PRAJA SANKSHEMAM NEWS
Newspaper Banner
Date of Publish : 09 September 2026, 9:50 pm Posted by : Praja Sankshemam News

వి.ఆర్‌.విద్యార్థి వంటి కవులు,రచయితలు కాళోజీ వారసత్వాన్ని పుణికిపుచ్చుకోవాలి:మంత్రి జూపల్లి

రవీంద్రభారతిలో ఘనంగా కాళోజీ జయంతి ఉత్సవాలు:
వి.ఆర్‌.విద్యార్థికి (వేలూరి రాములు)కాళోజీ సాహిత్య పురస్కార ప్రదానం:
ప్రజాసంక్షేమం న్యూస్:

కాళోజీ నారాయణరావు ప్రజల గొంతుకగా, తెలంగాణ ఆత్మగౌరవానికి ప్రతీకగా నిలిచారని పర్యాటక, సాంస్కృతిక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు అన్నారు. కాళోజీ జయంతి సందర్భంగా బుధవారం రవీంద్రభారతిలో నిర్వహించిన ఉత్సవాల్లో ఆయన పాల్గొన్నారు.ఈ సందర్భంగా సైనిక కవిగా, ఖండాంతర కవిగా ప్రసిద్ధి చెందిన వి.ఆర్‌. విద్యార్థికి (వేలూరి రాములు) 2026 కాళోజీ నారాయణరావు సాహిత్య పురస్కారం ప్రదానం చేశారు. వి.ఆర్‌. విద్యార్థిని మంత్రి జూపల్లి కృష్ణారావు హృదయపూర్వకంగా అభినందించి, శుభాకాంక్షలు తెలిపారు.కాళోజీ నారాయణరావు సాహిత్య వారసత్వాన్ని వి.ఆర్‌. విద్యార్థి వంటి వారు పుణికిపుచ్చుకుని ముందుకు తీసుకెళ్లాలని మంత్రి జూపల్లి కృష్ణారావు అన్నారు. తెలంగాణ ప్రజల జీవితం, బాధ, ఆశ, ఆకాంక్ష, పోరాటం, ఆత్మగౌరవం కాళోజీ రచనల్లో స్పష్టంగా ప్రతిబింబించాయని పేర్కొన్నారు. కాళోజీ రచించిన ‘నా గొడవ’ కేవలం ఆయన వ్యక్తిగత గొడవ కాదని మంత్రి అన్నారు. సమాజంలోని అణగారిన, బాధిత, సామాన్య ప్రజల గొడవను తన గొడవగా కాళోజీ స్వీకరించారని చెప్పారు. ప్రజల సమస్యలను తన కలంతో వినిపించిన ప్రజాకవిగా కాళోజీ చిరస్థాయిగా నిలిచిపోయారని కొనియాడారు.
తెలంగాణ యాస.. కాళోజీ శ్వాస:
తెలంగాణ భాష, యాసపై కాళోజీకి ఉన్న ప్రగాఢ విశ్వాసం ఆయన రచనల్లో స్పష్టంగా కనిపిస్తుందని మంత్రి అన్నారు. తెలంగాణ రచయితల వేదిక ప్రథమ మహాసభలో తెలంగాణ బతుకు, భాషపై కాళోజీ చేసిన అధ్యక్షోపన్యాసం తెలంగాణ ఆధునిక సాహిత్య చరిత్రలో సువర్ణ అధ్యాయమని పేర్కొన్నారు.ప్రజలు మాట్లాడే భాషలోనే రచనలు చేయాలని కాళోజీ బలంగా విశ్వసించారని చెప్పారు. ‘అవతలి వారికి అర్థమవుతుందా?’ అని ముందే ఆలోచించడం ద్వారా మనల్ని మనమే తక్కువ చేసుకోవద్దని, ఈ బానిస భావన పోవాలని కాళోజీ చెప్పిన మాటలు తెలంగాణ భాషపై ఆయనకున్న ఆత్మవిశ్వాసానికి నిదర్శనమన్నారు.
పలుకుబడుల భాషకు పెద్దపీట:
కాళోజీ దృష్టిలో భాషకు రెండు తీర్లు ఉన్నాయని మంత్రి తెలిపారు.ఒకటి బడిపలుకుల భాష, మరొకటి పలుకుబడుల భాష అని వివరించారు. పుస్తకాల్లో, పండితుల రచనల్లో కనిపించే భాష కంటే ప్రజల నాలుకలపై సహజంగా నడయాడే పలుకుబడుల భాషలోనే నిజమైన జీవన వాస్తవికత ఉంటుందని కాళోజీ విశ్వసించారని చెప్పారు.తన పోరాటాలన్నింటికీ కాళోజీ కవిత్వాన్ని మాధ్యమంగా ఎంచుకున్నారని, చెప్పదలుచుకున్న విషయాన్ని సూటిగా,సరళంగా ప్రజల భాషలోనే చెప్పేవారని మంత్రి పేర్కొన్నారు. అందుకే ఆయన రచనలు సామాన్య ప్రజలకు మరింత చేరువయ్యాయని అన్నారు.తెలంగాణ యాసను, భాషను, ప్రజల పలుకుబడిని కాళోజీ సాహిత్యంలో గౌరవప్రదంగా నిలబెట్టారని జూపల్లి అన్నారు. ప్రజలు మాట్లాడే భాషే ప్రజల హృదయ భాష అని తన రచనల ద్వారా నిరూపించారని పేర్కొన్నారు. తెలంగాణ మాండలికాన్ని తక్కువగా చూసే ధోరణులకు తన కలంతో సమాధానం చెప్పి, తెలంగాణ యాస పట్ల తనకున్న ప్రగాఢ విశ్వాసాన్ని చాటుకున్నారని వెల్లడించారు. భాష కేవలం సంభాషణకు ఉపయోగించే సాధనం మాత్రమే కాదని, ఒక జాతి చరిత్ర, సంస్కృతి, జీవన విధానం, ఆత్మగౌరవానికి ప్రతిబింబమని మంత్రి పేర్కొన్నారు. కాళోజీ అందించిన స్ఫూర్తిని కొనసాగించాలనే ఉద్దేశంతోనే ఆయన జయంతిని తెలంగాణ భాషా దినోత్సవంగా నిర్వహిస్తున్నామని తెలిపారు.ఈ కార్యక్రమంలో తెలంగాణ సాంస్కృతిక సారథి చైర్‌పర్సన్‌ వెన్నెల గద్దర్‌, భాషా సాంస్కృతిక శాఖ డైరెక్టర్‌ ఏనుగు నరసింహారెడ్డి, నిథమ్‌ డైరెక్టర్‌ వెంకటరమణ తదితరులు పాల్గొన్నారు.