PRAJA SANKSHEMAM NEWS
Newspaper Banner
Date of Publish : 23 September 2026, 4:23 pm Posted by : Praja Sankshemam News

భారీ వర్షాలపై అప్రమత్తం.. రెడ్ అలర్ట్ జిల్లాలపై ప్రత్యేక దృష్టి:

అల్పపీడనం ప్రభావంతో మరో రెండు రోజులు భారీ నుంచి అత్యంత భారీ వర్షాలు..
8 జిల్లాల కలెక్టర్లు 24 గంటలూ అప్రమత్తంగా ఉండాలి
లోతట్టు ప్రాంతాల ప్రజలను అవసరమైతే సురక్షిత ప్రాంతాలకు తరలించాలి: మంత్రి పొంగులేటి
ప్రజా సంక్షేమం న్యూస్ – తెలంగాణ: అల్పపీడనం ప్రభావంతో రాష్ట్రంలో మరో రెండు రోజుల పాటు భారీ నుంచి అత్యంత భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందన్న వాతావరణ శాఖ హెచ్చరికల నేపథ్యంలో రెడ్ అలర్ట్ జారీ చేసిన జిల్లాల కలెక్టర్లు మరింత అప్రమత్తంగా ఉండాలని రాష్ట్ర రెవెన్యూ, విపత్తు నిర్వహణ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఆదేశించారు.
రెడ్ అలర్ట్ జిల్లాలపై ప్రత్యేక దృష్టి: పెద్దపల్లి, జయశంకర్ భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, మహబూబాబాద్, వరంగల్, హన్మకొండ జిల్లాల్లో ముందస్తు సహాయక చర్యలు చేపట్టాలని సూచించారు. లోతట్టు ప్రాంతాలు, వాగులు, చెరువులు, వరద ప్రభావిత ప్రాంతాల్లో పరిస్థితిని ఎప్పటికప్పుడు పర్యవేక్షించాలని అధికారులను ఆదేశించారు.
24 గంటలూ కంట్రోల్ రూమ్‌లు: ప్రతి జిల్లాలో 24 గంటలూ అందుబాటులో ఉండే కంట్రోల్ రూమ్, టోల్‌ఫ్రీ నంబర్ ఏర్పాటు చేసి ప్రజలకు తక్షణ సహాయం అందించాలని కలెక్టర్లను ఆదేశించారు. అత్యవసర పరిస్థితుల్లో వచ్చే ఫిర్యాదులపై వెంటనే స్పందించేలా జిల్లా యంత్రాంగం సమన్వయంతో పనిచేయాలని సూచించారు.
ప్రజలు అప్రమత్తంగా ఉండాలి: అవసరమైతే వరద ప్రభావిత ప్రాంతాల ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించేందుకు అధికారులు సిద్ధంగా ఉండాలని మంత్రి సూచించారు. ప్రజలు అత్యవసరమైతే తప్ప బయటకు రావద్దని, వాగులు, చెరువులు, వరద ప్రవాహ ప్రాంతాల వైపు వెళ్లవద్దని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి విజ్ఞప్తి చేశారు.