ఆర్‌అండ్‌బీ,పంచాయతీరాజ్,విద్యుత్ శాఖల అధికారులతో ఎమ్మెల్యే బాలు నాయక్ సమీక్ష
ప్రజాసంక్షేమం న్యూస్ దేవరకొండ:దేవరకొండ నియోజకవర్గంలో ప్రజలకు అవసరమైన మౌలిక వసతుల కల్పనకు ప్రాధాన్యత ఇవ్వాలని ఎమ్మెల్యే నేనావత్ బాలు నాయక్ అధికారులను ఆదేశించారు. బుధవారం ఆర్‌అండ్‌బీ, పంచాయతీరాజ్, విద్యుత్ శాఖల అధికారులతో సమీక్ష నిర్వహించారు.ఈ సందర్భంగా గతంలో చేపట్టిన, ప్రస్తుతం కొనసాగుతున్న, పెండింగ్‌లో ఉన్న పనులతో పాటు కొత్తగా చేపట్టాల్సిన అభివృద్ధి పనులపై చర్చించారు.ఆర్‌అండ్‌బీ పరిధిలో రోడ్లు, వంతెనలు, కల్వర్టుల నిర్మాణం, మరమ్మతులను వేగవంతం చేయాలని, దెబ్బతిన్న రహదారులను గుర్తించి చర్యలు చేపట్టాలని సూచించారు.పంచాయతీరాజ్ శాఖ పరిధిలో గ్రామాలు, తండాల్లో సీసీ రోడ్లు, అంతర్గత రహదారులు, డ్రైనేజీ పనులను ప్రాధాన్యతతో చేపట్టి, పూర్తికాని పనులను త్వరగా పూర్తి చేయాలని ఆదేశించారు.విద్యుత్ శాఖ పరిధిలో స్తంభాలు, ట్రాన్స్‌ఫార్మర్లు, విద్యుత్ లైన్లు, వీధి దీపాలు, సరఫరా సమస్యలను పరిష్కరించి, తరచూ సమస్యలు ఎదురయ్యే ప్రాంతాలకు శాశ్వత పరిష్కారం చూపాలని సూచించారు.నియోజకవర్గంలోని పట్టణం, మండల కేంద్రాలు, గ్రామాలు, తండాల్లో ప్రజల అవసరాలను క్షేత్రస్థాయిలో గుర్తించి ప్రాధాన్యత క్రమంలో పనులు చేపట్టాలని, శాఖల మధ్య సమన్వయంతో వేగంగా పూర్తి చేయడంతో పాటు నాణ్యతకు ప్రాధాన్యత ఇవ్వాలని ఎమ్మెల్యే స్పష్టం చేశారు.