వర్షంలోనూ పనులను పరిశీలించిన మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి
రూ.300 కోట్లకు పైగా నిధులతో కొనసాగుతున్న అభివృద్ధి పనులు
పనుల్లో జాప్యం వద్దని అధికారులకు, కాంట్రాక్టర్లకు ఆదేశాలు
ప్రజాసంక్షేమం న్యూస్-భద్రాచలం:వచ్చే ఏడాది శ్రీరామనవమి నాటికి భద్రాచలంలోని శ్రీ సీతారామచంద్రస్వామి దేవస్థాన ప్రాకారాలు, మాడ వీధుల పునర్నిర్మాణ పనులన్నీ పూర్తి చేయాలని రాష్ట్ర రెవెన్యూ,గృహ నిర్మాణం,సమాచార శాఖల మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి అధికారులను, సంబంధిత కాంట్రాక్టర్లను ఆదేశించారు.మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఎంపీ బలరాం నాయక్,ఎమ్మెల్యేలు డాక్టర్ తెల్లం వెంకట్రావు, జారే ఆదినారాయణ,కలెక్టర్ అంకిత్, ఎస్పీ రోహిత్ రాజ్,డీసీసీ అధ్యక్షురాలు తోట దేవి ప్రసన్నతో కలిసి భద్రాచలం శ్రీ సీతారామచంద్రస్వామి దేవస్థానంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయ అర్చకులు వేద ఆశీర్వచనాలతో తీర్థప్రసాదాలు అందజేశారు.
వర్షంలోనూ పనుల పరిశీలన:
భద్రాచలం పరిసర ప్రాంతాల్లో వర్షం కురుస్తున్నప్పటికీ మంత్రి పొంగులేటి క్షేత్రస్థాయిలో అభివృద్ధి పనులను పరిశీలించారు. దమ్మక్క అన్నదాన సత్రం నుంచి మెట్లదారి వరకు వర్షంలోనే నడుచుకుంటూ ఆలయ పరిసరాల్లో జరుగుతున్న పనులను స్వయంగా పరిశీలించారు.పనుల పురోగతిపై అధికారులను అడిగి తెలుసుకున్నారు.అభివృద్ధి పనుల్లో ఎట్టి పరిస్థితుల్లోనూ జాప్యం జరగకూడదని మంత్రి స్పష్టం చేశారు. నిర్ణీత గడువులో పనులు పూర్తయ్యేలా అధికారులు నిరంతరం పర్యవేక్షించాలని ఆదేశించారు.
అధికారులతో సమీక్ష:
అనంతరం భద్రాచలం సబ్ కలెక్టర్ కార్యాలయంలో వివిధ శాఖల ఉన్నతాధికారులతో మంత్రి సమీక్ష సమావేశం నిర్వహించారు.ఆలయ పునరాభివృద్ధి పనుల పురోగతి, భక్తులకు కల్పించాల్సిన సౌకర్యాలు, నిర్మాణ పనుల నాణ్యత,గడువులపై అధికారులతో చర్చించారు.
రూ.300 కోట్లకు పైగా నిధులతో అభివృద్ధి:
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలో భద్రాచలం అభివృద్ధికి రూ.300 కోట్లకు పైగా నిధులతో వివిధ పనులు చేపడుతున్నామని మంత్రి తెలిపారు.ఆగమ శాస్త్ర నిబంధనలకు అనుగుణంగా ఆలయ పునర్నిర్మాణ పనులు కొనసాగుతున్నాయని వెల్లడించారు.భక్తులకు పూర్తిస్థాయిలో సౌకర్యాలు అందేలా అభివృద్ధి పనులను సకాలంలో పూర్తి చేయిస్తామని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి తెలిపారు.