PRAJA SANKSHEMAM NEWS
Newspaper Banner
Date of Publish : 19 September 2026, 7:28 pm Posted by : Praja Sankshemam News

గ్రామీణ మౌలిక వసతులపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి:

గ్రామ పంచాయతీ,గ్రామ సమైక్య,అంగన్వాడీ భవనాల పనులను వేగవంతం చేయాలని మంత్రి సీతక్క ఆదేశం
ప్రజాసంక్షేమం న్యూస్-హైదరాబాద్:

గ్రామీణ ప్రాంతాల్లో మౌలిక వసతుల కల్పనపై తెలంగాణ ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించింది. గ్రామ పంచాయతీ భవనాలు, గ్రామ సమైక్య భవనాలు,అంగన్వాడీ భవనాల నిర్మాణ పనుల పురోగతిపై మంత్రి సీతక్క సచివాలయంలో సమీక్ష నిర్వహించారు.మంజూరైన భవనాల నిర్మాణ పనులను వేగవంతం చేసి, వివిధ శాఖల మధ్య సమన్వయంతో సకాలంలో పూర్తి చేయాలని మంత్రి అధికారులను ఆదేశించారు. నిర్మాణ పనుల్లో ఎలాంటి జాప్యం లేకుండా పెండింగ్‌ పనులను త్వరితగతిన పూర్తి చేయాలని సూచించారు.సమీక్షలో అధికారులు వెల్లడించిన వివరాల ప్రకారం.రాష్ట్రవ్యాప్తంగా9,745 గ్రామ సమైక్య భవనాలు మంజూరు కాగా,ఇప్పటివరకు 534 భవనాల నిర్మాణం పూర్తయింది.మరో 6,141 భవనాల పనులు పురోగతిలో ఉండగా,3,070 భవనాల నిర్మాణ పనులు ప్రారంభం కావాల్సి ఉంది.అలాగే రాష్ట్రంలో 3,906 గ్రామ పంచాయతీ భవనాలు మంజూరు కాగా, 444 భవనాల నిర్మాణం పూర్తయింది.మిగిలిన3,444 భవనాల పనులు కొనసాగుతున్నట్లు అధికారులు మంత్రికి వివరించారు.
అదేవిధంగా 2,313 అంగన్వాడీ భవనాలు మంజూరు కాగా, ఇప్పటివరకు 200 భవనాల నిర్మాణ పనులు పూర్తయ్యాయి. మిగిలిన 2,113 భవనాల పనులు కొనసాగుతున్నాయని అధికారులు తెలిపారు.గ్రామీణ ప్రాంతాల్లో ప్రజలకు అవసరమైన మౌలిక వసతులను అందుబాటులోకి తీసుకురావడంలో ఈ భవనాల నిర్మాణం కీలకమని మంత్రి సీతక్క పేర్కొన్నారు. వివిధ శాఖల మధ్య సమన్వయాన్ని మరింత పెంచుకుని, నిర్మాణ పనులకు ఎదురవుతున్న సమస్యలను ఎప్పటికప్పుడు పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు.ఈ సమావేశంలో స్పెషల్ సీఎస్ దాన కిషోర్, పంచాయతీరాజ్ గ్రామీణ అభివృద్ధి శాఖ కమిషనర్ దివ్య దేవరాజన్, మహిళా శిశు సంక్షేమ శాఖ కమిషనర్ శృతి ఓఝా, పంచాయతీరాజ్ ఈఎన్సీ జగదీష్తో పాటు పలువురు అధికారులు పాల్గొన్నారు.