గ్రామాల్లో ఉపాధి పనులు ముమ్మరం చేయాలి: పంచాయతీరాజ్ శాఖ మంత్రి సీతక్క
ప్రజాసంక్షేమం న్యూస్ హైదరాబాద్:
ఎల్ నినో ప్రభావంతో ఎదురయ్యే నీటి ఎద్దడి, కరువు పరిస్థితులను సమర్థంగా ఎదుర్కొనేందుకు గ్రామస్థాయిలో ముందస్తు చర్యలు చేపట్టాలని పంచాయతీరాజ్ శాఖ మంత్రి సీతక్క అధికారులకు సూచించారు.బీఆర్కే భవన్‌లోని SERP కార్యాలయం నుంచి ఉన్నతాధికారులతో కలిసి నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌లో రాష్ట్రవ్యాప్తంగా సుమారు 12 వేల మంది సర్పంచులు, పంచాయతీ కార్యదర్శులు, సంబంధిత అధికారులతో మాట్లాడి గ్రామాల్లో చేపడుతున్న అభివృద్ధి పనులు, ఉపాధి హామీ పనుల పురోగతిని సమీక్షించారు. గ్రామాల్లో కూలీలను సమీకరించి నిరంతరంగా ఉపాధి హామీ పనులు కల్పించాలని మంత్రి సూచించారు. ఫామ్ పాండ్లు, ఇంకుడు గుంతలు, బోర్‌వెల్ రీచార్జ్ పనులు, చెక్‌డ్యామ్‌ల నిర్మాణం, చెరువుల పునరుద్ధరణకు ప్రాధాన్యత ఇవ్వాలని ఆదేశించారు.వర్షపు నీటిని ఒడిసిపట్టి భూగర్భ జలాలను పెంపొందించే పనులను వేగవంతం చేయాలని, రానున్న రోజుల్లో పశువులకు మేత, తాగునీటి కొరత ఏర్పడకుండా ముందస్తు ఏర్పాట్లు చేయాలని స్పష్టం చేశారు. కరువు పరిస్థితులను ఎదుర్కొనేందుకు గ్రామస్థాయిలో సమన్వయంతో పనిచేస్తూ ప్రజలకు ఇబ్బందులు కలగకుండా చర్యలు తీసుకోవాలని మంత్రి సీతక్క అధికారులకు దిశానిర్దేశం చేశారు.