ఆత్మగౌరవ భవనంతో పేద ఆర్యవైశ్య కుటుంబాల పిల్లలకు ప్రయోజనం కల్పించాలి:సీఎం రేవంత్ రెడ్డి
ప్రజా సంక్షేమం న్యూస్-హైదరాబాద్:
పేద ఆర్యవైశ్య కుటుంబాల సంక్షేమానికి ప్రజా ప్రభుత్వం అండగా ఉంటుందని ముఖ్యమంత్రి శ్రీ ఎ. రేవంత్ రెడ్డి భరోసా ఇచ్చారు.సౌమ్యులు,మానవతావాదులుగా ఆర్యవైశ్యులు సమాజంలో పేదల విశ్వాసానికి బ్రాండ్ అంబాసిడర్లుగా గొప్ప పాత్ర పోషిస్తున్నారని ఆయన పేర్కొన్నారు.హైదరాబాద్‌లోని ఉప్పల్ భగాయత్‌లో ఆర్యవైశ్య ఆత్మగౌరవ భవన సముదాయ నిర్మాణానికి ముఖ్యమంత్రి శ్రీ ఎ. రేవంత్ రెడ్డి శంకుస్థాపన చేశారు.ఈ భూమిపూజ కార్యక్రమంలో మంత్రి గడ్డం వివేక్ వెంకటస్వామి, రాజ్యసభ సభ్యులు వేం నరేందర్ రెడ్డి,మాజీ మంత్రి టీజీ వెంకటేష్, పలువురు శాసనసభ్యులు,కార్పొరేషన్ల చైర్మన్లు, ఆర్యవైశ్య సంఘాల ప్రతినిధులు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా నిర్వహించిన సభలో ముఖ్యమంత్రి మాట్లాడుతూ,ఆర్యవైశ్య ఆత్మగౌరవ భవన నిర్మాణానికి రాష్ట్ర ప్రభుత్వం అన్ని విధాలుగా సహాయ సహకారాలు అందిస్తుందని హామీ ఇచ్చారు.ముఖ్యంగా పేద ఆర్యవైశ్య కుటుంబాల పిల్లలకు ఈ ఆత్మగౌరవ భవనం సంపూర్ణంగా ఉపయోగపడేలా చూడాలని సంఘాల ప్రతినిధులకు సూచించారు.సాధారణ ఆర్యవైశ్య కుటుంబంలో జన్మించిన మహాత్మా గాంధీ భారతదేశం నుంచి ప్రపంచస్థాయి నాయకుడిగా ఎదగడం గర్వకారణమని ముఖ్యమంత్రి పేర్కొన్నారు.ప్రపంచంలోని అనేక దేశాల్లో మహాత్మా గాంధీ విగ్రహాలు కనిపిస్తాయని గుర్తుచేశారు.ఆంధ్ర రాష్ట్రం కోసం పొట్టి శ్రీరాములు చేసిన ప్రాణత్యాగాన్ని,ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో ఆర్థిక మంత్రిగా కొణిజేటి రోశయ్య అందించిన విశేష సేవలను ఈ సందర్భంగా ప్రస్తావించారు.గ్రామీణ ప్రాంతాల్లో పేదలకు సరుకులను అరువుగా అందించే విషయంలో మానవతా దృక్పథంతో వ్యవహరించే ఆర్యవైశ్యులు విశ్వాసానికి బ్రాండ్ అంబాసిడర్లుగా నిలిచారని సీఎం అన్నారు.ముందు చూపుతో వ్యవహరించడం,జాగ్రత్తగా ఉండటం ఆర్యవైశ్యుల డీఎన్‌ఏలోనే ఉందని పేర్కొన్నారు.ఆర్యవైశ్యులంతా కలిసికట్టుగా, సమైక్యంగా ఒక్కతాటిపై నడిస్తేనే బలం చేకూరుతుందని ముఖ్యమంత్రి సూచించారు.ఐక్యతతో ముందుకు సాగితే రాజకీయాల్లో తమ వాటాను తామే సాధించుకోగలరని అన్నారు.కార్పొరేషన్లు,మున్సిపాలిటీల్లో ఆర్యవైశ్యులకు ప్రాధాన్యత ఇచ్చామని ఈ సందర్భంగా గుర్తుచేశారు.