జిల్లాలో ఒక్క ఎకరా కూడా ఎండనివ్వం:మంత్రి వాకిటి శ్రీహరి
రైతులను కాపాడుకోవడమే ప్రజా ప్రభుత్వ లక్ష్యం</strong
ప్రజా సంక్షేమం న్యూస్ | వనపర్తి: జూరాల ప్రాజెక్టు ఆయకట్టు రైతులకు వారాబందీ విధానంలో సాగునీటిని అందిస్తామని రాష్ట్ర క్రీడా,పాడి పరిశ్రమాభివృద్ధి, పశుసంవర్ధక,మత్స్య,యువజన సర్వీసుల శాఖ మంత్రి వాకిటి శ్రీహరి తెలిపారు.రైతులకు సాగునీటి విషయంలో ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని,జిల్లాలో ఒక్క ఎకరా కూడా ఎండిపోకుండా చూస్తామని స్పష్టం చేశారు.వనపర్తి జిల్లా కలెక్టరేట్లో ఉమ్మడి పాలమూరు జిల్లా ఇరిగేషన్ శాఖ అధికారులతో మంత్రులు వాకిటి శ్రీహరి,జూపల్లి కృష్ణారావు,ఎంపీ మల్లు రవి, ఎమ్మెల్యేలు సమీక్ష సమావేశం నిర్వహించారు. జూరాల ప్రాజెక్టు ఆయకట్టుకు నీటి విడుదల,నీటి లభ్యత,ఆయకట్టు అవసరాలు,పంటలకు సాగునీటి సరఫరాపై అధికారులతో సమగ్రంగా చర్చించారు.ప్రస్తుత నీటి పరిస్థితిపై వివరాలు తెలుసుకుని,రైతులకు సకాలంలో నీరు అందించేందుకు చేపట్టాల్సిన చర్యలపై సమీక్షించారు.
వారాబందీ విధానంలో నీటి సరఫరా:
అనంతరం మీడియాతో మంత్రి వాకిటి శ్రీహరి మాట్లాడుతూ.. రైతులను కాపాడుకునే బాధ్యత ప్రజా ప్రభుత్వంపై ఉందని అన్నారు.కృష్ణా నదిలో నీటి లభ్యత, జూరాల ఆయకట్టు అవసరాలను దృష్టిలో ఉంచుకుని వారాబందీ పద్ధతిలో సాగునీటిని అందిస్తామని తెలిపారు. వచ్చే వేసవిలో తాగునీటి కొరత ఏర్పడకుండా ఇప్పటి నుంచే ప్రణాళికలు సిద్ధం చేస్తున్నామని చెప్పారు.పాలమూరు-రంగారెడ్డిపై గత ప్రభుత్వంపై విమర్శలు:
గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టుపై తగిన శ్రద్ధ చూపలేదని మంత్రి విమర్శించారు. ఎన్నికల ముందు నార్లాపూర్ వద్ద ఒక్క పంపును ఆన్ చేసి ప్రాజెక్టు పూర్తయినట్లు ప్రచారం చేశారని ఆరోపించారు. పాలమూరు రైతుల ప్రయోజనాల కోసం గతంలో వరద నీటిని వినియోగించడంతో పాటు,కృష్ణా–భీమా నదులపై అవసరమైన బ్యారేజీల నిర్మాణానికి ఎందుకు చర్యలు తీసుకోలేదని ప్రశ్నించారు.
ప్రజా సంక్షేమం న్యూస్ | వనపర్తి