PRAJA SANKSHEMAM NEWS
Newspaper Banner
Date of Publish : 07 September 2026, 10:13 pm Posted by : Praja Sankshemam News

పట్టణ ప్రాంతాల్లో నివసించే పేదల సొంతింటి కలను కూడా సాకారం చేస్తం: మంత్రి పొంగులేటి

💠కార్పొరేషన్లలోనూ ఇందిరమ్మ టవర్స్‌
💠గుడిసెలు లేని తెలంగాణే లక్ష్యం
💠ఇందిరమ్మ ఇళ్లకు కేంద్రం నుంచి ఆశించిన సహకారం లేదు
ప్రజాసంక్షేమం న్యూస్-హైదరాబాద్:

గ్రామీణ ప్రాంతాల్లో పేదల సొంతింటి కలను సాకారం చేస్తున్నట్లుగానే పట్టణ ప్రాంతాల్లో నివసించే పేదల సొంతింటి కలను కూడా సాకారం చేస్తామని రాష్ట్ర రెవెన్యూ, హౌసింగ్‌, సమాచార పౌర సంబంధాల శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస‌రెడ్డి తెలిపారు.
ఇందిరమ్మ ఇళ్లపై శాసనమండలిలో సభ్యులు అడిగిన ప్రశ్నలకు మంత్రి సమాధానమిస్తూ.. స్థలాల కొరతను దృష్టిలో ఉంచుకుని జీహెచ్‌ఎంసీ పరిధిలో నిర్మిస్తున్న ఇందిరమ్మ టవర్స్‌ తరహాలోనే నల్గొండ, నిజామాబాద్‌, కరీంనగర్‌, వరంగల్‌ తదితర మున్సిపల్‌ కార్పొరేషన్లలోనూ ఇందిరమ్మ టవర్స్‌ నిర్మిస్తామని వెల్లడించారు.
గుడిసె లేని తెలంగాణే లక్ష్యం:
రాష్ట్రంలో గుడిసెల్లో నివసిస్తున్న కుటుంబాలను గుర్తించి, గుడిసెలు లేని తెలంగాణ నిర్మించడమే ప్రభుత్వ లక్ష్యమని మంత్రి స్పష్టం చేశారు. అర్హులైన వారికి ఇందిరమ్మ ఇళ్లు నిర్మించి ఇవ్వడంతో పాటు పొదుపు మహిళా సంఘాల ద్వారా రూ.లక్ష వరకు అడ్వాన్స్‌ రుణం అందించేలా చర్యలు తీసుకుంటామని తెలిపారు.
కేంద్రం నుంచి ఒక్క ఇల్లు కూడా మంజూరు కాలేదు:
ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణానికి కేంద్రం నుంచి ఆశించిన స్థాయిలో సహకారం అందడం లేదని మంత్రి పేర్కొన్నారు. దేశంలోని ఇతర రాష్ట్రాలకు గ్రామీణ ప్రాంతాల్లో లక్షలు, రెండు లక్షల ఇళ్లు మంజూరు చేసిన కేంద్ర ప్రభుత్వం.. తెలంగాణకు మాత్రం ఒక్క ఇల్లు కూడా మంజూరు చేయలేదని అన్నారు. కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి శివరాజ్‌సింగ్‌ చౌహాన్‌ను తాను, ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి పలుమార్లు కలిసి తెలంగాణకు గృహాలు మంజూరు చేయాలని విజ్ఞప్తి చేసినప్పటికీ ఇప్పటివరకు ఆశించిన స్పందన రాలేదన్నారు.
దసరా నాటికి 2 లక్షల ఇళ్లు పూర్తి:
రాష్ట్రంలో తొలి విడతలో రూ.22,500 కోట్లతో 4.50 లక్షల ఇందిరమ్మ ఇళ్లను మంజూరు చేశామని మంత్రి తెలిపారు. ఇందులో 3,75,750 ఇళ్లకు కలెక్టర్లు లబ్ధిదారులకు మంజూరు పత్రాలు అందజేశారని, 3,28,070 ఇళ్లు గ్రౌండ్‌ అయినట్లు వెల్లడించారు. ఇప్పటివరకు 1,97,537 ఇళ్లు పూర్తయ్యాయని, దసరా నాటికి 2 లక్షల ఇళ్లను పూర్తి చేస్తామని ప్రకటించారు.
ఈ నెల 20లోగా రెండో విడత ఇళ్ల మంజూరు:
రెండో విడతలో నియోజకవర్గానికి 2,000 చొప్పున 2.50 లక్షల ఇందిరమ్మ ఇళ్లను మంజూరు చేశామని మంత్రి తెలిపారు. గతంలో కాంగ్రెస్‌ ప్రభుత్వాలు ఇళ్లను మంజూరు చేసినప్పటికీ వివిధ దశల్లో నిర్మాణాలు నిలిచిపోయిన ఇళ్లకు ఈ విడతలో ప్రాధాన్యత ఇస్తున్నామన్నారు. ఈ నెల 20వ తేదీలోగా రెండో విడత ఇందిరమ్మ ఇళ్ల మంజూరు ప్రక్రియను పూర్తి చేస్తామని మంత్రి స్పష్టం చేశారు.
రూ.230కే సిమెంట్‌.. త్వరలో రాయితీపై స్టీల్‌:
పేదల ఆత్మగౌరవానికి ప్రతీకగా నిర్మిస్తున్న ఇందిరమ్మ ఇళ్లకు రూ.230కే సిమెంట్‌ బస్తాలను రాయితీపై సరఫరా చేస్తున్నామని మంత్రి తెలిపారు. త్వరలో పరిశ్రమల శాఖ మంత్రితో కలిసి స్టీల్‌ పరిశ్రమల యజమానులతో సమావేశం నిర్వహించి, రాయితీపై స్టీల్‌ అందించేలా చర్యలు తీసుకుంటామని వెల్లడించారు.
అసంపూర్తి 2 బీహెచ్‌కే ఇళ్లకు పూర్తి:
గత ప్రభుత్వ హయాంలో వివిధ కారణాలతో నిలిచిపోయిన అసంపూర్తి 2బీహెచ్‌కే ఇళ్లను పూర్తి చేసి లబ్ధిదారులకు అందిస్తున్నామని మంత్రి తెలిపారు. ఆయా కాలనీల్లో అవసరమైన మౌలిక వసతులను కూడా కల్పిస్తున్నామని పేర్కొన్నారు. పేదలకు ఇల్లు అంటే కేవలం నాలుగు గోడలు కాదు.. అది ఆత్మగౌరవానికి ప్రతీక. గుడిసె లేని తెలంగాణను నిర్మించడమే ప్రజా ప్రభుత్వ లక్ష్యమ‌ని మంత్రి పొంగులేటి శ్రీనివాస‌రెడ్డి స్పష్టం చేశారు.