PRAJA SANKSHEMAM NEWS
Newspaper Banner
Date of Publish : 28 October 2026, 6:11 pm Posted by : Praja Sankshemam News

ట్రీటెడ్ వాటర్ వినియోగం తప్పనిసరి చేయాలి!

ఎస్‌టీపీల నిర్వహణలో ఏఐ సాంకేతికతను వినియోగించాలి: సీఎం రేవంత్ రెడ్డి
ప్రజాసంక్షేమం న్యూస్ హైదరాబాద్,అక్టోబర్ 28

రాష్ట్రంలో శుద్ధి చేసిన మురుగునీటి (ట్రీటెడ్ వాటర్) వినియోగాన్ని విస్తృతం చేయాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. ఎంసీఆర్ హెచ్‌ఆర్‌డీ బోధి పెవిలియన్‌లో ఎస్‌టీపీలు, ట్రీటెడ్ వాటర్ వినియోగంపై నిర్వహించిన సమీక్షలో ఆయన మాట్లాడారు. నీటి నాణ్యత విషయంలో ఎట్టి పరిస్థితుల్లోనూ రాజీ పడొద్దని, భవిష్యత్ అవసరాలను దృష్టిలో పెట్టుకొని పటిష్టమైన కార్యాచరణ రూపొందించాలని సూచించారు.ట్రీటెడ్ వాటర్ ట్రీట్‌మెంట్ ప్లాంట్లలో ఏఐ సాంకేతికతను వినియోగించాలని, ప్రతి ప్లాంట్‌కు ప్రత్యేక అధికారిని నియమించాలని సీఎం ఆదేశించారు. ప్లాంట్లన్నింటినీ కమాండ్ కంట్రోల్ సెంటర్‌తో అనుసంధానించడంతో పాటు హైడ్రా ద్వారా నిరంతర పర్యవేక్షణ చేపట్టాలని స్పష్టం చేశారు. ట్రీటెడ్ వాటర్ ట్యాంకర్ల కదలికలను ట్రాక్ చేసే వ్యవస్థను ఏర్పాటు చేయాలన్నారు.ఔటర్ రింగ్ రోడ్డుతో పాటు ఇతర ప్రాంతాల్లోని ల్యాండ్‌స్కేపింగ్, రోడ్ల శుభ్రత పనులకు శుద్ధి చేసిన నీటినే వినియోగించాలని సూచించారు. సచివాలయం, ముఖ్యమంత్రి కార్యాలయ ప్రాంగణాలు, పబ్లిక్ పార్కుల్లోనూ ట్రీటెడ్ వాటర్ వినియోగించాలని చెప్పారు. ప్రభుత్వ కార్యాలయాల్లో తాగునీరు అవసరం లేని ఇతర పనులకు 100 శాతం శుద్ధి చేసిన నీటిని వినియోగించేలా తప్పనిసరి ఆదేశాలు జారీ చేయాలని పేర్కొన్నారు.రైల్వే శాఖ, మెట్రో రైల్ వ్యవస్థలను కూడా ట్రీటెడ్ వాటర్ వినియోగ పరిధిలోకి తీసుకురావాలని సీఎం సూచించారు. డేటా సెంటర్లకు శుద్ధి చేసిన నీటిని సరఫరా చేసేలా చర్యలు చేపట్టాలని, ప్రైవేట్ ఎస్‌టీపీల ఏర్పాటును ప్రోత్సహించాలని ఆదేశించారు. భవన నిర్మాణ అనుమతుల సమయంలోనే ట్రీటెడ్ వాటర్ వినియోగానికి సంబంధించిన నిబంధనలు విధించాలని తెలిపారు.ట్రీటెడ్ వాటర్ సరఫరా కోసం టోల్‌ఫ్రీ నంబర్ ఏర్పాటు చేయడంతో పాటు ప్రజల్లో విస్తృత అవగాహన కల్పించాలని సీఎం సూచించారు. ఎస్‌టీపీలను సోలార్ విద్యుత్‌తో నిర్వహించే అవకాశాలను పరిశీలించాలని ఆదేశించారు. నవంబర్ 1 నుంచి డిసెంబర్‌లో నిర్దేశించిన గడువు వరకు కార్యాచరణ అమలయ్యేలా చూడాలన్నారు.రాష్ట్రంలో భవిష్యత్తులో తాగునీటి సమస్య తలెత్తకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలని, నీటి సరఫరాపై నిరంతరం పర్యవేక్షణ ఉండాలని సీఎం రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరించకుండా బాధ్యతాయుతంగా పనిచేయాలని ఆదేశించారు.ఈ సమీక్షలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సంజయ్ జాజు, సీఎంఓ కార్యదర్శి మాణిక్ రాజ్, పాఠశాల విద్యాశాఖ డైరెక్టర్ నవీన్ నికోలస్, సైబరాబాద్ మున్సిపల్ కమిషనర్ సృజన, మల్కాజిగిరి మున్సిపల్ కమిషనర్ వినయ్ కృష్ణారెడ్డి, జలమండలి ఎండీ అశోక్ రెడ్డి, టీజీఎస్‌పీడీసీఎల్ ఎండీ జితేష్ వి. పాటిల్, కాలుష్య నియంత్రణ మండలి సభ్య కార్యదర్శి రవి, సమాచార, పౌర సంబంధాల శాఖ ప్రత్యేక కమిషనర్ ముకుందరెడ్డి తదితరులు పాల్గొన్నారు.