద్ధి శాఖ ఆధ్వర్యంలో చేపడుతున్న అభివృద్ధి కార్యక్రమాలపై ఖైరతాబాద్‌లోని పంచాయతీరాజ్ కమిషనర్ కార్యాలయంలో ఉన్నతస్థాయి సమీక్ష సమావేశం నిర్వహించారు.గ్రామీణ ప్రాంతాల్లో చేపట్టాల్సిన అభివృద్ధి పనులు,ఉపాధి హామీ పథకం,నీటి భద్రత తదితర అంశాలపై అధికారులతో చర్చించారు.అక్టోబర్ 2న నిర్వహించనున్న గ్రామసభల్లో ఎల్‌నినో యాక్షన్ ప్లాన్‌పై విస్తృతంగా చర్చించాలని అధికారులను ఆదేశించారు.ప్రతి గ్రామంలో వాతావరణ పరిస్థితుల ప్రభావాన్ని దృష్టిలో ఉంచుకుని అవసరమైన చర్యలపై గ్రామసభల్లో తీర్మానాలు చేయాలని సూచించారు.గ్రామ అవసరాలు,అందుబాటులో ఉన్న నిధులను పరిగణనలోకి తీసుకుని ప్రాధాన్యత క్రమంలో అభివృద్ధి పనులను ఎంపిక చేయాలని తెలిపారు.ప్రజలకు అత్యవసరమైన పనులకు మొదటి ప్రాధాన్యత ఇవ్వాలని అధికారులను ఆదేశించారు.
ఉపాధి హామీ పనులకు రూ.6,700 కోట్లు:ఉపాధి హామీ పథకం ద్వారా ఈ ఏడాది రూ.6,700 కోట్లను ఖర్చు చేస్తున్నట్లు తెలిపారు. సగటున ఒక్కో గ్రామపంచాయతీలో సుమారు రూ.50 లక్షల విలువైన పనులు చేపట్టే అవకాశం ఉందని పేర్కొన్నారు. నిధులను గ్రామ అవసరాలకు అనుగుణంగా సమర్థవంతంగా వినియోగించాలని సూచించారు.
జలసిరి కార్యక్రమాన్ని వేగవంతం చేయాలి:గ్రామాల్లో నీటి భద్రతకు ప్రాధాన్యతనిస్తూ జలసిరి కార్యక్రమాన్ని వేగవంతం చేయాలని అధికారులను ఆదేశించారు. అధికారులు క్షేత్రస్థాయిలో పర్యటించి గ్రామాల్లోని సమస్యలను గుర్తించాలని,గ్రామసభలను విజయవంతంగా నిర్వహించేందుకు అవసరమైన చర్యలు చేపట్టాలని సూచించారు.గ్రామీణ ప్రాంతాల అవసరాలకు అనుగుణంగా అభివృద్ధి కార్యక్రమాలను అమలు చేస్తూ, ప్రజలకు ఉపయోగపడే పనులకు ప్రాధాన్యత ఇవ్వాలని అధికారులకు సూచించారు.

–