బెర్లిన్ ఎన్నికల్లో డై లింకె చారిత్రక విజయం
ఎలిఫ్ ఎరాల్ప్‌కు సీపీఎం ప్రధాన కార్యదర్శి అభినందనలు
గృహ హక్కులు, సామాజిక న్యాయంపై దృష్టి పెట్టిన వామపక్షం
ప్రజా సంక్షేమం న్యూస్–అంతర్జాతీయ డెస్క్: జర్మనీలోని బెర్లిన్ రాష్ట్ర ఎన్నికల్లో వామపక్ష పార్టీ డై లింకె (Die Linke) సాధించిన చారిత్రక విజయంపై భారత కమ్యూనిస్టు పార్టీ (మార్క్సిస్టు) ప్రధాన కార్యదర్శి ఎం.ఏ. బేబీ హర్షం వ్యక్తం చేశారు. మంగళవారం సామాజిక మాధ్యమం‘ఎక్స్’ వేదికగా స్పందించిన ఆయన.. “న్యూయార్క్ నుంచి బెర్లిన్ వరకు సోషలిస్ట్ ప్రత్యామ్నాయం విజయం సాధిస్తోంది”అని పేర్కొన్నారు.డై లింకెను చారిత్రక విజయానికి నడిపించిన పార్టీ అగ్రనేత ఎలిఫ్ ఎరాల్ప్‌కు ఎం.ఏ. బేబీ అభినందనలు తెలిపారు.గృహ హక్కులు,సామాజిక న్యాయం,ఆత్మగౌరవానికి సంబంధించి ఆమె చేసిన వాగ్దానాలను నెరవేర్చాలని ఆకాంక్షించారు.
సెప్టెంబర్ 20న జరిగిన బెర్లిన్ అసెంబ్లీ ఎన్నికల్లో డై లింకె 25.7 శాతం ఓట్లతో ప్రథమ స్థానంలో నిలిచింది. 2023 ఎన్నికల్లో సాధించిన 12.2 శాతం కంటే ఈసారి పార్టీ ఓట్ల శాతం గణనీయంగా పెరిగింది. బెర్లిన్‌లో గృహ సంక్షోభం, అద్దెల భారం వంటి అంశాలు డై లింకె ప్రచారంలో ప్రధానంగా నిలిచాయి. ఎలిఫ్ ఎరాల్ప్ ప్రచారాన్ని న్యూయార్క్ మేయర్ జోహ్రాన్ మమ్దానీ రాజకీయ ప్రచార శైలితో పోలుస్తూ పలు అంతర్జాతీయ మీడియా కథనాలు వెలువడ్డాయి. డై లింకె ప్రతినిధులు న్యూయార్క్‌లో మమ్దానీ ప్రచార బృందంతో సంప్రదింపులు జరిపినట్లు కూడా నివేదికలు పేర్కొన్నాయి.
సంప్రదాయ పాలక పార్టీలకు వ్యతిరేకంగా బెర్లిన్ ప్రజలు ఇచ్చిన తీర్పు, సామాజిక-ఆర్థిక సమస్యలపై కేంద్రీకృతమైన రాజకీయ కార్యక్రమాలకు ప్రజా మద్దతు లభించగలదనే విషయాన్ని చూపిస్తుందని బేబీ పేర్కొన్నారు. కార్మిక వర్గ రాజకీయాలను అనుసరించే వారికి ఈ విజయం స్ఫూర్తినిస్తుందని ఆయన ఆకాంక్షించారు.