PRAJA SANKSHEMAM NEWS
Newspaper Banner
Date of Publish : 25 October 2026, 4:24 pm Posted by : Praja Sankshemam News

జగదీష్‌రెడ్డి ప్రెస్‌మీట్‌ ప్రజల దృష్టి మళ్లించే ప్రయత్నం: వేముల వీరేశం

విద్యుత్ కొనుగోళ్లు, యాదాద్రి పవర్ ప్లాంట్‌పై ప్రశ్నలు
ప్రజాసంక్షేమం న్యూస్ | హైదరాబాద్.

జగదీష్‌రెడ్డి నిర్వహించిన ప్రెస్‌మీట్‌ ఆయనకే ప్రతికూలంగా మారిందని ప్రభుత్వ విప్‌, నకిరేకల్‌ ఎమ్మెల్యే వేముల వీరేశం విమర్శించారు. గత బీఆర్‌ఎస్‌ ప్రభుత్వ హయాంలో విద్యుత్‌, సాగునీటి రంగాల్లో తీసుకున్న నిర్ణయాలపై సమాధానం చెప్పాలని డిమాండ్‌ చేశారు. హైదరాబాద్‌లోని సీఎల్పీ మీడియా సెంటర్‌లో ఆయన మాట్లాడారు.విద్యుత్‌ శాఖ మంత్రిగా ఉన్న సమయంలో సింగరేణిపై ఎన్ని సమీక్షలు నిర్వహించారని జగదీష్‌రెడ్డిని ప్రశ్నించారు. యాదాద్రి పవర్‌ ప్లాంట్‌ కోసం విదేశీ బొగ్గు దిగుమతుల ఒప్పందం, ప్రతిమా గ్రూపునకు దీర్ఘకాలిక కాంట్రాక్టు, ఛత్తీస్‌గఢ్‌ నుంచి అధిక ధరకు విద్యుత్‌ కొనుగోలు వంటి అంశాలపై వివరణ ఇవ్వాలని కోరారు. యాదాద్రి ప్లాంట్‌ నిర్మాణంలో అవకతవకలు జరిగాయన్న ఆరోపణలపైనా సమాధానం చెప్పాలన్నారు.
రైతులకు విద్యుత్‌, సాగునీరు అందించడమే లక్ష్యం:
ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి నాయకత్వంలోని కాంగ్రెస్‌ ప్రభుత్వం రైతులకు సాగునీరు అందించేందుకు, విద్యుత్‌ అవసరాలు తీర్చేందుకు కట్టుబడి ఉందని వీరేశం తెలిపారు. ప్రస్తుతం 20 వేల మెగావాట్ల విద్యుత్‌ అందిస్తున్నామని, సరఫరాలో అంతరాయాలు నివారించేందుకు ఆరుగురు ఐఏఎస్‌ అధికారులను నియమించినట్లు పేర్కొన్నారు. భవిష్యత్తు అవసరాల కోసం సౌర విద్యుత్‌ ఉత్పత్తిని పెంచుతున్నట్లు వెల్లడించారు.దున్నపోతుల లిఫ్ట్‌, శివన్నగూడెం ప్రాజెక్టు, అయిటిపాముల లిఫ్ట్‌ ప్రాజెక్టుల పనులు ఎందుకు పూర్తి చేయలేదో బీఆర్‌ఎస్‌ నేతలు వివరించాలని డిమాండ్‌ చేశారు. మూసీ ప్రాజెక్టు ద్వారా 30 వేల ఎకరాలకు సాగునీరు అందిస్తున్నట్లు తెలిపారు. మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి సాగునీటి ప్రాజెక్టుల పురోగతికి కృషి చేస్తున్నారని ప్రశంసించారు.
బీఆర్‌ఎస్‌పై రాజకీయ విమర్శలు:
సూర్యాపేట మున్సిపల్‌ ఎన్నికలతో పాటు ఎంపీ, పంచాయతీ, మున్సిపల్‌ ఎన్నికల్లో బీఆర్‌ఎస్‌కు ప్రజలు తగిన సమాధానం చెప్పారని వీరేశం వ్యాఖ్యానించారు. కేసీఆర్‌, కేటీఆర్‌, హరీశ్‌రావు, జగదీష్‌రెడ్డి ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారని ఆరోపించారు. తెలంగాణ ఉద్యమంలో 1,200 మంది చేసిన బలిదానాలను రాజకీయ ప్రయోజనాల కోసం ఉపయోగించుకుంటున్నారని విమర్శించారు.విద్యుత్‌, సాగునీటి రంగాలపై కాంగ్రెస్‌, బీఆర్‌ఎస్‌ మధ్య కొనసాగుతున్న రాజకీయ విమర్శల నేపథ్యంలో వీరేశం ఈ వ్యాఖ్యలు చేశారు.