మాజీ మంత్రి జగదీశ్‌రెడ్డి ఫామ్‌హౌస్‌పై సమగ్ర విచారణ జరపాలి
54 ఎకరాల ఫామ్‌హౌస్ వద్ద ఉమ్మడి నల్లగొండ జిల్లా నేతల ధర్నా
షాబాద్ (ప్రజాసంక్షేమం న్యూస్):
నల్లగొండ అంటేనే భూమి కోసం,భుక్తి కోసం,విముక్తి కోసం పోరాడిన వీర నేల అని,అలాంటి గడ్డపై పుట్టి తెలంగాణ ఉద్యమాన్ని అడ్డం పెట్టుకుని సంపద పోగేసుకున్న రాజకీయ నేతలకు ప్రజలే తగిన బుద్ధి చెబుతారని దేవరకొండ ఎమ్మెల్యే నేనావత్ బాలునాయక్ హెచ్చరించారు.రంగారెడ్డి జిల్లా షాబాద్ మండలం మద్దూరు గ్రామ పరిధిలోని మాజీ మంత్రి, సూర్యాపేట ఎమ్మెల్యే గుంటకండ్ల జగదీశ్‌రెడ్డికి చెందిన సుమారు 54 ఎకరాల విలాసవంతమైన ఫామ్‌హౌస్ సమీపంలో ఉమ్మడి నల్లగొండ జిల్లా ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ప్రజాప్రతినిధులతో కలిసి ఆయన భారీ ధర్నా నిర్వహించారు.
పోరాటాల చరిత్రను మచ్చతెచ్చారు:
ఈ సందర్భంగా ఎమ్మెల్యే బాలునాయక్ మాట్లాడుతూ… తెలంగాణ సాయుధ పోరాటం,భూదానోద్యమ చరిత్ర కలిగిన నల్లగొండ జిల్లాలో ఆరుట్ల కమలాదేవి,రామచంద్రారెడ్డి,మల్లు స్వరాజ్యం,రావి నారాయణరెడ్డి,పాల్వాయి గోవర్ధన్‌రెడ్డి, జానారెడ్డి,ఆర్.దామోదర్‌రెడ్డి,ఉత్తమ్‌కుమార్‌రెడ్డి,కోమటిరెడ్డి వెంకటరెడ్డి వంటి మహోన్నత నాయకులు ప్రజా ఉద్యమాలతో జిల్లాకు ఎనలేని పేరు తెచ్చారని గుర్తుచేశారు.ఆ నేతలంతా ప్రజాసేవలోనే తరించారు తప్ప ప్రభుత్వ ఆస్తులపై కానీ, పేదల భూములపై కానీ కన్నేయలేదని తెలిపారు.
అయితే పదేళ్ల బీఆర్‌ఎస్ పాలనలో తెలంగాణ ఉద్యమం పేరుతో అధికారాన్ని అనుభవించిన కొందరు నాయకులు మాత్రం వందల ఎకరాల భూములు,విలాసవంతమైన ఫామ్‌హౌస్‌లు ఎలా కూడబెట్టారో ప్రజలకు సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు.
అక్రమ భూములపై సమగ్ర విచారణ జరగాలి:
ఒకవైపు పేదప్రజలకు గజం భూమి కూడా దొరకని పరిస్థితి ఉంటే, మరోవైపు అధికారంలో ఉన్న సమయంలో జగదీశ్‌రెడ్డికి ఇన్ని వందల ఎకరాల భూములు, ఫామ్‌హౌస్‌లు ఎలా వచ్చాయని బాలునాయక్ ప్రశ్నించారు.
“ఇది ఎలాంటి రాజకీయ కక్ష సాధింపు చర్య కాదు… ప్రజల నుంచి వస్తున్న ప్రశ్నలకు సమాధానం చెప్పాల్సిన బాధ్యత ప్రజాప్రతినిధులపై ఉంది.”
“ఫామ్‌హౌస్‌కు సంబంధించిన భూముల్లో ఇనాం,అసైన్డ్ లేదా ఇతర వివాదాస్పద భూములు ఉన్నాయా అనే కోణంలో ప్రభుత్వం సమగ్ర విచారణ జరిపించాలి.”
“ప్రభుత్వ భూములు ఉన్నట్లు తేలితే వెంటనే వాటిని స్వాధీనం చేసుకుని చట్ట ప్రకారం చర్యలు తీసుకోవాలి.”
పదేళ్ల పాలనలో ప్రజలకు ఇచ్చిన హామీలను పక్కనపెట్టి వ్యక్తిగత ఆస్తులు కూడబెట్టుకున్న ప్రతి ఒక్కరూ లెక్కలు చెప్పాల్సిందేనని, నిజానిజాలు తేలే వరకు పోరాటం ఆపేది లేదని ఆయన స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో ఉమ్మడి నల్లగొండ జిల్లాకు చెందిన పలువురు ప్రజాప్రతినిధులు, కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.