PRAJA SANKSHEMAM NEWS
Newspaper Banner
Date of Publish : 26 September 2026, 3:49 pm Posted by : Praja Sankshemam News

భూమి కోసం.. సమానత్వం కోసం పోరాడిన వీరవనిత చాకలి ఐలమ్మ

ప్రజాసంక్షేమం న్యూస్ ,సెప్టెంబర్ 26:
భూమి కోసం, సమానత్వం కోసం పోరాటం చేసిన వీరవనిత చాకలి ఐలమ్మ అని నల్గొండ జిల్లా కలెక్టర్ బి. చంద్రశేఖర్ అన్నారు.చాకలి ఐలమ్మ 131వ జయంతి సందర్భంగా శనివారం నల్గొండ జిల్లా కేంద్రంలోని నాగార్జునసాగర్ రోడ్డులో ఉన్న చాకలి ఐలమ్మ విగ్రహానికి కలెక్టర్ పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు.
దేశ్‌ముఖ్‌లకు ఎదురొడ్డి.. పేదల భూమి కోసం పోరాటం:ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ.. 1895లో వరంగల్ జిల్లా కిష్టాపురంలో జన్మించిన చాకలి ఐలమ్మ పేదల భూమి కోసం ఎనలేని పోరాటం చేశారని కలెక్టర్ తెలిపారు. అప్పటి దేశ్‌ముఖ్‌లకు ఎదురొడ్డి నిలిచిన ధైర్యవంతురాలిగా ఆమె చరిత్రలో నిలిచిపోయారని పేర్కొన్నారు. దొరల గడీల ఆధిపత్యాన్ని సవాల్ చేస్తూ సమానత్వం కోసం ఆమె చేసిన పోరాటం స్ఫూర్తిదాయకమన్నారు.
భావితరాలకు ఐలమ్మ పోరాటం ఆదర్శం:స్వాతంత్ర్యానంతరం కమ్యూనిస్టు పార్టీ ఆఫ్ ఇండియాలో చేరి పేద ప్రజల సంక్షేమం కోసం ఐలమ్మ కృషి చేశారని కలెక్టర్ తెలిపారు. ఆమె స్ఫూర్తి, పోరాట పటిమ, సామాజిక సమానత్వం కోసం చేసిన కృషి భావితరాలకు ఆదర్శనీయమన్నారు.ఈ కార్యక్రమంలో విశ్రాంత ఐఏఎస్ చోల్లేటి ప్రభాకర్, జిల్లా బీసీ సంక్షేమ అధికారి సంజీవ, ఐలమ్మ ఉత్సవాల రాష్ట్ర ఉపాధ్యక్షులు కొండూరు సత్యనారాయణ, భవన నిర్మాణ కమిటీ సభ్యులు రాములు, చెన్నయ్య, సత్తయ్య, సునీత, జిల్లా ఎన్జీవో ప్రతినిధులు మురళి, శంకర్ రెడ్డి తదితరులు పాల్గొని చాకలి ఐలమ్మ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు.అనంతరం కలెక్టర్ కార్యాలయంలోని సమావేశ మందిరంలో ఏర్పాటు చేసిన చాకలి ఐలమ్మ చిత్రపటానికి కలెక్టర్ పూలమాల వేసి నివాళులర్పించారు. రెవెన్యూ అదనపు కలెక్టర్ జె. శ్రీనివాస్, శిక్షణ సహాయ కలెక్టర్ శ్రీకాంత్ రెడ్డి, కలెక్టర్ కార్యాలయ ఏవో మోతిలాల్, కార్యాలయ సిబ్బంది తదితరులు పాల్గొని నివాళులర్పించారు.