PRAJA SANKSHEMAM NEWS
Newspaper Banner
Date of Publish : 12 September 2026, 7:59 am Posted by : Praja Sankshemam News

పెండింగ్ కేసులను త్వరితగతిన పరిష్కరించాలి:ఎస్పీ శరత్ చంద్ర పవార్

నేర నియంత్రణపై ప్రత్యేక దృష్టి పెట్టాలి:నల్గొండ జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవార్, ఐపీఎస్
ప్రజాసంక్షేమం న్యూస్ -నల్గొండ:</strong పెండింగ్‌లో ఉన్న కేసులను త్వరితగతిన పరిష్కరించడంతో పాటు నేర నియంత్రణపై ప్రత్యేక దృష్టి సారించాలని నల్గొండ జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవార్,ఐపీఎస్ పోలీసు అధికారులను ఆదేశించారు.నల్గొండ జిల్లా పోలీసు అధికారులతో నిర్వహించిన క్రైమ్ రివ్యూ సమావేశంలో పెండింగ్ కేసులు,ఎన్‌బీడబ్ల్యూ (NBW) కేసులు,ఆస్తి సంబంధిత నేరాలు,సైబర్ నేరాలు,ఎన్‌డీపీఎస్ కేసులు,రోడ్డు ప్రమాదాలు,శాంతిభద్రతలకు సంబంధించిన అంశాలపై ఎస్పీ సమీక్ష నిర్వహించారు.పెండింగ్ కేసుల దర్యాప్తును వేగవంతం చేసి,నిర్ణీత గడువులో నాణ్యమైన చార్జిషీట్లను దాఖలు చేయాలని సూచించారు. దర్యాప్తులో ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని సమర్థవంతంగా వినియోగించాలని ఆదేశించారు.పరారీలో ఉన్న నిందితులను గుర్తించడం,పెండింగ్‌లో ఉన్న ఎన్‌బీడబ్ల్యూలను అమలు చేయడంపై ప్రత్యేక దృష్టి పెట్టాలని తెలిపారు.
సైబర్ నేరాలపై తక్షణ స్పందన:
సైబర్ నేరాలకు సంబంధించిన ఫిర్యాదులపై పోలీసులు వెంటనే స్పందించాలని ఎస్పీ సూచించారు. ఆర్థిక మోసాలకు గురైన బాధితులు ఆలస్యం చేయకుండా 1930కు ఫోన్ చేసి ఫిర్యాదు చేసేలా ప్రజల్లో విస్తృత అవగాహన కల్పించాలని అన్నారు. బాధితులు త్వరగా ఫిర్యాదు చేస్తే బ్యాంకులు, సైబర్ క్రైమ్ బృందాలతో సమన్వయం చేసుకుని మోసపూరిత లావాదేవీలను నిలిపివేయడానికి, బాధితులకు నష్టపోయిన మొత్తాన్ని తిరిగి పొందేందుకు చర్యలు తీసుకోవచ్చని తెలిపారు.
నేరస్తులపై నిఘా పెంచాలి:
అలవాటుగా నేరాలకు పాల్పడే వ్యక్తులు,రౌడీషీటర్లు, అనుమానాస్పద వ్యక్తులపై నిరంతరం నిఘా ఉంచాలని ఎస్పీ ఆదేశించారు.నేరాలు జరిగే ప్రాంతాల్లో బీట్ పెట్రోలింగ్,రాత్రి గస్తీ,వాహనాల తనిఖీలను ముమ్మరం చేయాలని సూచించారు.నేరాలు జరగకముందే వాటిని అడ్డుకునేలా ముందస్తు చర్యలు చేపట్టాలని స్పష్టం చేశారు.
గంజాయి,మాదకద్రవ్యాల అక్రమ రవాణాపై కఠిన చర్యలు
గంజాయి మరియు ఇతర మాదకద్రవ్యాల అక్రమ రవాణా, విక్రయాలు,వినియోగంపై కఠిన చర్యలు తీసుకోవాలని ఎస్పీ ఆదేశించారు.ముఖ్యంగా విద్యార్థులు,యువత మాదకద్రవ్యాల బారిన పడకుండా అవగాహన కార్యక్రమాలను నిర్వహించాలని సూచించారు.
రోడ్డు ప్రమాదాల నివారణకు చర్యలు:
రోడ్డు భద్రతపై ప్రత్యేక దృష్టి సారించాలని, ప్రమాదాలు ఎక్కువగా జరిగే బ్లాక్ స్పాట్లను గుర్తించి అవసరమైన నివారణ చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు. ప్రమాదాల నివారణకు సంబంధిత శాఖలతో సమన్వయం చేసుకుని చర్యలు తీసుకోవాలని సూచించారు.
ప్రజా ఫిర్యాదుల పరిష్కారంలో బాధ్యతగా వ్యవహరించాలి
ప్రజలు అందించే ప్రతి ఫిర్యాదుపై పోలీసులు బాధ్యతాయుతంగా స్పందించాలని ఎస్పీ తెలిపారు. బాధితులతో మర్యాదగా వ్యవహరిస్తూ,చట్టపరమైన పరిధిలో ఫిర్యాదులను వేగంగా పరిష్కరించాలని సూచించారు.
ప్రజల భద్రత,నేరాల నియంత్రణ,నాణ్యమైన దర్యాప్తు, పెండింగ్ కేసుల త్వరిత పరిష్కారం,బాధితులకు సకాలంలో న్యాయం అందించడం నల్గొండ జిల్లా పోలీసుల ప్రధాన ప్రాధాన్యతలు అని ఎస్పీ శరత్ చంద్ర పవార్,ఐపీఎస్ పునరుద్ఘాటించారు.ఈ సమావేశంలో నల్గొండ డీఎస్పీ కె. శివరామ్ రెడ్డి,దేవరకొండ డీఎస్పీ శ్రీనివాసరావు,సీఐలు, ఎస్‌ఐలు మరియు ఇతర పోలీసు అధికారులు పాల్గొన్నారు.

Copyright © 2026 PRAJA SANKSHEMAM NEWS. All rights reserved.