ఉద్యాన పంటల సాగు విస్తరణకు రాష్ట్ర ప్రభుత్వం ప్రణాళిక
10 లక్షల ఎకరాల్లో ఆయిల్‌పామ్ సాగు లక్ష్యం: మంత్రి తుమ్మల
హైదరాబాద్, అక్టోబర్ 9 (ప్రజా సంక్షేమం న్యూస్):
ఎల్‌నినో నేపథ్యంలో రైతులకు ప్రత్యామ్నాయ పంటల సాగుపై అవగాహన కల్పించడంతో పాటు ఉద్యాన పంటల సాగుకు మరింత ప్రోత్సాహం అందించాలని రాష్ట్ర ప్రభుత్వం యోచిస్తోందని వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తెలిపారు. శుక్రవారం సచివాలయంలో ఉద్యాన శాఖ, ఆయిల్ ఫెడ్ అధికారులతో నిర్వహించిన సమీక్షా సమావేశంలో ఉద్యాన పంటల పథకాల అమలు, ఆయిల్‌పామ్ సాగు పురోగతిపై ఆయన చర్చించారు.
ఉద్యాన పంటల సాగులో గణనీయమైన వృద్ధిరాష్ట్రంలో ఉద్యాన పంటల సాగు విస్తీర్ణం పెరుగుతుండటం సానుకూల పరిణామమని మంత్రి పేర్కొన్నారు. గతంతో పోలిస్తే స్పైసెస్ సాగు 65 శాతం, ఎర్రమిరప సాగు 83 శాతం, ఇతర సుగంధ ద్రవ్యాల సాగు 192 శాతం, పూల సాగు 198 శాతం పెరిగినట్లు అధికారులు వివరించారు. ఈ పురోగతిని కొనసాగిస్తూ మరింత విస్తరించేందుకు అవసరమైన చర్యలు చేపట్టాలని మంత్రి ఆదేశించారు.
కూరగాయల సాగు.. ఎగుమతులపై దృష్టి
తెలంగాణలో కూరగాయల సాగు విస్తీర్ణాన్ని గణనీయంగా పెంచాలని తుమ్మల సూచించారు. రైతులకు నాణ్యమైన విత్తనాలు అందుబాటులో ఉంచడంతో పాటు ఉత్పత్తి పెంపు, మార్కెటింగ్ సదుపాయాల మెరుగుదలకు చర్యలు తీసుకోవాలన్నారు. తెలంగాణలో పండించిన కూరగాయలను ఇతర రాష్ట్రాలకు ఎగుమతి చేసే స్థాయికి ఎదిగేలా సమగ్ర ప్రణాళిక రూపొందించాలని అధికారులకు సూచించారు.
10 లక్షల ఎకరాల్లో ఆయిల్‌పామ్ సాగు లక్ష్యం
రాష్ట్రంలో సుమారు 20 లక్షల ఎకరాల్లో ఆయిల్‌పామ్ సాగుకు అనుకూలత ఉందని మంత్రి తెలిపారు. కనీసం 10 లక్షల ఎకరాల్లో ఆయిల్‌పామ్ సాగు జరిగేలా కార్యాచరణ రూపొందించాలని అధికారులను ఆదేశించారు. సమావేశంలో వ్యవసాయ శాఖ కార్యదర్శి కె. సురేంద్రమోహన్, ఉద్యాన శాఖ, ఆయిల్ ఫెడ్ ఎండీలు, సంబంధిత శాఖల అధికారులు పాల్గొన్నారు.