PRAJA SANKSHEMAM NEWS
Newspaper Banner
Date of Publish : 07 September 2026, 2:53 pm Posted by : Praja Sankshemam News

సారంపల్లి గారి పేరు చిరస్థాయిగా నిలిచేలా నిర్ణయం తీసుకుంటా:ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి

అఖిల భారత కిసాన్ సభ జాతీయ ఉపాధ్యక్షుడు కామ్రేడ్ సారంపల్లి మల్లారెడ్డి గారి సంస్మరణ సభలో పాల్గొన్నా ముఖ్యమంత్రి:
ఎంతో మంది హోదా గుర్తింపు రావాలని కోరుకుంటారు కానీ సారంపల్లి మల్లారెడ్డి గారి శ్రమ రైతులు, రైతు కూలీలకు ఉపయోగపడాలని కాంక్షించి జీవితాన్ని అంకితం చేసిన నాయకుడు..
ప్రజాసంక్షేమం న్యూస్:

రైతాంగం కోసం తన జీవితాన్ని అంకితం చేసిన కామ్రేడ్ సారంపల్లి మల్లారెడ్డి గారి సేవలు చిరస్మరణీయం మని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కొనియాడారు మల్లారెడ్డి సంస్మరణ సభలో అయన ముఖ్య అతిధిలాగా హాజరై మల్లారెడ్డి గారి సేవలను గుర్తుకు చేస్తూ .. కౌలు రైతుల సమస్యలు, పంటలకు గిట్టుబాటు ధర కోసం ఆయన చేసిన పోరాటం చిరస్మరణీయం.ఆయన ఆశయాలకు అనుగుణంగా రైతుల సమస్యల పరిష్కారం కోసం మా ప్రభుత్వం పనిచేస్తుంది.సారంపల్లి గారి పేరు చిరస్థాయిగా నిలిచేలా కేబినెట్ సహచరులతో చర్చించి నిర్ణయం తీసుకుంటాం.ఆరు దశాబ్దాల పాటు మారుమూల గ్రామీణ ప్రాంతం నుంచి జాతీయ స్థాయి వరకు రైతులు, రైతు కూలీలు, కౌలు రైతుల సమస్యల పరిష్కారం కోసం తన జీవితాన్ని సర్వం ధారపోసిన నాయకుడు సారంపల్లి మల్లారెడ్డి గారని ముఖ్యమంత్రి శ్రీ ఎ. రేవంత్ రెడ్డి గారు కొనియాడారు.రవీంద్రభారతిలో జరిగిన అఖిల భారత కిసాన్ సభ జాతీయ ఉపాధ్యక్షుడు కామ్రేడ్ సారంపల్లి మల్లారెడ్డి గారి సంస్మరణ సభలో ముఖ్యమంత్రి గారు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మల్లారెడ్డి గారి చిత్రపటానికి పూలమాల సమర్పించి నివాళులర్పించారు.
భూమిలోని సారం నుంచి ప్రారంభించి దానికి అవసరమైన నీరు, విత్తనం, పెట్టుబడి, పంట, గిట్టుబాటు ధర, మార్కెటింగ్ వరకు రైతుల సమస్యలను లోతుగా విశ్లేషించి సంపూర్ణ అవగాహనతో పోరాటం చేసిన మల్లారెడ్డితో ఎవరూ పోటీ పడలేరని అన్నారు. వ్యవసాయ రంగంలోని సమస్యలపై నిశితంగా అవగాహన కలిగిన వాకింగ్ ఎన్‌సైక్లోపీడియాగా అభివర్ణిస్తూ, అలాంటి రైతు నాయకుడిని కోల్పోవడం రైతాంగానికి తీరని లోటు అని ఈ సందర్భంగా ముఖ్యమంత్రి గారు పేర్కొన్నారు.సమాజంలో ఎంతో మంది హోదా గుర్తింపు రావాలని కోరుకుంటారని, కానీ సారంపల్లి మల్లారెడ్డి గారి శ్రమ రైతులు, రైతు కూలీలకు ఉపయోగపడాలని కాంక్షించి జీవితాన్ని అంకితం చేసిన నాయకుడని కొనియాడారు.సమస్యల పట్ల అవగాహన ఉంటే పరిష్కరించడానికి అవకాశం ఉంటుందని, రైతుల సమస్యల పట్ల సారంపల్లి గారు రాసిన పుస్తకాలు, లేవనెత్తిన సమస్యలను పరిష్కరించాలన్న ఆలోచనతో ప్రజాప్రభుత్వం ముందుకు వెళుతోందని చెప్పారు.
సమావేశంలో నేతలు లేవనెత్తిన అంశాలను ప్రస్తావిస్తూ, కమ్యూనిస్టు యోధుడు సురవరం ప్రతాపరెడ్డి గారి పేరును తెలుగు విశ్వవిద్యాలయానికి పెట్టినట్టుగానే, రైతు నాయకుడు సారంపల్లి మల్లారెడ్డి గారి సేవలు చిరస్థాయిలో గుర్తిండిపోయే విధంగా మంత్రివర్గంలో చర్చించి మంచి కార్యక్రమం తీసుకుంటామని స్పష్టం చేశారు.ఈ కార్యక్రమంలో మంత్రి మహమ్మద్ అజారుద్దీన్ గారు, పలువురు ఎమ్మెల్యేలు, సీపీఎం నాయకులు ప్రకాశ్ కారత్ గారు, జాన్ వెస్లీ గారితో పాటు ప్రముఖ నాయకులు పాల్గొన్నారు.