యుద్ధప్రాతిపదికన ప్రక్రియ పూర్తి చేయాలి: మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి
కలెక్టర్లకు ఇప్పటికే నిధులు.. పెండింగ్ సమస్యలను సత్వరం పరిష్కరించాలి
కాలువలు, పర్యావరణ అనుమతులు, ఎంఎంఆర్ ప్యాకేజీ–3పై సమీక్ష
ప్రజాసంక్షేమం న్యూస్ హైదరాబాద్:గౌరవెల్లి ప్రాజెక్టుకు సంబంధించిన భూసేకరణ, పునరావాస ప్రక్రియను యుద్ధప్రాతిపదికన పూర్తి చేయాలని నీటిపారుదల,పౌర సరఫరాల శాఖ మంత్రి ఎన్.ఉత్తమ్ కుమార్ రెడ్డి అధికారులను ఆదేశించారు. డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ సచివాలయంలో గౌరవెల్లి ప్రాజెక్టుపై అధికారులతో మంత్రి ప్రత్యేక సమీక్ష నిర్వహించారు.ఈ సమావేశంలో రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్, మహబూబాబాద్ లోక్‌సభ సభ్యుడు బలరాం నాయక్ తదితరులు పాల్గొన్నారు. సిద్దిపేట, హనుమకొండ, కరీంనగర్ జిల్లాల్లో భూసేకరణకు సంబంధించిన వివరాలు, పెండింగ్ అంశాలపై సమీక్షించారు.
నిర్వాసితుల సమస్యలపై ప్రత్యేక దృష్టి:గౌరవెల్లి నిర్వాసితుల పునరావాస సమస్యలపై సంబంధిత అధికారులు, ఉన్నతాధికారులతో మంత్రి సమగ్రంగా చర్చించారు. భూసేకరణకు అవసరమైన నిధులు ఇప్పటికే సంబంధిత జిల్లాల కలెక్టర్లకు చేరాయని తెలిపారు. భూసేకరణ, పునరావాస ప్రక్రియ వేగవంతం చేసేందుకు సత్వరం చర్యలు చేపట్టాలని సూచించారు.అలాగే ప్రాజెక్టుకు సంబంధించిన అటవీ నోటిఫికేషన్ ప్రక్రియను యుద్ధప్రాతిపదికన పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. ప్రాజెక్టు విషయంలో ఏవైనా సమస్యలు ఉంటే వెంటనే తమ దృష్టికి తీసుకురావాలని స్పష్టం చేశారు.
కాలువలు, పర్యావరణ అంశాలపై సమీక్ష:
సమీక్షలో ఎడమ, కుడి కాలువల అంచనాలు, ప్రతిపాదనలతో పాటు పంపిణీ కాలువల టెండర్ ప్రతిపాదనల స్థితిని పరిశీలించారు. ప్రాజెక్టులో నీటి నింపుదల, విడుదలకు సంబంధించిన నివేదికలపైనా చర్చించారు.పర్యావరణ అనుమతులు,ఎన్‌జీటీ కేసుకు సంబంధించిన అంశాలతో పాటు ఎంఎంఆర్ ప్యాకేజీ–3 ప్రతిపాదనల పురోగతిపై కూడా మంత్రి అధికారులను అడిగి తెలుసుకున్నారు.సమీక్షలో నీటిపారుదల శాఖ కార్యదర్శి ఇ. శ్రీధర్, భూసేకరణ–పునరావాస కమిషనర్ శివకుమార్ నాయుడు,ఈఎన్‌సీ జనరల్ రమేష్ బాబు, ఈఎన్‌సీ ఓఅండ్‌ఎం మధుసూదన్ రావు, జాయింట్ సెక్రటరీ కే. శ్రీనివాస్తో పాటు సంబంధిత జిల్లాల అధికారులు పాల్గొన్నారు.