PRAJA SANKSHEMAM NEWS
Newspaper Banner
Date of Publish : 28 September 2026, 8:34 pm Posted by : Praja Sankshemam News

బీసీ సంక్షేమానికి ప్రజా ప్రభుత్వం అత్యున్నత ప్రాధాన్యత!

1.30 లక్షల మంది విద్యార్థులకు ₹450 కోట్ల స్కాలర్‌షిప్‌లు
రాజీవ్ యువ వికాసం నవంబర్ నుంచి.. కాటమయ్య రక్షణ కవచాల పంపిణీ వేగవంతం
హైదరాబాద్, సెప్టెంబర్ 28 (ప్రజాసంక్షేమం న్యూస్):

రాష్ట్రంలో బీసీ సంక్షేమ పథకాల అమలుకు ప్రజా ప్రభుత్వం అత్యున్నత ప్రాధాన్యతనిస్తోందని ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి తెలిపారు. ప్రజాభవన్‌లో బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్తో కలిసి బీసీ సంక్షేమ పథకాల అమలుపై సమీక్ష నిర్వహించారు.పారదర్శక పాలనలో భాగంగా డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్‌ఫర్ (డీబీటీ) ద్వారా ఇప్పటివరకు బీసీ, ఈబీసీ వర్గాలకు చెందిన 1.30 లక్షల మంది విద్యార్థుల ఖాతాల్లో రూ.450 కోట్ల స్కాలర్‌షిప్ నిధులు నేరుగా జమ చేసినట్లు సీఎం తెలిపారు. హాస్టల్ విద్యార్థులకు అందించే డైట్, కాస్మోటిక్ ఛార్జీలను కూడా ప్రతి నెలా నేరుగా వారి ఖాతాల్లోనే జమ చేయాలని అధికారులను ఆదేశించారు.
ఓవర్సీస్ స్కాలర్‌షిప్‌కు గడువు పొడిగింపు:ఓవర్సీస్ స్కాలర్‌షిప్ కింద 180 మంది విద్యార్థులకు రూ.18.40 కోట్లు విడుదల చేసినట్లు సీఎం వెల్లడించారు. అర్హులైన విద్యార్థులందరికీ అవకాశం కల్పించేందుకు దరఖాస్తుల గడువును అక్టోబర్ 15 వరకు పొడిగించినట్లు తెలిపారు.
గీత కార్మికులకు ‘కాటమయ్య రక్షణ కవచాలు’:గీత కార్మికుల రక్షణ కోసం రూ.60 కోట్ల వ్యయంతో 50 వేల ‘కాటమయ్య రక్షణ కవచాలు’ అందించే ప్రక్రియను వేగవంతం చేసినట్లు సీఎం పేర్కొన్నారు. ఇప్పటికే 40 వేల కిట్లు పంపిణీ చేశామని, శిక్షణ పూర్తయిన వెంటనే మిగిలిన 10 వేల మందికి కూడా కిట్లు అందజేస్తామని తెలిపారు.
నవంబర్ నుంచి ‘రాజీవ్ యువ వికాసం’:బీసీ నిరుద్యోగ యువతకు ఆర్థికంగా అండగా నిలిచే ‘రాజీవ్ యువ వికాసం’ పథకాన్ని నవంబర్ నుంచి ప్రారంభించనున్నట్లు సీఎం ప్రకటించారు. దరఖాస్తులను జిల్లా కలెక్టర్ల ఆధ్వర్యంలో పారదర్శకంగా పరిశీలించాలని అధికారులను ఆదేశించారు.అలాగే ఎంజేపీ గురుకులాల పెండింగ్ బిల్లులను త్వరలోనే క్లియర్ చేయడంతో పాటు, బీసీ ఆత్మగౌరవ భవనాల నిర్మాణానికి అవసరమైన నిధులు మంజూరు చేస్తామని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు.