PRAJA SANKSHEMAM NEWS
Newspaper Banner
Date of Publish : 19 September 2026, 10:11 pm Posted by : Praja Sankshemam News

విద్యార్థుల యూనిఫామ్‌లకు ఆకర్షణీయ రంగులు,వైవిధ్యమైన డిజైన్లు: సీఎం రేవంత్‌రెడ్డి

వచ్చే విద్యా సంవత్సరం ప్రారంభం రోజునే యూనిఫామ్‌లు, ఇతర సామగ్రి అందేలా ప్రణాళిక:
విద్యార్థుల సంఖ్య 10 శాతం పెరిగే అవకాశం దృష్టిలో ఉంచుకుని ఏర్పాట్లు చేయాలని సీఎం రేవంత్‌రెడ్డి ఆదేశం
ప్రజాసంక్షేమం న్యూస్-హైదరాబాద్:

ప్రభుత్వ పాఠశాలలు,వసతి గృహాలు,రెసిడెన్షియల్‌ పాఠశాలల విద్యార్థులకు అందించే యూనిఫామ్‌లలో మరింత ఆకర్షణీయమైన రంగులు, విభిన్న డిజైన్లను పరిశీలించాలని ముఖ్యమంత్రి ఎ.రేవంత్‌రెడ్డి అధికారులను ఆదేశించారు.విద్యార్థులకు యూనిఫామ్‌లు,ఇతర సామగ్రి పంపిణీపై ఆయన సమీక్ష నిర్వహించారు.ఈ ఏడాది ప్రభుత్వ పాఠశాలలు,ప్రభుత్వ వసతి గృహాలు,రెసిడెన్షియల్‌ పాఠశాలల విద్యార్థులకు ఒక జత యూనిఫామ్‌ల పంపిణీ పూర్తయిందని అధికారులు తెలిపారు.రెండో జతను ఈ నెలాఖరులోగా అందజేయనున్నట్లు వెల్లడించారు. కేజీబీవీ,మోడల్‌ స్కూల్‌ విద్యార్థులకు ఇప్పటికే రెండు జతల యూనిఫామ్‌లు అందించినట్లు వివరించారు.విద్యార్థులందరికీ నోట్‌బుక్‌ల పంపిణీ పూర్తయిందని అధికారులు తెలిపారు.ప్రభుత్వ వసతి గృహాలు, రెసిడెన్షియల్‌ పాఠశాలలు,కేజీబీవీలు,మోడల్‌ స్కూళ్ల విద్యార్థులకు ప్లేట్లు,గ్లాసులు,గిన్నెలు,స్పూన్లు,కప్పులు,కార్పెట్లు,బెడ్‌షీట్లు,తువ్వాళ్ల పంపిణీ కూడా పూర్తయిందని చెప్పారు.
వచ్చే విద్యా సంవత్సరం పాఠశాలలు ప్రారంభమయ్యే రోజునే విద్యార్థులకు యూనిఫామ్‌లు, ఇతర సామగ్రి అందేలా ఇప్పటి నుంచే కార్యాచరణ ప్రణాళిక రూపొందించాలని సీఎం సూచించారు.విద్యార్థుల చేరికలు సుమారు 10 శాతం పెరిగే అవకాశం ఉందని,అందుకు అనుగుణంగా ముందస్తు ఏర్పాట్లు చేయాలని ఆదేశించారు.ఈ ఏడాది అందించిన యూనిఫామ్‌లు,ఇతర సామగ్రి నాణ్యతపై తల్లిదండ్రులు సంతృప్తి వ్యక్తం చేసినట్లు అధికారులు తెలిపారు.సమీక్షలో ప్రభుత్వ సలహాదారు పి.సుదర్శన్‌రెడ్డి,ఎంపీ వేమ్‌ నరేందర్‌రెడ్డితో పాటు పలువురు ఉన్నతాధికారులు పాల్గొన్నారు.