PRAJA SANKSHEMAM NEWS
Newspaper Banner
Date of Publish : 29 September 2026, 8:40 pm Posted by : Praja Sankshemam News

తుమ్మిడిహట్టి బ్యారేజీకి త్వరగా అనుమతులు ఇప్పించాలి.

మహారాష్ట్రతో అంగీకారం కుదిరేలా చొరవ తీసుకోవాలని కేంద్ర జల్‌శక్తి మంత్రికి సీఎం రేవంత్ రెడ్డి విజ్ఞప్తి
ఢిల్లీ, సెప్టెంబర్ 29: ప్రజాసంక్షేమం న్యూస్:

తుమ్మిడిహట్టి బ్యారేజీ నిర్మాణానికి మహారాష్ట్ర ప్రభుత్వంతో త్వరగా అంగీకారం కుదిరేలా చొరవ తీసుకుని అవసరమైన అనుమతులు ఇప్పించాలని కేంద్ర జల్‌శక్తి మంత్రి సీఆర్ పాటిల్‌ను ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి కోరారు. మహారాష్ట్ర కోరిన సమాచారాన్ని తెలంగాణ ప్రభుత్వం ఇప్పటికే సమర్పించిందని తెలిపారు.ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, నీటిపారుదల శాఖ మంత్రి ఎన్. ఉత్తమ్ కుమార్ రెడ్డితో కలిసి ఢిల్లీలో కేంద్ర జల్‌శక్తి మంత్రితో సమావేశమై కృష్ణా, గోదావరి బేసిన్లలో తెలంగాణకు సంబంధించిన పలు సాగునీటి ప్రాజెక్టుల అంశాలపై చర్చించారు.
152 మీటర్ల ఎఫ్‌ఆర్‌ఎల్‌తో గ్రావిటీ ద్వారా నీటి తరలింపు
తుమ్మిడిహట్టి బ్యారేజీని ఎఫ్‌ఆర్‌ఎల్‌ +152 మీటర్ల స్థాయిలో నిర్మించేందుకు తెలంగాణ–మహారాష్ట్ర మధ్య త్వరగా అంగీకారం కుదరాలని సీఎం కోరారు. ఈ స్థాయిలో బ్యారేజీ నిర్మిస్తే ఎల్లంపల్లికి గ్రావిటీ ద్వారా నీటిని తరలించే అవకాశం ఉంటుందని, తద్వారా నీటి పంపింగ్‌కు అవసరమయ్యే విద్యుత్ వినియోగం, వ్యయం తగ్గుతుందని వివరించారు.
సాగునీటి ప్రాజెక్టులకు పర్యావరణ అనుమతులు కోరుతూ విజ్ఞప్తి:
పాలమూరు–రంగారెడ్డి ఎత్తిపోతల పథకం (PRLIS), డిండి ఎత్తిపోతల పథకం (DLIS), సీతారామ సాగర్ బహుళార్ధక ప్రాజెక్టు (SSMP), గౌరవెల్లి రిజర్వాయర్‌కు పర్యావరణ అనుమతులు త్వరగా మంజూరు చేయాలని కేంద్రాన్ని కోరారు. అనుమతుల జాప్యం వల్ల ప్రాజెక్టుల నిర్మాణ వ్యయం పెరుగుతోందని సీఎం వివరించారు.అలాగే సమ్మక్కసాగర్ ప్రాజెక్టుకు సంబంధించి కేంద్ర జల సంఘం (CWC) వద్ద పెండింగ్‌లో ఉన్న అనుమతులను త్వరగా మంజూరు చేయాలని కోరారు. ప్రాజెక్టు డీపీఆర్‌ను సీడబ్ల్యూసీకి సమర్పించినట్లు తెలిపారు.
టెలీమెట్రీ వ్యవస్థ ఏర్పాటును వేగవంతం చేయాలి:కృష్ణా నదీ యాజమాన్య బోర్డు (KRMB) ఆధ్వర్యంలో చేపడుతున్న టెలీమెట్రీ యంత్రాల ఏర్పాటును వేగవంతం చేయాలని సీఎం విజ్ఞప్తి చేశారు. మొదటి దశ టెలీమెట్రీ ఏర్పాటుకు అవసరమైన రూ.4.15 కోట్లను తెలంగాణ ప్రభుత్వం ఇప్పటికే జమ చేసిందని తెలిపారు. రెండో, మూడో దశలకు సంబంధించిన యంత్రాలను కూడా త్వరగా ఏర్పాటు చేయాలని కోరారు.సమావేశంలో మంత్రి జి. వివేక్ వెంకటస్వామి, ఎంపీ గడ్డం వంశీకృష్ణ, ఎమ్మెల్యే గడ్డం వినోద్, రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు (నీటిపారుదల) ఆదిత్యనాథ్ దాస్, సీఎం కార్యదర్శి మాణిక్‌రాజ్ తదితర అధికారులు పాల్గొన్నారు.తుమ్మిడిహట్టి అంశంపై తెలంగాణ–మహారాష్ట్ర మధ్య సీడబ్ల్యూసీ ఆధ్వర్యంలో ఇప్పటికే చర్చలు జరిగాయి; 152 మీటర్ల ఎఫ్‌ఆర్‌ఎల్, ముంపు, నీటి లభ్యత, రెండు రాష్ట్రాల ప్రయోజనాలపై చర్చించినట్లు సెప్టెంబర్ ప్రారంభంలో నివేదికలు పేర్కొన్నాయి.