PRAJA SANKSHEMAM NEWS
Newspaper Banner
Date of Publish : 22 September 2026, 5:12 pm Posted by : Praja Sankshemam News

భక్తిశ్రద్ధలతో.. బాధ్యతతో వినాయక నిమజ్జనం…!

భక్తిశ్రద్ధలతో.. బాధ్యతతో వినాయక నిమజ్జనం
ప్రజల భద్రత,పర్యావరణ పరిరక్షణకు ప్రాధాన్యత ఇవ్వాలి
మట్టి గణపతులు, కృత్రిమ నిమజ్జన కొలనులను వినియోగించాలి

హైదరాబాద్‌, సెప్టెంబర్‌ 22: గణేష్‌ నవరాత్రి ఉత్సవాల ముగింపు సందర్భంగా వినాయక నిమజ్జన కార్యక్రమాలను భక్తిశ్రద్ధలతో పాటు సురక్షితంగా, క్రమశిక్షణతో, పర్యావరణహితంగా నిర్వహించుకోవాలని ప్రజా సంక్షేమం న్యూస్‌ విజ్ఞప్తి చేసింది.CSF – Community Safety Forum ఆధ్వర్యంలో చేపడుతున్న ప్రజా అవగాహన కార్యక్రమంలో భాగంగా నిమజ్జనానికి సంబంధించి పలు సూచనలు చేశారు. పర్యావరణ పరిరక్షణకు మట్టి గణపతులకు ప్రాధాన్యత ఇవ్వాలని, ప్రభుత్వం ఏర్పాటు చేసిన కృత్రిమ నిమజ్జన కొలనుల్లోనే విగ్రహాలను నిమజ్జనం చేయాలని సూచించారు.నిమజ్జన కార్యక్రమాల్లో భద్రతకు అత్యంత ప్రాధాన్యత ఇవ్వాలని, అధికారులు సూచించిన ప్రదేశాల్లోనే నిమజ్జనం చేయాలని కోరారు. పిల్లలు, వృద్ధుల విషయంలో కుటుంబ సభ్యులు ప్రత్యేక శ్రద్ధ వహించాలని సూచించారు.
శోభాయాత్రల సమయంలో పోలీసులు, ట్రాఫిక్‌ సిబ్బంది, స్థానిక అధికారులు ఇచ్చే సూచనలు, నిబంధనలను తప్పనిసరిగా పాటించాలని తెలిపారు. అదే విధంగా పూజా సామగ్రి, ప్లాస్టిక్‌, ఇతర వ్యర్థాలను నీటిలో వేయకుండా నిర్దేశిత ప్రదేశాల్లోనే వేయాలని, పరిసరాలను పరిశుభ్రంగా ఉంచాలని కోరారు.అలాగే ఇతరులకు ఇబ్బంది కలగకుండా శబ్ద కాలుష్యాన్ని నియంత్రిస్తూ, ప్రశాంత వాతావరణంలో ఉత్సవాలను నిర్వహించాలని సూచించారు.
“భక్తి మన సంస్కృతి.. భద్రత మన బాధ్యత”
ప్రజలందరూ బాధ్యతాయుతంగా వ్యవహరిస్తూ భక్తి, భద్రత, పర్యావరణ పరిరక్షణకు ప్రాధాన్యత ఇవ్వాలని ప్రజాసంక్షేమం న్యూస్‌ కోరింది.