PRAJA SANKSHEMAM NEWS
Newspaper Banner
Date of Publish : 21 September 2026, 10:32 pm Posted by : Praja Sankshemam News

చిత్రియాల పునరావాస రైతుల హక్కులను కాపాడాలి: PRPS రాష్ట్ర అధ్యక్షుడు నూనె వెంకట్ స్వామి

చందంపేట (ప్రజాసంక్షేమం న్యూస్):
నల్గొండ జిల్లా దేవరకొండ నియోజకవర్గం, చందంపేట మండలం చిత్రియాల రెవెన్యూ పరిధిలోని 206 సర్వే నంబర్‌లో పునరావాసం కింద భూములు పొందిన రైతులకు అన్ని రకాల చట్టబద్ధమైన హక్కులు వర్తింపజేయాలని ప్రజా పోరాట సమితి (PRPS) రాష్ట్ర అధ్యక్షుడు నూనె వెంకట్ స్వామి డిమాండ్ చేశారు.
సోమవారం చిత్రియాల,పెదమూల,నల్ల శిలమూల గ్రామాలకు చెందిన బాధిత రైతులతో కలిసి చందంపేట తహసీల్దార్ టి. సత్యనారాయణ గౌడ్‌కు ఆయన వినతిపత్రాన్ని సమర్పించారు.
సమస్య నేపథ్యం – 1972 నాటి పునరావాస చరిత్ర:
ఈ సందర్భంగా నూనె వెంకట్ స్వామి మాట్లాడుతూ… నాగార్జునసాగర్ రిజర్వాయర్ నిర్మాణ సమయంలో ముంపునకు గురైన వివిధ గ్రామాల రైతులకు 1972 సంవత్సరంలో చిత్రియాల రెవెన్యూ పరిధిలోని 206 సర్వే నంబర్ గల 9,600 ఎకరాల అటవీ భూమి నుంచి 2,061.28 ఎకరాలను రెవెన్యూ భూమిగా మార్చారని తెలిపారు. అందులో 1,240.29 ఎకరాల భూమిని ముంపు రైతులకు పునరావాసం కింద కేటాయించి పట్టాలు ఇచ్చారని, నాటి నుంచి నేటి వరకు రైతులు ఆ భూములను సాగు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారని వివరించారు.
2018 నాటి కుంభకోణం.. సక్రమ రైతులకు శాపం:
2018లో బిఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో 206 సర్వే నంబర్‌లోని మిగిలిన 7,600 ఎకరాల భూమిలో కొందరు అధికారులు (నలుగురు తహసీల్దార్లు, విఆర్వోలు) అక్రమాలకు పాల్పడి,దొంగ పట్టాలు సృష్టించి స్థానికేతరులకు కట్టబెట్టారని ఆరోపించారు.ఈ కుంభకోణంపై విచారణ జరిపి బాధ్యులైన అధికారులపై క్రిమినల్ చర్యలు కూడా తీసుకున్నారని గుర్తుచేశారు.
అయితే, “ఉరిమి ఉరిమి మంగళం మీద పడ్డట్టు” అధికారులు చేసిన అక్రమాల వల్ల 206 సర్వే నంబర్‌ను రెవెన్యూ రికార్డుల్లో పూర్తిగా లాక్ (Prohibited List) చేశారని తెలిపారు.దీనివల్ల 1972 నుంచి చట్టబద్ధంగా పట్టాలు పొంది సాగు చేసుకుంటున్న నిరుపేద రైతుల హక్కులు పూర్తిగా కాలరాయబడ్డాయని ఆవేదన వ్యక్తం చేశారు. భూముల క్రయవిక్రయాలు, మ్యూటేషన్లు నిలిచిపోయి రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని పేర్కొన్నారు.
అధికారులు స్పందించాలి:
జిల్లా కలెక్టర్, అడిషనల్ కలెక్టర్, ఆర్డీవో మరియు స్థానిక తహసీల్దార్ తక్షణమే జోక్యం చేసుకుని, అక్రమాలకు గురైన భూములకు, 1972 నాటి నిజమైన పునరావాస రైతులకు ఉన్న వ్యత్యాసాన్ని గుర్తించి లాక్ చేసిన సర్వే నంబర్ నుంచి పునరావాస భూములకు విముక్తి కల్పించాలని కోరారు. బాధిత రైతులకు హక్కులు నిలబెట్టే వరకు ప్రజా పోరాట సమితి అండగా ఉంటుందని స్పష్టం చేశారు.
ఈ కార్యక్రమంలో చిత్రియాల, పెదమూల, నల్ల శిలమూల గ్రామాల బాధిత రైతులు మరియు PRPS ప్రతినిధులు పాల్గొన్నారు.