అన్ని శాఖల అధికారులతో నియోజకవర్గ స్థాయి సమీక్ష నిర్వహించిన ఎమ్మెల్యే వేముల వీరేశం..
పెండింగ్ పనులు వేగవంతం చేయాలి.. ప్రజా సమస్యలను తక్షణమే పరిష్కరించాలి!
సంక్షేమ పథకాలు అర్హులందరికీ అందేలా చర్యలు తీసుకోవాలి..
నకిరేకల్, సెప్టెంబర్ 25 (ప్రజా సంక్షేమం న్యూస్):
నకిరేకల్ నియోజకవర్గ అభివృద్ధి,ప్రజా సమస్యల పరిష్కారంపై ప్రభుత్వ విప్,నకిరేకల్ ఎమ్మెల్యే శ్రీ వేముల వీరేశం అన్ని శాఖల అధికారులతో నియోజకవర్గ స్థాయి సమగ్ర సమీక్షా సమావేశం నిర్వహించారు.ఈ సమావేశానికి ఇరిగేషన్, ఆర్‌అండ్‌బీ,విద్య, వైద్యం,రెవెన్యూ,విద్యుత్, వ్యవసాయం, పోలీస్ తదితర శాఖలకు చెందిన జిల్లా,మండల స్థాయి అధికారులు హాజరయ్యారు.నియోజకవర్గంలో కొనసాగుతున్న అభివృద్ధి పనుల పురోగతితో పాటు ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలపై ఎమ్మెల్యే అధికారులతో సమీక్షించారు.
పెండింగ్ పనులు పూర్తి చేయాలి:
ఈ సందర్భంగా ఎమ్మెల్యే వేముల వీరేశం మాట్లాడుతూ నియోజకవర్గంలో అభివృద్ధి పనులను వేగవంతం చేయడంతో పాటు ప్రజలకు ఎదురవుతున్న సమస్యలను వివిధ శాఖల అధికారులు సమన్వయంతో పరిష్కరించాలని సూచించారు.
ఇరిగేషన్ శాఖ: చెరువులు, కాలువలకు సంబంధించిన పెండింగ్ పనులను త్వరితగతిన పూర్తి చేసి రైతులకు సాగునీరు అందేలా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు.
ఆర్‌అండ్‌బీ:నియోజకవర్గంలో కొత్త రహదారుల నిర్మాణంతో పాటు ఇప్పటికే మంజూరైన రోడ్డు పనులను వెంటనే ప్రారంభించాలని సూచించారు. మరమ్మతులు అవసరమైన రహదారుల పనులను కూడా వేగంగా పూర్తి చేయాలని ఆదేశించారు.
ఇందిరమ్మ ఇళ్లపై ప్రత్యేక దృష్టి:అర్హులైన పేదలకు రెండో విడతలో ఇందిరమ్మ ఇళ్ల మంజూరులో ఎలాంటి జాప్యం జరగకుండా చూడాలని అధికారులకు సూచించారు. ఇప్పటికే నిర్మాణంలో ఉన్న ఇళ్లను త్వరగా పూర్తి చేసేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.
విద్య, వైద్య సేవలు మెరుగుపడాలి:ప్రభుత్వ పాఠశాలలు, ఆసుపత్రుల్లో మౌలిక వసతులను మెరుగుపరచడంతో పాటు ప్రజలకు నాణ్యమైన విద్య, వైద్య సేవలు అందేలా అధికారులు చర్యలు తీసుకోవాలని ఎమ్మెల్యే సూచించారు.రెవెన్యూ, వ్యవసాయ శాఖలకు సంబంధించి రైతులు ఎదుర్కొంటున్న సమస్యలను వెంటనే పరిష్కరించాలని, ప్రభుత్వ సంక్షేమ పథకాలు అర్హులైన ప్రతి ఒక్కరికీ చేరేలా చూడాలని అన్నారు. వ్యవసాయ అవసరాల కోసం రైతులకు నిరంతర విద్యుత్ సరఫరా అందేలా చర్యలు తీసుకోవాలని విద్యుత్ శాఖ అధికారులను ఆదేశించారు.
ప్రజలకు అధికారులు అందుబాటులో ఉండాలి:
అన్ని శాఖల అధికారులు ప్రజలకు అందుబాటులో ఉంటూ, తమ సమస్యలతో కార్యాలయాలకు వచ్చే ప్రజల సమస్యలను తక్షణమే పరిష్కరించేలా పనిచేయాలని ఎమ్మెల్యే వేముల వీరేశం సూచించారు.సమావేశంలో నియోజకవర్గంలోని వివిధ శాఖల అధికారులు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.