PRAJA SANKSHEMAM NEWS
Newspaper Banner
Date of Publish : 21 September 2026, 10:22 pm Posted by : Praja Sankshemam News

తెలంగాణలో ఖేలో ఇండియా యూత్ గేమ్స్‌–2026 కు ఘనంగా ఏర్పాట్లు:

క్రీడా వేదికలు,వసతి,రవాణా,భద్రతపై మంత్రి వాకిటి శ్రీహరి సమీక్ష
శాఖలన్నీ సమన్వయంతో పనిచేయాలి.. క్రీడాకారులకు అత్యుత్తమ వసతులు కల్పించాలి
ప్రజాసంక్షేమం న్యూస్-హైదరాబాద్:

తెలంగాణలో డిసెంబర్ 11 నుంచి 23 వరకు నిర్వహించనున్న ఖేలో ఇండియా యూత్ గేమ్స్‌–2026 పోటీలను ప్రతిష్ఠాత్మకంగా,విజయవంతంగా నిర్వహించేందుకు రాష్ట్ర ప్రభుత్వం సన్నద్ధమవుతోంది.ఈ నేపథ్యంలో పోటీల ఏర్పాట్లపై సచివాలయంలో రాష్ట్ర క్రీడా శాఖ మంత్రి వాకిటి శ్రీహరి ఉన్నతస్థాయి సమీక్ష సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా క్రీడా పోటీల నిర్వహణకు చేపట్టాల్సిన ఏర్పాట్లను శాఖల వారీగా మంత్రి సమీక్షించారు. క్రీడా వేదికల సిద్ధత, మౌలిక వసతులు, క్రీడాకారుల వసతి, రవాణా, భద్రత, వైద్య సదుపాయాలు, ఆహారం, పరిశుభ్రత, స్వాగత ఏర్పాట్లు, ప్రచార కార్యక్రమాలపై అధికారులతో విస్తృతంగా చర్చించారు.
దేశంలోని వివిధ రాష్ట్రాల నుంచి తెలంగాణకు వచ్చే యువ క్రీడాకారులకు అత్యుత్తమ వసతులు కల్పించడమే లక్ష్యంగా పనిచేయాలని మంత్రి అధికారులను ఆదేశించారు. ప్రతి క్రీడా వేదికలో అవసరమైన సౌకర్యాలు ముందుగానే అందుబాటులో ఉండేలా చర్యలు చేపట్టాలని సూచించారు. పోటీల నిర్వహణలో ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా అన్ని శాఖలు పరస్పర సమన్వయంతో పనిచేయాలని స్పష్టం చేశారు.
యువ క్రీడాకారులకు మరిన్ని అవకాశాలు:
ఖేలో ఇండియా యూత్ గేమ్స్ వంటి జాతీయస్థాయి పోటీలు తెలంగాణ యువ క్రీడాకారులకు తమ ప్రతిభను జాతీయ స్థాయిలో ప్రదర్శించేందుకు మరిన్ని అవకాశాలను కల్పిస్తాయని మంత్రి పేర్కొన్నారు.రాష్ట్రంలో క్రీడా సంస్కృతిని మరింత బలోపేతం చేయడంతో పాటు గ్రామీణ ప్రాంతాల్లోని ప్రతిభావంతులైన క్రీడాకారులను గుర్తించి ప్రోత్సహించేందుకు ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తోందని తెలిపారు.తెలంగాణ ఆతిథ్యానికి, క్రీడా రంగంలో రాష్ట్ర ప్రతిష్ఠకు తగిన స్థాయిలో ఖేలో ఇండియా యూత్ గేమ్స్‌ను నిర్వహించేందుకు అధికారులు సమగ్ర కార్యాచరణతో ముందుకు సాగాలని మంత్రి వాకిటి శ్రీహరి సూచించారు.
ఈ సమీక్ష సమావేశంలో రాష్ట్ర ప్రభుత్వ క్రీడల సలహాదారు ఏపీ జితేందర్ రెడ్డి,రాష్ట్ర ప్రభుత్వ ప్రత్యేక ముఖ్య కార్యదర్శి జయేశ్ రంజన్,స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ తెలంగాణ ఎండీ సోనీ బాలదేవి,క్రీడా శాఖ ఉన్నతాధికారులు పాల్గొన్నారు.
– ప్రజాసంక్షేమం న్యూస్