PRAJA SANKSHEMAM NEWS
Newspaper Banner
Date of Publish : 24 October 2026, 5:47 pm Posted by : Praja Sankshemam News

ఆర్టీఐ అమలులో అధికారుల నిర్లక్ష్యంపై ఫిర్యాదు

విచారణలు వాయిదా..సమాచారం కోసం ఎదురుచూపులు|కలెక్టర్ జోక్యం చేసుకోవాలి:ఖాజా మొయినొద్దీన్
జహీరాబాద్, అక్టోబర్ 24 (ప్రజా సంక్షేమం న్యూస్):
సమాచార హక్కు చట్టం–2005 కింద దరఖాస్తు చేసుకున్న వారికి సకాలంలో సమాచారం అందడం లేదని, అప్పీళ్ల విచారణలు వాయిదా పడటంతో ఇబ్బందులు ఎదురవుతున్నాయని ఆర్టీఐ యాక్టివిస్ట్ సొసైటీ రాష్ట్ర కోశాధికారి ఎండీ ఖాజా మొయినొద్దీన్ ఆరోపించారు. ఈ సమస్యపై జిల్లా కలెక్టర్ జోక్యం చేసుకోవాలని కోరారు.జహీరాబాద్ తహసీల్దార్ కార్యాలయంలో సమాచారం కోసం దరఖాస్తు చేసుకున్నప్పటికీ వివరాలు అందకపోవడంతో ఆర్డీఓకు మొదటి అప్పీల్ చేసినట్లు ఆయన తెలిపారు. విచారణకు అక్టోబర్ 3న హాజరుకావాలని నోటీసు ఇచ్చారని, అనంతరం విచారణ రద్దయిందని ఫోన్ ద్వారా తెలిపి, అక్టోబర్ 24న మరోసారి హాజరుకావాలని నోటీసు పంపారని వివరించారు.అయితే, అక్టోబర్ 24న కార్యాలయానికి వెళ్లినప్పుడు ఆర్డీఓ అందుబాటులో లేరని, ఫోన్ చేసినా స్పందన రాలేదని ఆరోపించారు. సంబంధిత ప్రజా సమాచార అధికారి కూడా విచారణకు హాజరుకాలేదని, దీంతో అక్టోబర్ 31న మరోసారి రావాలని ఏఆర్డీఓ సూచించినట్లు పేర్కొన్నారు.సమాచార హక్కు చట్టం పారదర్శక పాలన, అధికారుల జవాబుదారీతనం కోసం ఉద్దేశించబడిందని ఖాజా మొయినొద్దీన్ అన్నారు. అప్పీళ్లను సకాలంలో పరిష్కరించి, అర్హులైన దరఖాస్తుదారులకు సమాచారం అందేలా జిల్లా కలెక్టర్ చర్యలు తీసుకోవాలని కోరారు.