PRAJA SANKSHEMAM NEWS
Newspaper Banner
Date of Publish : 08 September 2026, 10:42 pm Posted by : Praja Sankshemam News

రోడ్డు గుంతలను వెంటనే పూడ్చాలని ఖాళీ కుర్చీకి వినతిపత్రం అందజేత: సీపీఎం సర్పంచుల వినూత్న నిరసన

(ప్రజా సంక్షేమం న్యూస్-రామన్నపేట):
దుబ్బాక – మునిపంపుల గ్రామాల మధ్య రోడ్డు అస్తవ్యస్తంగా తయారై,ప్రమాదకరంగా మారిన గుంతలను వెంటనే పూడ్చి ప్రజల రవాణా సమస్యలను పరిష్కరించాలని కోరుతూ సీపీఎం సర్పంచులు వినూత్న రీతిలో నిరసన వ్యక్తం చేశారు.సమస్యపై పలుమార్లు విన్నవించేందుకు వెళ్లినా రోడ్లు & భవనాల (R&B) శాఖ అధికారులు అందుబాటులో ఉండకపోవడం, నిత్యం ప్రమాదాలు జరుగుతున్నా పట్టించుకోకపోవడంపై ప్రజాప్రతినిధులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.గురువారం R&B కార్యాలయానికి వచ్చిన మునిపంపుల సర్పంచ్ బొడ్డుపల్లి వెంకటేశం,దుబ్బాక సర్పంచ్ గట్టు నర్సింహ అధికారులు ఎవరూ లేకపోవడంతో R&B DE ఖాళీ కుర్చీకే వినతిపత్రం అందజేసి తమ నిరసనను తెలిపారు.ఈ సందర్భంగా సర్పంచులు మాట్లాడుతూ నిత్యం వందలాది వాహనాలు,ప్రజలు ప్రయాణించే ఈ మార్గంలో పెద్ద పెద్ద గుంతలు పడి ప్రయాణం ప్రాణసంకటంగా మారిందన్నారు.బాధ్యతారాహిత్యంగా వ్యవహరిస్తున్న R&B అధికారులపై ఉన్నతాధికారులు వెంటనే చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. రాబోయే రెండు రోజుల్లో రోడ్డు మరమ్మతు పనులు ప్రారంభించకపోతే, గ్రామాల ప్రజలను సమీకరించి నిరవధిక నిరాహార దీక్షలతో ఆందోళనలను ఉధృతం చేస్తామని హెచ్చరించారు.ఈ కార్యక్రమంలో సీపీఎం మండల కమిటీ సభ్యుడు మేడి గణేష్,DYFI జిల్లా నాయకుడు గుండాల నరేష్,SFI మండల కార్యదర్శి పుట్టల ఉదయ్ కుమార్,నాయకులు వేముల మల్లేశం,కంబాలపల్లి శ్రీశైలం తదితరులు పాల్గొన్నారు.