22-A నిషేధిత జాబితా నుంచి విముక్తి.. ఇళ్ల స్థలాల క్రమబద్ధీకరణ ధ్రువపత్రాల పంపిణీ
ప్రజాసంక్షేమం న్యూస్-హైదరాబాద్, సెప్టెంబర్ 19:
ఎల్బీనగర్ నియోజకవర్గంలో ఏళ్లుగా పెండింగ్‌లో ఉన్న ఇళ్ల స్థలాల సమస్యకు పరిష్కారం దిశగా తెలంగాణ ప్రభుత్వం కీలక చర్యలు చేపట్టింది. సరూర్‌నగర్ ఇండోర్ స్టేడియం వేదికగా శనివారం జీవో 118 కింద ఇళ్ల స్థలాల క్రమబద్ధీకరణ ధ్రువపత్రాల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు.ఎల్బీనగర్ ప్రాంతంలో జీవో 118 పరిధిలోని దరఖాస్తులను పరిష్కరించి, అర్హులైన లబ్ధిదారులకు హక్కు పత్రాలు అందించే ప్రక్రియను ప్రభుత్వం ప్రారంభించింది. 22-A నిషేధిత జాబితాలో ఉన్న భూముల సమస్యను కూడా దశలవారీగా పరిష్కరించేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు ప్రభుత్వం వెల్లడించింది. జీవో 118 కింద రంగారెడ్డి, మేడ్చల్-మల్కాజ్‌గిరి జిల్లాల్లో 9,792 ప్లాట్ల క్రమబద్ధీకరణకు సంబంధించిన చర్యలు ప్రారంభమైనట్లు రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి తెలిపారు.కార్యక్రమంలో మంత్రులు పొన్నం ప్రభాకర్, మహమ్మద్ అజారుద్దీన్, ఎమ్మెల్యేలు మల్‌రెడ్డి రంగారెడ్డి, దేవిరెడ్డి సుధీర్‌రెడ్డి, ఆల్ ఇండియా ప్రొఫెషనల్ కాంగ్రెస్ చైర్మన్ మధుయాష్కీ గౌడ్, జిల్లా కలెక్టర్, స్థానిక ప్రజాప్రతినిధులు, సంబంధిత శాఖల అధికారులు పాల్గొన్నారు.
అసెంబ్లీ హామీకి అనుగుణంగా చర్యలు:
ఎల్బీనగర్ నియోజకవర్గంలో జీవో 118 సమస్యను పరిష్కరిస్తామని ముఖ్యమంత్రి ఏ. రేవంత్‌రెడ్డి సెప్టెంబర్ 16న శాసనసభలో ప్రకటించారు. పెండింగ్ దరఖాస్తులను నిర్ణీత గడువులో పరిష్కరించడంతో పాటు, 22-A సమస్యలకు శాశ్వత పరిష్కారం కోసం ఉన్నతస్థాయి కమిటీని ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు.అనంతరం ప్రభుత్వం 22-A భూ సమస్యల పరిష్కారం కోసం ఉన్నతస్థాయి కమిటీని ఏర్పాటు చేసింది. CCLA కమిషనర్ డి.ఎస్. లోకేశ్‌కుమార్ అధ్యక్షతన ఈ కమిటీలో న్యాయశాఖ కార్యదర్శి పాపిరెడ్డి, స్టాంపులు–రిజిస్ట్రేషన్ల ఐజీ రాజీవ్‌గాంధీ హనుమంతు సభ్యులుగా ఉన్నారు.
లేఅవుట్లకూ పరిష్కారం:HMDA, GHMC, DTCP అనుమతులు పొందిన లేఅవుట్లలో పెండింగ్‌లో ఉన్న రిజిస్ట్రేషన్ల పరిష్కారానికి కూడా ప్రభుత్వం చర్యలు చేపడుతోంది. ఈ తరహా భూ సమస్యలపై త్వరితగతిన నిర్ణయాలు తీసుకునేలా ప్రభుత్వం మార్గదర్శకాలు రూపొందిస్తోంది.అదేవిధంగా సింగరేణి ప్రాంతాల్లోని ఇళ్ల స్థలాల క్రమబద్ధీకరణకు సంబంధించిన జీవో 76 సమస్యపైనా చర్యలు ప్రారంభించినట్లు ప్రభుత్వం తెలిపింది.22-A కింద ఉన్న భూ సమస్యలను దశలవారీగా పరిష్కరించడంతో పాటు, అర్హులైన భూ హక్కుదారులకు చట్టబద్ధమైన హక్కులు కల్పించడమే లక్ష్యంగా ప్రభుత్వం చర్యలు కొనసాగిస్తోంది