PRAJA SANKSHEMAM NEWS
Newspaper Banner
Date of Publish : 20 September 2026, 7:44 pm Posted by : Praja Sankshemam News

దళితుల అంగుళం భూమి కూడా ప్రభుత్వం తీసుకోదు:మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి

భూ హక్కుల విషయంలో ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదు
విషప్రచారాన్ని నమ్మొద్దు.. రెచ్చగొట్టే ప్రయత్నాలను తిప్పికొట్టండి:మంత్రి పొంగులేటి

ప్రజాసంక్షేమం న్యూస్-హైదరాబాద్‌:దళితులు,గిరిజనుల భూములను లాక్కోవడం ప్రజా ప్రభుత్వ విధానం కాదని, వారి అంగుళం భూమిని కూడా ప్రభుత్వం తీసుకోదని రెవెన్యూ,హౌసింగ్‌,సమాచార,పౌర సంబంధాల శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి స్పష్టం చేశారు.ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి నాయకత్వంలోని ప్రజా ప్రభుత్వం దళితుల భూ హక్కులకు సంపూర్ణ రక్షణగా నిలుస్తుందని ఆదివారం విడుదల చేసిన ప్రకటనలో భరోసా ఇచ్చారు.సామాజిక న్యాయం,పేదల సంక్షేమం,అణగారిన వర్గాల అభ్యున్నతి కాంగ్రెస్‌ పాలనలో ప్రధాన ప్రాధాన్యతలుగా ఉన్నాయని మంత్రి పేర్కొన్నారు.భూ సంస్కరణలు,భూ పంపిణీ కార్యక్రమాల ద్వారా భూమిలేని దళితులకు భూములు అందించి హక్కులు కల్పించిన చరిత్ర కాంగ్రెస్‌ ప్రభుత్వాలకు ఉందన్నారు.
తెలంగాణ ప్రాంతంలో ఇందిరమ్మ ప్రభుత్వ హయాంలో దళితులకు సుమారు 25 లక్షల ఎకరాల భూముల పంపిణీ జరిగిందని, పోడు భూముల విషయంలో గిరిజనులకు సుమారు 2 లక్షల ఎకరాలపై హక్కులు కల్పించిన ఘనత కూడా కాంగ్రెస్‌దేనని తెలిపారు.భూమిలేని వారికి భూమి,హక్కులు లేని వారికి హక్కులు కల్పించడమే కాంగ్రెస్‌ విధానమని స్పష్టం చేశారు.భూములకు సంబంధించిన రికార్డుల పరిశీలన,రీ-సర్వేలు,భూ సమస్యల పరిష్కార ప్రక్రియలను ప్రజల భూములను లాక్కోవడానికి చేస్తున్న చర్యలుగా భావించడం సరికాదన్నారు.భూములపై ప్రజలకు ఉన్న హక్కులను స్పష్టంగా నమోదు చేయడం,వివాదాలను పరిష్కరించడం,భూ హక్కులకు రక్షణ కల్పించడమే ప్రభుత్వ ఉద్దేశమని చెప్పారు.
సూర్యాపేట జిల్లా నూతనకల్‌,మద్దిరాల ప్రాంతంలోని 15 రెవెన్యూ గ్రామాలతో పాటు మహబూబాబాద్‌ జిల్లా కేసముద్రం మండలం నారాయణపురం గ్రామంలో దశాబ్దాలుగా ఉన్న భూ సమస్యలకు పరిష్కారం చూపించామని మంత్రి తెలిపారు.రీ-సర్వే ద్వారా భూముల వాస్తవ పరిస్థితులను గుర్తించి దళితులు,గిరిజనులకు హక్కులు కల్పిస్తున్నామని చెప్పారు.కొంతమంది తమ స్వార్థ ప్రయోజనాల కోసం దళితుల్లో భయాందోళనలు సృష్టిస్తూ విషప్రచారం చేస్తున్నారని మంత్రి ఆరోపించారు. అలాంటి ప్రచారాలను నమ్మకుండా వాస్తవాలను తెలుసుకోవాలని,దళితులను రెచ్చగొట్టి రాజకీయ లబ్ధి పొందే ప్రయత్నాలను తిప్పికొట్టాలని సూచించారు.“మీ అంగుళం భూమి కూడా ప్రభుత్వం లాక్కోదు.మీ భూమిని తీసుకునే ఆలోచన కూడా ఈ ప్రభుత్వానికి లేదు.భూముల విషయంలో ఎలాంటి భయాందోళనలకు గురికావాల్సిన అవసరం లేదు.ప్రజా ప్రభుత్వం మీకు అండగా ఉంటుంది” అని మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి స్పష్టం చేశారు.